Pegasus : ఔను .. మోడీ సర్కార్ "పెగాసస్"ను కొనుగోలు చేసింది.. న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం !
ఇజ్రాయెల్ నుంచి పెగాసస్ స్పైవేర్‌ను భారత ప్రభుత్వం కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఇది మరోసారి పెగాసస్ అంశాన్ని తెరపైకి తెచ్చే అవకాశం కనిపిస్తోంది.
దేశ రాజకీయాల్లో మరోసారి "పెగాసస్ స్పైవేర్"తో నిఘా పెట్టిన అంశం దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది. ఈ స్పైవేర్‌తో భారత ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీకి చెందిన కొంత మంది నేతలు.. అలాగే న్యాయమూర్తుల మీద కూడా నిఘా పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. అయితే కేంద్రం ఈ ఆరోపణల్ని తోసి పుచ్చింది. కానీ ఆ స్పైవేర్ ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేశారా లేదా అన్నదానిపై మాత్రం స్పష్టంగా చెప్పడం లేదు. భారత ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్‌ను రక్షణ ఉత్పత్తుల కొనుగోలులో భాగంగా .. ఇజ్రాయెల్‌ను నుంచి కొన్నదని తాజాగా అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ దినపత్రిక ప్రకటించింది.
ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టిన తరవాత 2017లో ఇజ్రాయెల్ పర్యటనకు ప్రధాని వెళ్లారు. మూడు రోజుల పాటు పర్యటించారు. ఆ పర్యటనలో రెండు బిలియన్ డాలర్ల విలువైన రక్షణ పరికరాల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారు. ఇందులోనే పెగాసస్ స్పైవేర్ కూడా ఉందని న్యూయార్క్ టైమ్స్ ప్రకటించింది. అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఈ పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందని కానీ దాన్ని వినియోగించకూడదని నిర్ణయం తీసుకుందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఈ స్పైవేర్‌కు సంబంధించిన పలు కీలకమైన విషయాలను న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
పెగాసస్ స్పైవేర్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై ప్రస్తుతం సుప్రీంకోర్టు స్వతంత్ర నిపుణుల కమిటీతో దర్యాప్తు నిర్వహింపచేస్తోంది. నిపుణుల కమిటీ పనితీరును సుప్రీంకోర్టే పర్యవేక్షిస్తోంది. వ్యక్తుల గోప్యత హక్కు ఉల్లంఘన జరిగిందా లేదా అన్నది ఈ కమిటీ పరిశీలిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. పెగాసస్ స్పైవేర్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత దేశంలో తీవ్ర దుమారం రేపింది. స్వతంత్ర దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.
అయితే కేంద్ర ప్రభుత్వం విచారణకు అంగీకరించలేదు. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసినా స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అసంపూర్ణ అఫిడవిట్ సమర్పించింది. స్పైవేర్‌ను ఉపయోగించామా లేదా అన్నదానిపై కేంద్రం నుంచి కచ్చితమైన సమాధానం రాలేదు. దేశ భద్రత పేరు చెప్పి సమాచారాన్ని ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో సుప్రీంకోర్టు స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఉండేందుకు చాలా మంది నిపుణులు ఆసక్తి చూపించలేదు. పెగాసస్‌తో 300 మందికి పైగా భారతీయులపై నిఘా పెట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిశోర్, అభిషేక్ బెనర్జీ, పలువురు కేంద్రమంత్రులు, పాత్రికేయులు కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ నిజం ఏమిటో ఇప్పటి వరకూ తేలలేదు.