Pegasus Spyware Case: 'పెగాసస్'పై సుప్రీం కీలక నిర్ణయం.. దర్యాప్తునకు నిపుణుల కమిటీ ఏర్పాటు
పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ముగ్గురు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.
పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది. ముగ్గురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్ నేతృత్వంలోని ఈ కమిటీలో సభ్యులుగా అలోక్ జోషి, సందీప్ ఒబెరాయ్ ఉన్నారు.
Pegasus matter | Supreme Court says there has been no specific denial by Centre in the issue, thus we have no option but to accept the submissions of petitioner prima facie and we appoint an expert committee whose function will be overseen by the Supreme Court. pic.twitter.com/JUoGEaqLzo
— ANI (@ANI) October 27, 2021
కీలక వ్యాఖ్యలు..
తీర్పు వెల్లడించే సమయంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పెగాసస్‌పై వచ్చిన ఆరోపణలు క్షుణ్నంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది.
పెగాసస్ దుమారం..
పెగాసస్ స్పైవేర్ ఇటీవల దుమారం రేపింది. ప్రముఖ వార్తా సంస్థ ది వైర్ ప్రచురించిన కథనాల ప్రకారం దేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా సహా ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ఉన్న ప్రహ్లాద్ పటేల్, అశ్వినీ వైష్ణవ్‌ల ఫోన్లు హ్యాక్ అయ్యాయి.
తృణమూల్ పార్టీ ఎంపీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముఖ్యమంత్రి మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, మమత వ్యక్తిగత కార్యదర్శి కూడా పెగాసస్ జాబితాలో ఉన్నారు. మాజీ సీజేఐ రంజన్ గొగొయిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ ఫోనుతో పాటు ఆమె సమీప బంధువులకు చెందిన 11 నంబర్లు సైతం ఈ జాబితాలో ఉండటం సంచలనంగా మారింది.
తెలుగు రాష్ట్రాల్లోనూ స్పైవేర్ బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. విరసం (విప్లవ రచయితల సంఘం) నేత వరవరరావు కుమార్తె పవన పేరు కూడా ఈ జాబితాలో ఉందని ఓ ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. తన ఫోన్ లో స్పైవేర్ ఉందనే విషయం 2019 అక్టోబరులో వాట్సాప్ సంస్థ ద్వారా తనకు తెలిసిందని పవన చెప్పినట్లుగా కథనంలో పేర్కొంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి