Corona Alert: 14 నెలల చిన్నారికి కరోనా - మీ పిల్లలూ జాగ్రత్త
Telugu States Corona Cases: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులు, వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.
Parents Should be Alert for Children Due to Corona Situation: దేశవ్యాప్తంగా కరోనా న్యూ వేరియంట్ జేఎన్ 1 (Corona New Variant jn1) వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఏడాది కాలంగా ఊపిరి పీల్చుకున్న ప్రజలు కరోనా కేసులు (Corona Cases) పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. అటు, కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలతో రాష్ట్రాల్లో వైద్య ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. గతం వారం రోజులుగా కేరళ సహా ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. కేరళలోనే మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. మరోవైపు, వాతావరణ మార్పులతోనూ ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. డిసెంబర్ మొదటి వారం నుంచి జలుబు, దగ్గు, జ్వర పీడితులు ఎక్కువయ్యారు. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మాస్కులు ధరించి, జన సమూహం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని సూచిస్తున్నారు.
14 నెలల చిన్నారికి
తెలంగాణలో (Telangana) కొత్తగా 6 కేసులు నమోదు కాగా, ఇప్పటివరకూ 20 కేసులు నమోదయ్యాయి. 19 యాక్టివ్ కేసులుండగా (Active Cases), ఒకరు కోలుకున్నారు. హైదరాబాద్ (Hyderabad) లోని నిలోఫర్ ఆస్పత్రిలో (Nilophar Hospital) తొలి కొవిడ్ కేసు నమోదైంది. నాలుగైదు రోజుల క్రితం నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన 14 నెలల చిన్నారికి తీవ్ర జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో నిలోఫర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అనంతరం అనుమానంతో వైద్యులు పరీక్షలు నిర్వహించగా కొవిడ్ పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం చిన్నారిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య మెరుగైందని, వెంటిలేటర్ తొలగించి ఆక్సిజన్ సాయంతో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వైద్యాధికారి శ్రీనివాస్ కల్యాణి తెలిపారు. కొవిడ్ కొత్త వేరియంట్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ ధరించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
మీ పిల్లలూ జాగ్రత్త
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలుబు, దగ్గు లక్షణాలుంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. పదేళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వారు, గర్భిణులు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని స్పష్టం చేశారు.
- పిల్లలు మాస్క్ ధరించేలా జాగ్రత్త వహించాలి. వారి చేతులను తరచూ శానిటైజ్ చేయాలి. ఇతర పిల్లలతో ఆడుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండేలా చూడాలి.
- ఉదయం, సాయంత్రం వారు ఆరుబయటకు వెళ్లకుండా చూడాలి. ప్రస్తుతం శీతల గాలుల కారణంగా వారు జలుబు, దగ్గు, జ్వరం బారిన పడే అవకాశం ఉంది.
- రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని అందించాలి. పండ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్ వారి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
- శ్వాస సంబంధిత సమస్యలున్న చిన్నారుల పట్ల స్పెషల్ కేర్ తీసుకోవాలి. పిల్లలను జన సమూహం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉంచాలి. ముఖ్యంగా చిన్నారులను ఇతరులు అనవసరంగా చేతులతో తాకడం, మరీ చిన్న పిల్లలైతే ముద్దులు పెట్టడం వంటివి చేయకుండా చూడాలి.
పెద్దలు సైతం
కరోనా నేపథ్యంలో పెద్దలు సైతం జాగ్రత్తలు వహించాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వృద్ధులు, శ్వాస సంబంధిత సమస్యలున్న వారు ఉదయం, సాయంత్రం వాకింగ్ వంటి వాటికి దూరంగా ఉండాలంటున్నారు.
- జన సమూహం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి. కచ్చితంగా మాస్క్ ధరించాలి. తరచూ చేతులను శుభ్రపరచుకోవాలి. శానిటైజర్ వెంట ఉంచుకోవడం ఉత్తమం.
- అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు మానుకోవాలి. శారీరక పరిశుభ్రత పాటించడం తప్పనిసరి.
- రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్ తీసుకోవాలి. ప్రతి రోజూ వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయాలి.
ఈ వేరియంట్ ప్రమాదకరం కాదని, అయితే, అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా లక్షణాలుంటే వెంటనే వైద్యున్ని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ ను నియంత్రించవచ్చని స్పష్టం చేస్తున్నారు.
Also Read: Corona Cases in AP: ఏపీలో కొత్తగా 3 కరోనా కేసులు - తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న వైరస్