Infant In Hand Bag: సంచిలో పసికందు, గుక్కపెట్టి ఏడ్వడంతో గుర్తుపట్టిన ఆటో డ్రైవర్ - విచారణలో షాకింగ్ నిజాలు
Infant In Hand Bag: ఎన్టీఆర్ జిల్లాలో రోజులు కూడా నిండని పసికందును ఓ వృద్ధుడు సంచిలో తీసుకెళ్తూ పట్టుబడ్డాడు.
Infant In Hand Bag: ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. రోజులు కూడా నిండని, బొడ్డు తాడు కూడా ఇంకా తెగిపోని పసికందును ఓ వృద్ధుడు సంచిలో తీసుకెళ్తూ పట్టుబడ్డాడు. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. అయితే ఆ పసికందును తీసుకెళ్లి ఏం చేయాలనుకున్నాడు, అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియాల్సి ఉంది.
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి జంగారెడ్డి గూడెంకు చెందిన ఓ మహిళ ఇటీవల ప్రసవించింది. 5 రోజుల క్రితం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చింది. పుట్టిన ఇద్దరు పిల్లల్లో ఒక పసికందుకు ఆరోగ్యం బాగోలేదని వైద్యులు గుర్తించారు. అయితే అదే ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ నర్సు సహాయంతో ఓ ముసలి వ్యక్తికి ఆ రోజులు కూడా నిండని పసికందును అప్పగించారు ఆ దంపతులు. ఆ శిశువును ఆ వృద్ధుడు సంచిలో పడుకోబెట్టి తీసుకెళ్లాడు. అలా తీసుకెళ్తున్న క్రమంలో ఓ ఆటోలో ఎక్కాడు. సంచిలో ఉన్న పసికందు గుక్కపెట్టి ఏడ్వగా.. ఆటో డ్రైవర్ గుర్తించాడు. వెంటనే ఆటోను రోడ్డు పక్కకు ఆపి ఆ వృద్ధుడి సంచిని తనిఖీ చేయగా.. అందులో పసికందు ఉండటాన్ని చూసి షాక్ తిన్నాడు. వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఫోన్ ద్వారా వృద్ధుడి వివరాలు సేకరించిన పోలీసులు.. విచారణ చేయడం ప్రారంభించారు. ఆ వృద్దుడు ఆ పసికందును ఎక్కడి నుంచి తీసుకువస్తున్నాడు, ఆ శిశువును ఎత్తుకొచ్చాడా, ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు అనే విషయాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.