Nipah Virus: నిఫా వైరస్ కలకలం-కేరళలో ఇద్దరు అనుమానాస్పద మృతి
Nipah Virus: నిఫా వైరస్ కలకలం. కేరళలో ఇద్దరు అనుమానాస్పద మృతి.
మరోసారి నిఫా వైరస్ కలకలం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందడంతో నిఫా వైరస్ సోకిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోజికోడ్ జిల్లాలో కేరళ ఆరోగ్య శాఖ హెల్త్ అలర్ట్ ప్రకటించింది. పరిస్థితిపై సమీక్షించేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ అత్యవసరంగా ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కోజికోడ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఇద్దరు వ్యక్తు తీవ్ర జ్వరంతో బాధపడుతూ మరణించారు. దీంతో వైద్య సిబ్బంది నిఫా వైరస్ సోకి ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేశారు. మరణించిన వ్యక్తుల్లో ఒకరి బంధువు కూడా జ్వరంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
తొలుత ఆగస్టు ౩౦న 49 ఏళ్ల వ్యక్తి మరణించారు. తర్వాత సెప్టెంబరు 11న సోమవారం 40 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరూ కూడా జ్వరం, న్యుమోనియా లాంటి లక్షణాలతో బాధపడ్డారు. చనిపోయిన వారి నుంచి సేకరించిన నమూనాలను అధికారులు పరీక్షలకు పంపించారు. సంబంధిత ప్రాంతంలో తాము జ్వర సర్వే చేసినట్లు అధికారులు వెల్లడించారు. చనిపోయిన వ్యక్తి ఇంటికి 20 కిలోమీటర్ల దూరంలో ఈ సీజన్‌లో తొలి జ్వరం రికార్డైందని వారు తెలిపారు.
2018 మే నెలలో తొలిసారిగా దక్షిణ భారతదేశంలో నిఫా వైరస్ వ్యాప్తి జరిగింది. అప్పుడు మొదటి కేసు కేరళలోని కోజికోడ్‌లో నమోదైంది. అప్పుడు సుమారు 17 మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో రోగులకు చికిత్స అందించిన ఒక నర్సు కూడా చనిపోయారు. మళ్లీ 2021 లో కూడా కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ వ్యాపించి పలువురు మృత్యువాతపడ్డారు. ఇన్‌ఫెక్షన్ కారణంగా ఓ 12 ఏళ్ల బాలుడు చనిపోయిన ఘటన నమోదైంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిఫా వైరస్ సంక్రమణ అనేది జూనోటిక్ వ్యాధి. అంటే ఇది జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. కలుషితమైన ఆహారం లేదా నేరుగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాధి ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తులు తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతారు. జ్వరం ఎక్కువగా వస్తుంది. మరణాల రేటు దాదాపు 70 శాతం ఉంటుందని డబ్ల్యుహెచ్‌ఓ వెల్లడించింది. ఈ వైరస్‌కు ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు.