New Parliament Opening: కొత్త పార్లమెంట్‌పై RJD వివాదాస్పద ట్వీట్, శవపేటికతో పోల్చడంపై దుమారం
New Parliament Opening: కొత్త పార్లమెంట్ ఆకారాన్ని శవపేటికతో పోల్చుతూ RJD చేసిన ట్వీట్ దుమారం రెేపుతోంది.
New Parliament Opening:
ట్వీట్ దుమారం..
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి 21 విపక్ష పార్టీలు హాజరు కాలేదు. పార్లమెంట్‌ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాత్రమే ఓపెన్ చేయాలని...ప్రధానికి హక్కేముందని ప్రశ్నించాయి. అందుకే...ఈ కార్యక్రమాన్ని బైకాట్ చేస్తున్నట్టు ప్రకటించాయి. అయితే...దీనిపై ఎన్నోవాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే RJD చేసిన ఓ ట్వీట్ దుమారం రేపుతోంది. పార్లమెంట్ ప్రారంభం కాగానే ఓ ట్వీట్ చేసింది. అందులో రెండు ఫోటోలున్నాయి. కొత్త పార్లమెంట్‌ని శవపేటికతో పోల్చుతూ ఫోటోలు పోస్ట్ చేసింది. కొత్త పార్లమెంట్ శవపేటిక ఆకారంలా ఉందని ట్వీట్ చేసింది. దీనిపై బీజేపీ భగ్గుమంది. ఎంతో పవిత్రమైన పార్లమెంట్‌ని శవపేటికతో పోల్చుతారా అని మండి పడింది. ఆర్‌జేడీ ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అయితే...ఈ పోస్ట్‌పై RJD ప్రతినిధి ఒకరు క్లారిటీ ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని అంతం చేయొద్దన్న ఉద్దేశంతో ఆ ట్వీట్ చేసినట్టు చెప్పారు.
"మన దేశంలో రాజకీయాలు, ప్రజాస్వామ్యం అలా అంతం కాకూడదన్న ఉద్దేశంతోనే ఆ పోస్ట్ పెట్టాం. మేం మొదటి నుంచి ఒకే విషయాన్ని పదే పదే చెబుతున్నాం. ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంట్ ఓ ఆలయం లాంటిది. అక్కడ అందరికీ మాట్లాడే అవకాశం ఉండాలి. ప్రస్తుతం ఆ అవకాశం లేకుండా పోతోంది. పూర్తి స్థాయిలో వాళ్లే అజమాయిషీ చెలాయించాలని చూస్తున్నారు. రాజ్యాంగాన్నీ లెక్క చేయడం లేదు. మేమేం హద్దులు దాటలేదు. ప్రధానితో పాటు రాష్ట్రపతి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉంటే బాగుండేది. ఇలాంటి వాటిని కచ్చితంగా ఖండించాల్సిందే"
- శక్తి యాదవ్, ఆర్‌జేడీ ప్రతినిధి
ये क्या है? pic.twitter.com/9NF9iSqh4L
— Rashtriya Janata Dal (@RJDforIndia) May 28, 2023
ఎన్నో ప్రత్యేకతలు..
10 డిసెంబర్ 2020న కొత్త పార్లమెంట్ భవనానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. గుజరాత్‌కు చెందిన హెచ్సీపీ సంస్థ ఈ కొత్త భవనాన్ని డిజైన్ చేసింది. లోక్ సభ ఛాంబర్లో 888 మంది, రాజ్యసభ ఛాంబర్లో 384 మంది సభ్యులు, లోక్ సభ హాల్లో 1,272 మంది సభ్యులు కూర్చునే అవకాశం ఉంది. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మించిన ఈ కొత్త భవనంలో విశాలమైన కాన్ స్టిట్యూషన్ హాల్, పార్లమెంటు సభ్యుల కోసం లాంజ్, లైబ్రరీ, కేఫ్, డైనింగ్ ఏరియా, కమిటీ మీటింగ్ రూమ్స్, పెద్ద పార్కింగ్ ఏరియాతో పాటు వీఐపీ లాంజ్ ఉన్నాయి. ఈ పార్లమెంటు భవనం వైశాల్యం 64,500 చదరపు మీటర్లు. ఈ భవనానికి జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్ కర్మ ద్వార్ అనే మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. వీఐపీలు, ఎంపీలు, సందర్శకుల కోసం ప్రత్యేక ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. కొత్త పార్లమెంటు భవనంలోకి దివ్యాంగులు వెళ్లడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మంత్రిమండలి ఉపయోగం కోసం సుమారు 92 గదులు కేటాయించారు. కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి ఉపయోగించిన సామగ్రిని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తెప్పించారు.