New Education Rules: ఏడాదిలో రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించనున్న కేంద్రం
New Education Rules: ఏడాదిలో రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించనున్న కేంద్రం. నూతన జాతీయ విద్యా విధానాని(ఎన్‌ఈపీ)కి అనుగుణంగా కేంద్రం విద్యా వ్యవస్థలో పలు మార్పులు
new curriculum framework for school students: నూతన జాతీయ విద్యా విధానాని(ఎన్‌ఈపీ)కి అనుగుణంగా కేంద్రం విద్యా వ్యవస్థలో పలు మార్పులు చేపడుతోంది. ఏడాదిలో బోర్డు పరీక్షలను రెండు సార్లు నిర్వహించాలని నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్‌ను కేంద్ర విద్యా శాఖ రూపొందించింది. ఈ మేరకు బుధవారం విద్యా శాఖ ప్రకటన చేసింది. ఎన్‌ఈపీకి తగినట్లుగా 2024 అకడమిక్ సంవత్సరం కోసం కొత్త పాఠ్యపుస్తకాలను రూపొందిస్తామని పేర్కొంది. అలాగే 11, 12 తరగతుల విద్యార్థులు రెండు లాంగ్వేజ్ సబ్జెక్ట్స్‌ను చదవాలని, అందులో ఒకటి కచ్చితంగా భారతీయ భాష అయ్యి ఉండాలని వెల్లడించింది.
విద్యార్థులకు బోర్డు పరీక్షలు సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించాలని, అందులో బెస్ట్ స్కోర్‌ను వారు తీసుకోవడానికి అనుమతి ఉంటుందని కేంద్ర విద్యా శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న దానికంటే బోర్డు పరీక్షలను మరింత సులభతరం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గడమే కాకుండా వారు స్కోరు పెంచుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. పాఠాలు బట్టీ పట్టడం, నెలల తరబడి కోచింగ్‌ల అవసరం లేకుండా విద్యార్థుల అవగాహన సామర్థ్యం అంచనా వేసేలా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. పాఠాశాల బోర్డులు నిర్ణీత సమయంలో ఆన్ డిమాండ్ పరీక్షలను అందించేందుకు తగిన సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలని న్యూ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్‌లో వెల్లడించారు. అలాగే బోర్డు ఎగ్జామ్ టెస్ట్ డెవలపర్స్, ఎవాల్యుయేటర్స్ కూడా యూనివర్సిటీలు సర్టిఫై చేసిన కోర్సులను పూర్తి చేయాలని తెలిపారు.
కొత్త కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్ ప్రకారం.. విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచేందుకు అవకాశం ఉండేలా తగినంత సమయం ఉంటుందని, సంవత్సరానికి కనీసం రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడం వల్ల వారికి మంచి అవకాశం దొరుకుతుందని విద్యాశాఖ పేర్కొంది. రెండు సార్లు నిర్వహించడం వల్ల విద్యార్థులు తాము సిద్ధంగా ఉన్నామని భావించినప్పుడు పరీక్షలకు హాజరు కావొచ్చని, రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను తీసుకోవడానికి అనుమతి ఉంటుందని చెప్పారు. నూతన ఫ్రేమ్ వర్క్ ప్రకారం.. 11, 12 తరగతుల విద్యార్థులు ఎంచుకునే సబ్జెక్ట్‌లలో సైన్స్, కళలు, కామర్స్ వంటి వాటికి మాత్రమే పరిమితం కావని వెల్లడించారు. ఈ నిబంధనలు వచ్చే ఏడాది నంచి అమలయ్యే అవకాశం ఉంది.