Nellore Govt Hospitals : నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందని సేవలు, అడుగడుగునా సిబ్బంది నిర్లక్ష్యం!
Nellore Govt Hospitals : ప్రభుత్వ ఆసుపత్రులు పేరు చెబితేనే ప్రజలు హడలిపోతున్నాయి. మొన్న ఆత్మకూరులో కాంపౌండర్, సెక్యూరిటీ సిబ్బంది చికిత్స చేస్తే, ఇవాళ కావలిలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఒకరు మరణించగా, మరోకరు కోమాలో ఉన్న పరిస్థితి నెలకొంది.
Nellore Govt Hospitals : ఇటీవల ఆత్మకూరులో ప్రభుత్వ వైద్యుల బదులు, కాంపౌండర్, సెక్యూరిటీ సిబ్బంది ఓ యాక్సిడెంట్ బాధితుడికి ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత అతడిని నెల్లూరు జిల్లా వైద్యశాలకు తరలించగా మృత్యువాత పడ్డాడు. ఇవాళ కూడా కావలిలోని ప్రభుత్వ వైద్యశాలలో ఇలాంటి సీన్ రిపీటైంది. కిందిస్థాయి సిబ్బంది కానీ, కనీసం సెక్యూరిటీ గార్డు కూడా ఇక్కడ యాక్సిడెంట్ బాధితుల్ని పట్టించుకోలేదు.
వైద్యుల నిర్లక్ష్యం!
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని పెదపవని రోడ్డులో రెండు బైక్ లు ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఒకరు సిబ్బంది నిర్లక్ష్యంతో కోమాలో ఉన్నారు. క్షతగాత్రులకు సకాలంలో ఆక్సిజన్ సదుపాయం కూడా కల్పించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. బైక్ యాక్సిడెంట్ లో గాయపడిన సురేష్, అబ్దుల్లాను మొదట కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే సురేష్ ని అత్యవసర విభాగంలో చేర్చుకున్నా ఆక్సిజన్ అందించలేదు. చివరకు బంధువులు ఒత్తిడి తెస్తే ఆక్సిజన్ అతనికి అందించారు. అయితే కాసేపటికే అతను చనిపోయాడు.
అందుబాటులో లేని సిబ్బంది
యాక్సిడెంట్ లో గాయాలపాలైన అబ్దుల్లా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అబ్దుల్లాను 108 వాహనం నుంచి ఎమర్జెన్సీ వార్డులోకి మార్చేందుకు కూడా ఆస్పత్రి సిబ్బంది అందుబాటులో లేరు. చివరకు 108 సిబ్బంది చిన్నారులను తీసుకెళ్లే స్ట్రెచర్ పై క్షతగాత్రుడ్ని ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లారు. దారుణం ఏంటంటే స్ట్రెచర్ పై నుంచి అబ్దుల్లా నొప్పులు భరించలేక కిందపడిపోయాడు. కనీసం అతడిని పట్టించుకునేవారే లేరు. పక్క వార్డులో ఉన్నవారు కేకలు వేయడంతో సిబ్బంది వచ్చి అబ్దుల్లాను తిరిగి స్ట్రెచర్ పై పడుకోబెట్టారు. 108 వాహనం వచ్చినా కూడా డ్యూటీ డాక్టర్లు, ఏఎన్ఎంలు అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆ తర్వాత అబ్దుల్లా పరిస్థితి కూడా విషమించడంతో అతడిని నెల్లూరు ఆస్పత్రికి తరలించారు.
నాణెం మింగేసిన చిన్నారి
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లెపల్లెకు చెందిన బాలాజీ, అరుణ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు రాకేష్ ఉన్నాడు. బాలాజీ రోజు వారి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. బుధవారం సాయంత్రం తినుబండారాలు కొనుక్కొనేందుకు రాకేష్ కు తల్లి అరుణ ఐదు రూపాయలు ఇచ్చింది. అయితే తల్లి వద్ద డబ్బులు తీసుకున్న రాకేష్ తన స్నేహితులతో ఆడుకుంటూ తన వద్ద ఉన్న ఐదు రూపాయల కాయిన్ ను నోటిలో వేసుకున్నాడు. అలానే ఐదు రూపాయల బిళ్లను మింగేశాడు. నాణెం బాలుడి గొంతులో ఇరుక్కుపోయింది. ఇది చూసిన స్థానికులు రాకేష్ తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పారు. బాలుడు నోటిలో నుంచి నాణెం తీసేందుకు ప్రయత్నించారు కానీ నాణెం బయటికి రాకపోయే సరికి రాకేష్ తల్లిదండ్రులు హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గంటల కొద్దీ నిరీక్షణ
బాలుడిని ఎమర్జెన్సీ వార్డులో ఉన్న సిబ్బందికి చూపించి తన బాలుడు నోటిలో ఐదు రూపాయల నాణెం ఇరుక్కు పోయిందని చెప్పారు. అయితే ఆ సమయానికి వైద్యులు లేకపోయే సరికి వార్డులో ఉన్న నర్సులు బాలుడిని పరీక్షించి డాక్టర్ లేరని, కొంతసేపు వేచి ఉండమని చెప్పారు. ఎంతసేపు వేచి ఉన్నా డాక్టర్ రాక పోయేసరికి వార్డులో ఉన్న నర్సును అడిగారు. వైద్యులు వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని వేచి ఉండాలని చెప్పింది. చాలా సేపటి తర్వాత వైద్యులు రావడంతో బాలుడిని డాక్టర్ కు చూపించారు బాలుడి తండ్రి బాలజీ. అయితే బాలుడిని పరీక్షించిన వైద్యులు స్కానింగ్ తీయాలని చెప్పి ఆ చీటీని రాసి స్కానింగ్ తీసుకుని వస్తే, దాని రిపోర్ట్ ఆధారంగా నాణెం ఎక్కడ ఉందో గుర్తించి తీసేందుకు వీలు అవుతుందని చెప్పారు. వెంటనే ఆసుపత్రిలోని స్కానింగ్ సెంటర్ వద్దకు బాలుడిని తీసుకెళ్లారు బాలాజీ. అక్కడ స్కానింగ్ తీసే సిబ్బంది లేకపోయే సరికి గంటల కొద్ది బాలుడిని పెట్టుకుని తల్లిదండ్రులు నిరీక్షించారు. కానీ సిబ్బంది రాకపోయే సరికి, తిరిగి ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లి విషయం చెప్పి, స్కానింగ్ సిబ్బందికి ఫోన్ చేయించారు బాలాజీ. దీంతో స్కానింగ్ సెంటర్ వద్దకు వచ్చిన సిబ్బంది బాలుడికి స్కానింగ్ చేశారు.
ఉచిత సలహా
ఆ రిపోర్టును తీసుకుని వైద్యుల వద్దకు వెళ్లిన బాలుడి తల్లిదండ్రులకు నాణెన్ని తీసేందుకు వీలుకాదని, తిరుపతికి గానీ, వేలూరు సీఎంసీ ఆసుపత్రికి గానీ తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన బాలుడి తల్లిదండ్రులు, బంధువులు వైద్యులతో వాగ్వాదానికి దిగ్గారు. ఇక చేసేది లేక బాలుడిని బంధువుల సహాయంతో వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాలుడి గొంతు నుంచి చాకచక్యంగా ఐదు రూపాయల నాణెం తొలగించడంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.