Nagaland Killings: నాగాలాండ్ కాల్పుల అప్‌డేట్.. ఆ జవాన్లను ప్రశ్నించేందుకు ఆర్మీ అనుమతి
నాగాలాండ్ కాల్పుల ఘటనకు సంబంధించిన సైనికులను విచారించేందుకు సిట్‌కు అనుమతి ఇచ్చినట్లు భారత ఆర్మీ ప్రకటించింది.
నాగాలాండ్ కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తోన్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అన్ని విధాలా సహకరిస్తున్నట్లు భారత ఆర్మీ ప్రకటించింది. ఆ ఘటనకు సంబంధమున్న సైనికులను ప్రశ్నించేందుకు సిట్‌కు అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. వారి వాంగ్మూలాలను నమోదు చేయవచ్చని ఆర్మీ పేర్కొంది.
ఏం జరిగింది?
నాగాలాండ్ మోన్ జిల్లాలోని ఓటింగ్ వద్ద మిలిటెంట్ల కదలికలున్నట్లు బలగాలకు సమాచారం అందింది. దీంతో డిసెంబర్ 4న ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. అయితే అప్పుడే బొగ్గు గనిలో విధులు ముగించుకుని కార్మికులు తిరు గ్రామం నుంచి ట్రక్కులో ఇంటికి వెళ్తుండగా బలగాలు కాల్పులు జరిపాయి. కాల్పుల్లో 13 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ జవాను సైతం ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
నాగాలాండ్ కాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రకటన చేశారు. ఉగ్రవాదులనుకునే సైన్యం.. కూలీలపై కాల్పులు జరిపిందని అమిత్ షా అన్నారు.
ఈ కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలకు పరిహారం ప్రకటించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. మృతుల కుటంబాలకు రూ.11 లక్షల చొప్పున ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నాగాలాండ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇవ్వనుంది. ఈ మేరకు నాగాలాండ్ సీఎం నీఫియు రియో ప్రకటించారు.
Also Read: Petrol Price Cut Jharkhand: వాహనదారులకు గుడ్ న్యూస్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25 తగ్గింపు!