Dawood Ibrahim News: దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం, మృతి? - డాన్ సన్నిహితుడు ఛోటా షకీల్ సంచలన వ్యాఖ్యలు
World News: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చనిపోయాడంటూ వస్తోన్న వార్తలను అతని ప్రధాన అనుచరుడు ఛోటా షకీల్ ఖండించాడు. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Chota Shakeel Comments on Dawood Ibrahim Death Rumours: అండర్ వరల్డ్ డాన్, ముంబయి పేలుళ్ల సూత్రధారి మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీంపై (Dawood Ibrahim) విషప్రయోగం జరిగిందని, చనిపోయాడంటూ వస్తున్న వార్తలను దావూద్ ప్రధాన అనుచరుడు ఛోటా షకీల్ (Chota Shakeel) ఖండించాడు. దావూద్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు షకీల్ వెల్లడించాడని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. కాగా, దావూద్ పై విషప్రయోగం జరిగిందని, కరాచీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు గత రెండు రోజులుగా వార్తలు హల్చల్ చేశాయి. దీనిపై ముంబయి పోలీసులు సైతం దావూద్ సమీప బంధువుల నుంచి మరింత సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
షకీల్ ఏం చెప్పాడంటే.?
ఓ జాతీయ మీడియా నివేదిక ప్రకారం, డాన్ దావూద్ సజీవంగా, పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని చోటా షకీల్ ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. 'భాయ్ వెయ్యిశాతం ఫిట్ గా, ఆరోగ్యంగా ఉన్నాడు. అతనిపై విష ప్రయోగం జరిగిందనేది ఫేక్ న్యూస్. ఆ వార్త చూసి నేను షాకయ్యాను' అని వ్యాఖ్యానించాడని సమాచారం.
పాక్ మీడియాలో కథనాలు
దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగి తీవ్ర అనారోగ్యంతో పాకిస్థాన్ లోని కరాచీ ఆస్పత్రిలో చేరినట్లు ఆదివారం నుంచి జాతీయ మీడియా, పాక్ మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. దావూద్ కు భారీ భద్రత నడుమ చికిత్స అందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో, పాక్ లోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచే ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగినట్లు సమాచారం. యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా వెబ్ సైట్స్ కూడా డౌన్ అయినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కరాచీ, లాహోర్, రావల్పిండి వంటి ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయినట్లు అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి. దీంతో దావూద్ పై విష ప్రయోగం వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. దావూద్ రెండో పెళ్లి చేసుకుని కరాచీలో నివసిస్తున్నట్లు అతడి బంధువులు తెలిపినట్లు ఈ ఏడాది జనవరిలో వార్తలు వచ్చాయి. ఇంతకు ముందు కూడా దావూద్ చనిపోయాడనే వార్తలు హల్ చల్ చేశాయి. పేరు మోసిన నేరస్థుడిగా అంతర్జాతీయ ఆంక్షలున్నప్పటికీ, దావూద్ అతని కుటుంబం అనేక దశాబ్దాలుగా పాకిస్థాన్ లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని వార్తలు వచ్చాయి. కాగా, గత కొన్ని నెలలుగా పాకిస్థాన్ లో ఉన్న చాలామంది వాంటెడ్ ఉగ్రవాదులు ఇదే రీతిలో హతమయ్యారు. దావూద్ కూడా ఇలాగే హతమయ్యాడనే ప్రచారం జరుగుతోంది.
ముంబయి పేలుళ్ల తర్వాత పరారీ
1993లో ముంబయి పేలుళ్లకు మాస్టర్ మైండ్ దావూద్ ఇబ్రహీం. ఆ దాడి తర్వాత అతను పాకిస్థాన్ కు పారిపోయాడు. అతను తమ దేశంలోనే ఉన్నట్లు పాక్ ఇంతవరకూ అంగీకరించలేదు. కానీ, దావూద్ కరాచీలోనే ఉన్నాడని, అతని సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషా పార్కర్ చెప్పినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈ ఏడాది జనవరిలో దాఖలు చేసిన అభియోగపత్రంలో పేర్కొంది. దావూద్ ముఠా కరాచీ విమానాశ్రయాన్ని నియంత్రిస్తున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. దావూద్ ను ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన విషయం తెలిసిందే. 2018లో ఐరాస విడుదల చేసిన అంతర్జాతీయ ఉగ్ర సంస్థలు, ఉగ్రవాదుల జాబితాలో దావూద్ పేరు కరాచీ అడ్రస్ తో ఉంది.
దావూద్ బ్యాగ్రౌండ్ ఇదే..
దావూద్.. ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ నెట్వర్క్ 'D Company'కి అధిపతి. ఎన్ఐఏ (NIA) ప్రకారం, D Company డ్రగ్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్, బెదిరింపులు, ఆయుధాల స్మగ్లింగ్ లాంటివి పెద్ద ఎత్తున చేస్తోంది. దావూద్‌ని ఇప్పటికే భారత్ సహా ఐక్యరాజ్య సమితి గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాయి. ముంబయిలో 90ల్లో మామూలు క్రిమినల్‌గా జర్నీ మొదలు పెట్టిన దావూద్ ఇబ్రహీం కొద్ది కాలంలోనే గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు. ఆ తరవాత మొత్తం మాఫియాని గుప్పిట్లో పెట్టుకున్నాడు. దావూద్ బ్యాక్‌డ్రాప్‌తో బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. సెంట్రల్ ముంబయిలోని డోంగ్రిలో 1955లో జన్మించాడు. చిన్నప్పటి నుంచే దొంగతనాలకు అలవాటు పడ్డాడు. అప్పట్లో ముంబయిలో బడా డాన్ అయిన హాజీ మస్తాన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత హాజీ మస్తాన్‌కే ధమ్‌కీ ఇచ్చాడు. అతడి గ్యాంగ్‌లోని సభ్యులందరినీ చంపేశాడు. ఈ గ్రూప్ కొట్లాటలు 1984 నాటికి హింసాత్మకంగా మారాయి. ఆ సమయంలో దావూద్ ముంబయి వదిలి దుబాయ్‌కి పారిపోవాల్సి వచ్చింది. 1993లో అయోధ్యలోని బాబ్రీ మసీదుని కూల్చేశారు. ఈ ఘటన తరవాత దావూద్ ముంబయిలో దాదాపు 13 చోట్ల బాంబు దాడులు చేయించాడు. ఈ దాడిలో 250 మంది ప్రాణాలు కోల్పోయారు. FBIతో పాటు ఇంటర్‌పోల్ కూడా దావూద్‌ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ప్రకటించాయి. దావూద్‌కి పాకిస్థాన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ ISIతోపాటు లష్కరే తోయిబాతో సన్నిహిత సంబంధాలున్నాయి. రకరకాల పేర్లు, ఫేక్ పాస్‌పోర్ట్‌లతో దేశాలు తిరుగుతూ ఉంటాడు దావూద్.
Also Read: China Earthquake: చైనాలో భారీ భూకంపం- 100 మందికిపైగా మృతి