RK Roja: పక్క రాష్ట్రంలో ఛీకొట్టించుకొని ఇక్కడికొస్తే ప్రజలు నమ్మరు - షర్మిలకు రోజా కౌంటర్
Minister Roja Comments: ఎన్ని కష్టాలు ఎదురైనా కేసులు పెట్టి జైల్లో పెట్టినా ఏరోజు జగన్ తలొగ్గలేదని ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని ఆర్కే రోజా అన్నారు.
RK Roja Comments on Sharmila: కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఓటు అడిగే అర్హత లేదని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన పార్టీ కాంగ్రెస్ అని తప్పుబట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే అలాంటి వ్యక్తి పేరును ఆయన చనిపోయాక కేసులో ఇరికించి అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. ఆయన చనిపోయాకే వైఎస్ కుటుంబం మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ రోడ్డుపైకి ఈడ్చిందని అన్నారు. ఆ పార్టీలోకి వచ్చి ఎవరు విమర్శలు చేసినా జీరోలే అవుతారని అన్నారు. సామాన్య కార్యకర్తను కూడా తన కుటుంబ సభ్యుడిగా చూసే వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. ఇష్టానుసారంగా మాట్లాడే నోర్లకు 2024 ఎన్నికలు సమాధానం చెబుతాయని మంత్రి రోజా అన్నారు. శుక్రవారం రోజా మీడియాతో మాట్లాడారు.
విజయవాడ బాపు మ్యూజియంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో లేజర్, సౌండ్ లైట్ షోను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా హాజరయ్యారు. ఎవరో వచ్చి ఏదో చెబితే నమ్మడానికి జనం పిచ్చోళ్లు కాదన్నారు మంత్రి ఆర్కే రోజా. తమతో ఉంటున్నదెవరో.. తమ సమస్యల కోసం పోరాడిందెవరు.. అధికారంలోకి వచ్చాక పరిష్కరించేది ఎవరో ప్రజలకు తెలుసని అన్నారు. ఇచ్చిన హమీలు నెరవేర్చిన నేతలు వైఎస్సార్, వైఎస్ జగన్ అని రోజా చెప్పారు. ‘ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగి.. ఇక్కడే ఓటు.. ఇక్కడే ఇల్లు కట్టుకుని ప్రజల మధ్య ఉంటున్న ప్రజా నాయకుడు జగనన్న అని రోజా అన్నారు. రాజన్న రాజ్యం తెస్తానని పావురాల గుట్టలో జగనన్న తన తండ్రికి ప్రామిస్ చేశారని చెప్పారు.
తెలంగాణలో ఛీకొడితేనే ఏపీలోకి షర్మిల
ఎన్ని కష్టాలు ఎదురైనా.. కేసులు పెట్టి జైల్లో పెట్టినా.. ఏరోజు జగన్ తలొగ్గలేదని.. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని అన్నారు. ఏ పార్టీలో విలీనం చేయలేదని అన్నారు. అదీ నాయకుడి లక్షణం అని అన్నారు. షర్మిల పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టి.. ప్రజలు ఛీ కొడితే.. ఇక్కడికొచ్చి కాంగ్రెస్‌లో చేరి మాట్లాడితే ప్రజలు నమ్మరని రోజా అన్నారు. తెలంగాణ ప్రజలు ఛీ కొడితేనే షర్మిల ఏపీలోకి వచ్చారని విమర్శించారు. జగన్ పాలనపై ఏపీ ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధి రాష్ట్రంలో కనిపిస్తుందని అన్నారు. సీఎం జగన్ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు.