Mike Pompeo: భారత్‌పై అణు దాడికి పాకిస్థాన్ ప్లాన్- సంచలన విషయాలు వెల్లడించిన అమెరికా మాజీ మంత్రి
Mike Pompeo: భారత్ - పాకిస్థాన్ ల మధ్య అణు యుద్ధం జరిగే పరిస్థితులు వస్తే అమెరికా అడ్డుకుందని అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో ప్రచురించిన పుస్తకంలో తెలిపారు.
Mike Pompeo: భారత్ - పాక్ మధ్య అణు యుద్ధం జరిగే పరిస్థితులు వచ్చినప్పుడు అమెరికా అడ్డుకుందని అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో ప్రచురించిన పుస్తకంలో తెలిపారు. 2019లో పాకిస్థాన్ భారత్‌పై అణు దాడి చేసేందుకు సిద్ధమైందని అమెరికా జోక్యం వల్ల ఆగిపోయిందని పేర్కొన్నారు. మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్, సీఐఏ చీఫ్ గా పనిచేసిన మైక్ పాంపియో మంగళవారం రోజు 'నెవర్ గివ్ ఏ ఇంచ్: ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్' అనే పుస్తకాన్ని ప్రచురించారు.
'ఉద్రిక్తతలను తగ్గించా'
2019 ఫిబ్రవరిలో పాకిస్థాన్ ఉగ్రవాదులు పుల్వామాలో భారత జవాన్లపై దాడి చేశారు. ఈ దుర్ఘటనలో 40 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారత్‌లో ఉగ్రవాదులపై తీవ్ర ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలన్న డిమాండ్లు దేశవ్యాప్తంగా వెల్లువెత్తాయి. ఉగ్రదాడికి బదులుగా భారత సైన్యం పాక్ భూభాగంలోని బాలకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఎంతో మంది ముష్కరులను మట్టుబెట్టింది. ఈ సర్జికల్ స్ట్రైక్ తర్వాత భారత్ - పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి అమెరికా మాజీ అధికారి మైక్ పాంపియో తన పుస్తకంలో వివరించారు. సర్జికల్ స్ట్రైక్ తర్వాత పాక్ భారత్ పై అణు యుద్ధానికి సిద్ధమవుతోందని, బదులు చెప్పేందుకు తాము కూడా సన్నద్ధం అవుతున్నామని అప్పటి భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తనతో చెప్పినట్లు పాంపియో పుస్తకంలో తెలిపారు.
'మరో యుద్ధాన్ని ఆపా'
ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ మధ్య సమావేశం కోసం హనోయిలో ఉన్నప్పుడు భారత్ - పాక్ మధ్య నెలకొన్ని అత్యంత ఉద్రిక్తత పరిస్థితుల గురించి తనకు తెలిసిందని పాంపియో చెప్పారు. భారత్‌పై న్యూక్లియర్ దాడికి పాక్ సిద్ధపడిందని, దానికి బదులుగా అంతకు మించిన దాడికి సిద్ధంగా ఉన్నామని భారత ఉన్నత అధికారి ఒకరు తనకు చెప్పారని పాంపియో వెల్లడించారు. జాతీయ భద్రతా సలహాదారులు, దౌత్యవేత్తలు, ఉన్నత అధికారులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి తాను నాయకత్వం వహించానని పాంపియో తన పుస్తకంలో వెల్లడించారు. ఈ విషయంపై పాక్ లీడర్, ఆర్మీ చీఫ్ జనరల్ బాజ్వాతో తాను చర్చించినట్లు పాంపియో తెలిపారు. అయితే అది నిజం కాదని బాజ్వా చెప్పారని, భారతీయులే తమపై దాడికి అణ్వాయుధాలను మోహరిస్తున్నారని తాము అనుకుంటున్నట్లు బాజ్వా తనతో చెప్పినట్లు పాంపియో వెల్లడించారు. భారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తగ్గించడానికి కొన్ని గంటల సమయం పట్టిందన్నారు పాంపియో. అణు దాడికి దిగొద్దని రెండు పక్షాలను ఒప్పించినట్లు తన పుస్తకంలో చెప్పారు. తన చొరవ, ప్రయత్నాల వల్లే భారత్ - పాక్ మధ్య అణు యుద్ధం జరగకుండా ఆగిపోయిందని చెప్పారు మైక్ పాంపియో. అలా భారత్ - పాక్ మధ్య మరో యుద్ధం రాకుండా తను. తన బృందం కృషి చేసిందని అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో తన పుస్తకం 'నెవర్ గివ్ ఏ ఇంచ్: ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్'లో వెల్లడించారు.