Covid-19 Surge: వీలైనంత త్వరగా ప్రికాషనరీ డోస్ తీసుకోండి - ప్రజలకు IMA సూచన
Covid-19 Surge: ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ప్రజలకు, ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.
Covid-19 Surge in India:
అరికట్టడమే మంచిది..
ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ పలు మార్గదర్శకాలు జారీ చేయగా..ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కూడా పలు సూచనలు చేసింది. తక్షణమే ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటించడం మొదలు పెట్టాలని తెలిపింది. విదేశీ ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని చెప్పింది. ప్రస్తుతానికి భారత్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా లేదని, భయపడాల్సిన పని లేదని వెల్లడించింది. "కొవిడ్ సోకాక చికిత్స అందించడం కంటే అది రాకుండానే చూసుకోవడం మంచిది. అందుకే ప్రజలందరూ కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని
కోరుతున్నాం" అని ప్రకటించింది IMA.
మరి కొన్ని సూచనలు..
1. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించండి.
2. భౌతిక దూరం పాటించాలి.
3. సబ్బు, నీళ్లు లేదా శానిటైజర్‌లతో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి.
4. పెళ్లిళ్లు, రాజకీయ సమావేశాలు, ఇతరత్రా మీటింగ్‌ల లాంటి సామూహిక కార్యక్రమాలు నిర్వహించకూడదు.
5. విదేశీ ప్రయాణాలు మానుకోవాలి.
6. జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, విరేచనాలు లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
7. వీలైనంత త్వరగా ప్రికాషనరీ డోస్‌ను తీసుకోవడం మంచిది.
8. ప్రభుత్వాలు ఇచ్చే మార్గదర్శకాలను తుచ తప్పకుండా పాటించాలి
ఆక్సిజన్ సిలిండర్లు సిద్ధం చేసుకోండి: IMA
2021లో సెకండ్ వేవ్ వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా భారీగా మరణాలు నమోదయ్యాయి. ఆక్సిజన్ సిలిండర్లు దొరక్క ప్రజలు నానా అవస్థలు పడ్డారు. అలాంటి పరిస్థితులే పునరావృతం కాకుండా చూసుకోవాలని IMA కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అత్యవసర మందులు, ఆక్సిజన్ సరఫరా, ఆంబులెన్స్ సర్వీస్‌లను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పింది. సరిపడ వ్యాక్సిన్‌లు ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండటం మంచిదని తెలిపింది. వైరస్‌ల హబ్‌గా మారుతున్న కేరళ ప్రభుత్వం కూడా అలెర్ట్ అయింది. అన్ని జిల్లాల వైద్యాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాజిటివ్‌గా తేలిన వారందరి వైరస్ శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని తేల్చి చెప్పింది. ఏ వేరియంట్ వ్యాప్తి చెందుతోందో వీలైనంత త్వరగా గుర్తించాలని వెల్లడించింది. రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆధ్వర్యంలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ సమావేశమైంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది ప్రభుత్వం. ముక్కు, నోరు కవర్ అయ్యేలా మాస్క్‌లు ధరించాలని చెప్పింది. ప్రజలకు మరి కొన్ని జాగ్రత్తలూ చెప్పింది. "సబ్బు లేదా నీళ్లతో తరచూ చేతులు కడుక్కోండి. ఇప్పటి వరకూ వ్యాక్సిన్ తీసుకోని వారు...తప్పకుండా టీకాలు తీసుకోండి. ప్రికాషన్ డోస్ తీసుకోని వాళ్లు కూడా వెంటనే తీసుకోవాలి. కొవిడ్ సోకిన వాళ్ల వైరస్ శాంపిల్స్‌ని తప్పకుండా జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలి. అలా అయితేనే కొత్త వేరియంట్లను గుర్తించి కట్టడి చేసేందుకు వీలవుతుంది" అని కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ప్రజలకు అవగాహన పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. కొవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు అవసరమైన వసతులనూ కల్పించేందుకు సిద్ధమవుతున్నారు వైద్యాధికారులు.
Also Read: Rahul Gandhi On BJP Govt: 'మొత్తానికి భయపడ్డారు'- కేంద్రం రాసిన లేఖకు రాహుల్ గాంధీ కౌంటర్