MCD Election 2022: మమ్మల్ని గెలిపిస్తే ఇంటింటికీ RO వాటర్ ప్యూరిఫైర్‌లు ఇస్తాం - కాంగ్రెస్ హామీ
MCD Election 2022: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే ఇంటింటికీ వాటర్ ప్యూరిఫైర్‌లు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
MCD Election 2022:
త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు..
ఢిల్లీలో త్వరలోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు ఇప్పటికే మేనిఫెస్టోలు ప్రకటించి ప్రచారం మొదలు పెట్టాయి. ఈ ఎన్నికలు ఆప్ వర్సెస్ బీజేపీగా కనిపిస్తున్నా..కాంగ్రెస్ కూడా రేస్‌లో ఉంది. ఢిల్లీలోని సమస్యలేంటో పరిశీలించిటి వాటికి పరిష్కారం చూపించే అంశాలనే మేనిఫెస్టోలో చేర్చింది. సిటీ ప్రజలు స్వచ్ఛమైన నీళ్లు తాగడానికి కూడా లేకుండా పోయిందని
ఆప్‌పై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్...ఓటర్లకు ఓ హామీ ఇచ్చింది. తమ పార్టీని గెలిపిస్తే అందరికీ ఉచితంగా RO వాటర్ ప్యూరిఫైర్‌లు (RO Water Purifiers) అందజేస్తామని చెప్పింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రజలు నీళ్లు కూడా కొనుక్కోవాల్సిన దుస్థితికి తీసుకొచ్చిందని విమర్శించింది. ఆ మురికి నీళ్లను తాగుతుండడం వల్ల చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో పాటు మరి కొన్ని హామీలు ఇచ్చింది. "మమ్మల్ని గెలిపిస్తే..ప్రాపర్టీ ట్యాక్స్‌ని 50% మేర తగ్గిస్తాం" అని ప్రకటించింది. హౌజ్ ట్యాక్స్ పేరుతో బీజేపీ ఢిల్లీ ప్రజల్ని దోపిడీ చేస్తోందని మండి పడింది. అంతే కాదు. మున్సిపల్ వాల్యుయేషన్ కమిటీ ఏర్పాటు చేసి..కాలనీలను రీ క్యాటగరైజ్ చేస్తామని హామీ ఇచ్చింది. అటు బీజేపీ కూడా ప్రచార వేగాన్ని పెంచేందుకు రెడీ అవుతోంది. నవంబర్ 27వ తేదీన పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. లక్షకు పైగా బీజేపీ కార్యకర్తలు...కోటికిపైగా ఓటర్లను కలిసి తమకు ఓటు వేయాలని అడగనున్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో 250 వార్డులున్నాయి. డిసెంబర్ 4న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 7న ఫలితాలు విడుదల చేస్తారు.
బీజేపీ వర్సెస్ ఆప్..
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ..బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ రాజకీయ వేడిని పెంచేస్తున్నారు. బీజేపీపై ఆప్...విమర్శలు గుప్పించిన ప్రతిసారీ...గట్టిగా బదులిస్తోంది కాషాయపార్టీ. ఈ క్రమంలోనే..కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ఆప్‌పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. "ఆప్ పాపాలన్నీ కడిగితే నర్మదా నది కూడా కలుషితమై పోతుంది" అని విమర్శించారు. తీహార్ జైల్లో ఉన్న ఆప్ నేత సత్యేందర్ జైన్‌ను ఇప్పటి వరకూ మంత్రి పదవిలో నుంచి తొలగించలేదని మండి పడ్డారు. పైగా...మసాజింగ్ నుంచి ప్యాక్డ్ ఫుడ్ అందించడం వరకూ సకల మర్యాదలూ లభిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్ని మభ్యపెట్టడమే ఆప్ పని అని అన్నారు. "సత్యేందర్ జైన్ జైల్లో ఉన్నా ఆయన మర్యాదలకు తక్కువేమీ జరగడం లేదు. మంత్రి పదవి నుంచీ తొలగించలేదు. పోక్సో చట్టం కింద అరెస్టైన వ్యక్తితో సత్యేందర్ జైన్ సన్నిహితంగా ఉంటున్నారు. ఇలాంటి వ్యక్తుల వల్లే రాజకీయాలకు మచ్చ వస్తోంది. ఆమ్‌ఆద్మీ పార్టీ మోసం చేయడం తప్ప మరింకేదీ చేయలేదు. ఎక్సైజ్ స్కామ్, క్లాస్‌రూమ్ స్కామ్ లాంటి కుంభకోణాలకు పాల్పడ్డారు" అని నిప్పులు చెరిగారు..కేంద్రమంత్రి మీనాక్షి లేఖి.
Also Read: Delhi Jama Masjid: సంచలన నిర్ణయం- ఇక సింగిల్‌గా వస్తే మహిళలకు జామా మసీదులోకి నో ఎంట్రీ!