World Heritage Sites: వారసత్వ కట్టడాలు ప్రపంచ వ్యాప్తంగా 1,123…రామప్ప సహా మనదేశంలో ఎన్నో తెలుసా?
మనదేశంలో రామప్ప ఆలయంతో సహా మొత్తం ఎన్ని కట్టడాలకు వారసత్వ హోదా దక్కిందో తెలుసా? మొదట వారసత్వ హోదా దక్కించుకున్న కట్టడం ఏది? ఇంతకీ వారసత్వ హోదా కల్పించేందుకు ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారు?
సహజ అందాలు, సాంస్కృతిక వైభవ ప్రదేశాల్లో మనదేశం అద్వితీయం. ఇండియాలో విదేశీ పర్యటన దిన దినాభివృద్ధి చెందుతోంది. ఇందుకు కారణం ఎన్నో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉండటమే. ఈ ప్రదేశాలకు ఐక్యరాజ్య సమితిలో ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ మరియు కల్చరల్ సంస్థ…యునెస్కో గుర్తింపు నిచ్చింది.
యునెస్కో 1978 నుంచి ఇప్పటివర కు 1,126 కట్టడాలు, ప్రాంతాలకు వారసత్వ హోదా కల్పించింది. వీటిలో మూడు కట్టడాల నిర్వహణ యునెస్కో ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో వాటిని ఆ జాబితా నుంచి తొలగించింది. ప్రస్తుతం 167 దేశాల కు చెందిన 1,123 కట్టడాలు వారసత్వ జాబితాలో ఉన్నాయి. యునెస్కో గుర్తింపు పొందిన అత్యధిక కట్టడాలున్న దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో ఉంది. అత్యధికంగా ఇటలీ నుంచి 57 కట్టడాలు యునెస్కో గుర్తిం పు పొందాయి. ఆ తర్వాతి స్థానంలో చైనా 55, జర్మనీ 48, స్పెయిన్ 48, ఫ్రాన్స్ 47 ఉన్నాయి.
మన దేశంలో రామప్పతో కలిపి మొత్తం 39 కట్టడాలకు వారసత్వ హోదా దక్కింది. మొదటిసారిగా 1983లో అజంతా, ఎల్లోరా గుహలు, ఆగ్రా కోట, తాజ్‌మహల్‌కు వారసత్వ హోదా లభించింది. ఆ తర్వాత వీటి సంఖ్య క్రమంగా పెరిగింది.
ఎలిఫెంటా గుహలు, ఛత్రపతి శివాజీ టెర్మినల్, కోణార్క్ సూర్యదేవాలం, తంజావూర్ లో చోళ రాజులు నిర్మించిన బృహదీశ్వర ఆలయం, రాజస్థాన్ లోని హిల్ ఫోర్ట్స్, ఫతేపూర్ సిక్రీ ఇలా మొత్తం మనదేశంలో 39 కట్టడాలకు వారసత్వ హోదా దక్కింది.
వారసత్వ హోదా ఎంపిక ఎలా చేస్తారంటే…
వారసత్వ హోదా ఇచ్చేందుకు యునెస్కో మొత్తం 10 ప్రమాణాలను నిర్ణయించింది. వీటిలో కనీసం ఒక్కదానినైనా అందుకున్న వాటికి జాబితాలో చోటు దక్కుతుంది. ఈ ప్రమాణాలను ఎప్పటికప్పుడు హెరిటేజ్ కమిటీ సమీక్షిస్తుంది. 2004 వరకు సాంస్కృతిక కట్టడాల కోసం 6 ప్రమాణాలు, సహజసిద్ధ ప్రదేశాల కోసం 4 ప్రమాణాలు ఉండేవి. ఆ తర్వాత వీటన్నింటినీ కలిపి 10 ప్రమాణాలుగా నిర్దేశించారు. ఒక ప్రాంతం లేదా కట్టడం వారసత్వ హోదా పొందాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో నిబంధనల్లో పొందుపరిచారు. ఒక ప్రాంతం లేదా కట్టడాన్ని ప్రతిపాదించే ముందు ఆయా నిబంధనలకు అనుగుణంగా దానిని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అక్రమ నిర్మాణాలు ఉంటే తొలగించడం వంటివి చేయాలి. ఆ తర్వాత దేశ ప్రభుత్వం యునెస్కో వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. వాటిని యునెస్కో బృందం పరిశీలించి నివేదికను కమిటీకి అందజేస్తుంది. కమిటీ దాన్ని పరిశీలించిన అనంతరం హోదా ఇస్తుంది. తెలంగాణ నుంచి గతంలో గోల్కొండ కోట, చార్మినార్, కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను ప్రపంచ వారసత్వ కట్టడాలుగా గుర్తించాలని ప్రతిపాదనలు వెళ్లినా అర్హత లభించలేదు.
వారసత్వ హోదా వచ్చాక ఆ కట్టడం లేదా ప్రదేశాన్ని స్థానిక ప్రభుత్వాలు యునెస్కో ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించాలి. ఆక్రమణలు, కూల్చివేతలు, నిర్వహణ సరిగా లేకపోవడం, మరమ్మతులు చేయకపోవటం వంటి కారణాలతో హోదా రద్దవుతుంది. నిర్వహణ సరిగా లేనివాటిని ముందుగా ‘ప్రమాదంలో ఉన్న కట్టడాల’ జాబితాలో చేర్చుతారు. నిర్ణీత సయమంలోగా అభివృద్ధి చేయకుంటే జాబితా నుంచి తొలగిస్తారు. ఇప్పటివరకు మూడింటి హోదా రద్దయ్యింది. 51 కట్టడాలు ప్రమాద జాబితాలో ఉన్నాయి.
తొలిసారిగా 2007లో సౌదీ అరేబియాలోని ‘అరేబియన్ ఒరైక్స్ సాంక్చురీ’ని జాబితా నుంచి తొలగించారు. ఈ సాంక్చురీలోని 90 శాతం భూభాగాన్ని చమురు తవ్వకాల కోసం తవ్వేయటంతో రద్దు చేశారు. 2009లో జర్మనీలోని డ్రెస్‌డెన్ ఎల్బే వ్యాలీ హోదాను రద్దు చేశారు. ఒక బ్రిడ్జి నిర్మాణం కోసం ఈ వ్యాలీలోని 20 కిలోమీటర్ల పొడవైన భూభాగాన్ని సేకరించి, ఏండ్లపాటు పనులు కొనసాగించటంతో రద్దు చేశారు. జులై 21న ఇంగ్లాండ్‌లోని ‘లివర్‌పూల్ మ్యారీటైమ్ మెర్కాంటైల్ సిటీ’ని ఈ జాబితా నుంచి తొలగించారు. లివర్‌పూల్ నది మట్టం పెరుగుతుండటంతో ఈ ప్రాంతం మునిగిపోకుండా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. దీంతో ఈ ప్రాంత చారిత్రక విశిష్ఠత దెబ్బతిన్నదంటూ హోదా రద్దు చేశారు.