TS Assembly Updates: ఎన్నేళ్ళు కష్టపడ్డా హరీశ్‌ను సీఎం చెయ్యరు, తండ్రీకొడుకులు వాడుకుంటారు - రాజగోపాల్ వ్యాఖ్యలు
Komatireddy Rajagopal Reddy: హరీశ్ రావు ఎంత బాగా పని చేసినా ఆయన్ను కేసీఆర్ సీఎం చేయరని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నేళ్లయినా హరీశ్ రావు అదే స్థానంలో ఉంటారని ఎద్దేవా చేశారు.
Komatireddy Rajagopal Vs Harish Rao: తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నేతల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఓ సందర్భంలో మాజీ మంత్రి హరీశ్ కామెంట్స్ కు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీశ్ రావు ఎంత బాగా పని చేసినా ఆయన్ను కేసీఆర్ సీఎం చేయరని వ్యాఖ్యానించారు. ఎన్నేళ్లయినా హరీశ్ రావు అదే స్థానంలో ఉంటారని ఎద్దేవా చేశారు. హరీశ్ రావు అసెంబ్లీలో మాట్లాడడానికి ఎన్ని గంటలు సమయం ఇచ్చినా సరిపోలేదని.. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే అని కొట్టి పారేశారు. అబద్ధాలు చెప్పడంలో హరీశ్ రావుకు మేనమామ పోలికే వచ్చిందని అన్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వరని హరీశ్ రావు అన్నారని.. తనకు మంత్రి పదవి ఇవ్వాలనా వద్దా అనే సంగతి అదిష్ఠానం చూసుకుంటుందని అన్నారు. కానీ, హరీశ్ రావును తండ్రీకొడుకులు కేసీఆర్, కేటీఆర్ లు వాడుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
హరీశ్ రావు కౌంటర్
ఈ వ్యాఖ్యలపై హరీశ్‌రావు కూడా అదే స్థాయిలో స్పందించారు. మీ పార్టీ లాగా రూ.50 కోట్లు ఇచ్చి టీపీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కునే ఖర్మ తమకు పట్టలేదని ఆరోపించారు. పీసీసీ పదవిని రూ.50 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారని కోమటిరెడ్డి బ్రదర్సే మాట్లాడారని.. ఆ వీడియో కూడా ఉందని హరీశ్ రావు అన్నారు. రాజగోపాల్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడారని.. ఆయన తన మాటలు విత్ డ్రా చేసుకుంటే తాము కూడా రెడీ అని అన్నారు.
అంతేకాక హరీశ్ రావు శ్వేతపత్రంలోని పలు అంశాలను కూడా తప్పుబట్టారు. ప్రభుత్వం కేవలం వారికి అనుకూలంగా ఉండే విధంగా మాత్రమే గణాంకాలను తీసుకుందని తెలిపారు. ప్రధానంగా కరోనా కాలంలోని గణాంకాలను తీసుకుందని విమర్శించారు. 2014 - 15లో జీతాలు, పెన్షన్ల ఖర్చు రూ.17,130 కోట్లు ఉండగా.. 2021-22లో రూ.48,809 కోట్లుగా ఉందని అన్నారు. దాదాపు మూడు రెట్లు పెరిగిందని ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రంలో తెలిపిందని అన్నారు. గృహనిర్మాణశాఖకు సంబంధించి రూ.6,470 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. తాగునీటి కార్పొరేషన్ కు సంబంధించి రూ.20 వేల కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించి రూ.2,951 కోట్ల బకాయిలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న 14 ఎస్పీవీలు, సంస్థలు మొత్తం రూ.1,18,557 కోట్ల రుణాన్ని సేకరించాయని అన్నారు.