Karnataka Assembly Election Result 2023: బెంగళూరులో కాంగ్రెస్ కీలక భేటీ, సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారా?
Karnataka Assembly Election Result 2023: కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ బెంగళూరులో కీలక భేటీకి పిలుపునిచ్చింది.
Karnataka Assembly Election Result 2023:
బెంగళూరులో సమావేశం
కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. 130 సీట్లకుపైగానే లీడ్‌లో కొనసాగుతోంది. కచ్చితంగా 130 స్థానాల్లో గెలుస్తామని కాంగ్రెస్ ధీమాగా చెబుతోంది. అంతకు మించి వచ్చే అవకాశాలూ ఉన్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్ఠానం కీలక భేటీకి పిలుపునిచ్చింది. రేపు (మే 14)వ తేదీన సీఎల్‌పీ సమావేశం జరగనుంది. బెంగళూరు వేదికగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. సీఎం అభ్యర్థి ఎవరన్న చర్చ ఇప్పటికే మొదలైంది. ఈ రేసులో డీకే శివకుమార్, సిద్దరామయ్య ఉన్నారు. ఈ భేటీ పూర్తైన తరవాత సీఎం ఎవరన్నది ప్రకటించే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేయకుండా జాగ్రత్త పడుతోంది. గెలిచిన వారిని కాపాడుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు మొదలు పెట్టింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాహుల్ గాంధీ..కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. బెంగళూరుకు ఇద్దరు కీలక నేతల్ని పంపించి ప్రస్తుత పరిస్థితులపై నిఘా పెడతారని తెలుస్తోంది. ఎమ్మెల్యేలందరినీ బెంగళూరుకు తరలిస్తోంది. అక్కడ ఇక రిసార్ట్ రాజకీయాలు మొదలు కానున్నాయి. ఏ ఒక్క ఎమ్మెల్యేని కూడా పోగొట్టుకునేందుకి సిద్ధంగా లేదు. ఫలితాలు విడుదలయ్యేంత వరకూ అందరిపైనా ఓ కన్నేసి ఉంచనుంది. ముందుగానే మూడు ప్లాన్‌లు సిద్ధం చేసుకుంది. పరిస్థితుల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని భావించింది.
1. ఒకవేళ 120 సీట్ల కన్నా ఎక్కువ వస్తే ఎమ్మెల్యేలందరినీ బెంగళూరుకు తరలించడం.
2.115 సీట్లలో విజయం సాధిస్తే ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్‌కి తరలించడం.
3.110 కన్నా తక్కువ సీట్లు వస్తే రాజస్థాన్ లేదా ఛత్తీస్‌గఢ్‌కి ఎమ్మెల్యేలను పంపడం.
అయితే...ప్రస్తుత ట్రెండ్స్ చూస్తుంటే కాంగ్రెస్ మంచి మెజార్టీయే వచ్చే అవకాశాలున్నాయి. మ్యాజిక్ ఫిగర్‌కి కనీసం 15 సీట్లు ఎక్కువగానే వస్తాయని గట్టిగా నమ్ముతోంది. అయినా...జాగ్రత్త పడుతోంది. జోన్‌ల వారీగా కొందరి నేతల్ని పంపించి అక్కడి పరిస్థితులను సమీక్షిస్తోంది. గెలిచిన ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు వేరే చోటకు తరలించేందుకు ప్లైట్‌లు రెడీ చేసుకుంటోంది. రిసార్ట్‌లు కూడా బుక్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
సీఎం ఎవరు..?
సిద్ధరామయ్య 2013 నుంచి 2018 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ మెజారిటీతో గెలిస్తే పార్టీకి సిద్ధరామయ్యే మొదటి ఛాయిస్ కావచ్చు అనే అంచనాలు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన హయాంలో సామాజిక, ఆర్థిక సంస్కరణల పథకాల ద్వారా అనేక మార్పులు తీసుకొచ్చారు. పేదల కోసం అనేక పథకాలకు శ్రీకారం చుట్టారు. ఏడు కిలోల బియ్యం ఇచ్చే అన్న-భాగ్య పథకం, పాఠశాలకు వెళ్లే విద్యార్థులందరికీ 150 గ్రాముల పాలు అందించే క్షీర్-భాగ్య పథకం, ఇందిరా క్యాంటీన్ రాష్ట్రంలోని పేదలకు ఎంతో ఉపశమనం కలిగించాయి. సిద్ధరామయ్య తన పదవీకాలంలో రాష్ట్రంలో ఆకలి, విద్య, మహిళలు, నవజాత శిశు మరణాల నివారణకు పథకాలను ప్రారంభించారు, ఇది రాష్ట్రంలోని లక్షలాది పేద కుటుంబాలకు ఉపశమనం కలిగించింది. సిద్దరామయ్య తన హయాంలో బాలికలకు గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్య, కళాశాల విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, పంచాయతీల్లో మహిళలకు తప్పనిసరి చేయడం, గర్భం దాల్చిన తర్వాత 16 నెలల పాటు మహిళలకు పౌష్టికాహారం అందించడం వంటి పథకాలు తీసుకొచ్చారు.