(Source: ECI/ABP News/ABP Majha)
Kakinada News: చెల్లెల్ని తీసుకురావడానికి వెళ్తే విషాదం, ఊయలే ఆ బాలుడి ప్రాణం తీసింది
Kakinada News: కాకినాడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గొల్లపాలెం అంగన్వాడీ కేంద్రంలో ఓ పదకొండేళ్ల బాలుడు ఊయలలో కూర్చొని ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తు అది మెడకు చుట్టుకుని బాలుడు చనిపోయాడు.
Kakinada News: కాకినాడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామ అంగన్వాడీ కేంద్రంలో ప్రమాదవశాత్తు ఓ పదొకండేళ్ల బాలుడి మెడకు ఊయల తాడు చుట్టుకొని ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
అసలేం జరిగిందంటే..?
గొల్లపాలెం గ్రామానికి చెందిన సత్యబాబు, నాగలక్ష్మీ దంపతులకు ఓ మనోజ్ చంద్రశేఖర్ అనే 11 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ఈ బాలుడు ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాడు. అంగన్వాడీకి వెళ్లిన తన చెల్లిని ఇంటికి తీసుకొచ్చేందుకు వెళ్లాడు. అంగన్వాడీ టీచర్ సెలవులో ఉండడంతో.. విధుల్లో ఉన్న సహాయకురాలు పిల్లలను తీసుకు వచ్చేందుకు బయటకు వెళ్లారు. అదే సమయంలో మనోజ్ చంద్ర శేఖర్ అంగన్వాడీ తలుపులు తీసుకొని లోపలికి వెళ్లాడు. తూకం వేసే ఉయ్యాల ఎక్కి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఉయ్యాల తాడు బాలుడి మెడకు చుట్టుకోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. కాసేపటి తర్వాత వచ్చిన సహాయకురాలు ఇది చూసి చాలా భయపడిపోయింది. కేకలు వేయగా స్థానికులు వచ్చారు. ఇలా బాలుడి తల్లిదండ్రులకు కూడా విషయం తెలిసింది. చెల్లిని తీసుకొచ్చేందుకు వెళ్లిన అతడు ప్రణాలు కోల్పోవడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు. మరోవైపు స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కోడిగుడ్డు తిని చిన్నారి మృతి - హైకోర్టు సంచలన తీర్పు
కోడిగుడ్డు తిని చిన్నారి మృతి చెందిన కేసులలో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. చిన్నారి కుటుంబానికి ఎనిమిది లక్షలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం గుల్లేపల్లి అంగన్వాడీ కేంద్రంలో 2022 ఫిబ్రవరి 17న దీక్షిత అనే చిన్నారి మృతి చెందింది. సిబ్బంది నిర్లక్ష్యంతో కోడి గుడ్డు గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక నాలుగేళ్ల చిన్నారి దీక్షిత మృతి చెందింది. దీనిపై పాప తల్లిదండ్రులు అంగన్వాడీ సిబ్బందిని నిలదీశారు. పాప కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. అయితే అనారోగ్యంతో దీక్షిత మృతి చెందింది అంటూ అంగన్వాడీ సిబ్బంది బుకాయించారు. న్యాయం చేయాలంటూ దీక్షిత తల్లిదండ్రులు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. దీక్షిత మృతదేహాన్ని ఖననం చేసిన 4 నెలల తర్వాత హెచ్ఆర్సీ ఆదేశం మేరకు పోస్టుమార్టం నిర్వహించారు. కోడిగుడ్డు గొంతులో ఇరుక్కోవడంతోనే దీక్షిత మృతి చెందింది అంటూ పోస్టుమార్టం రిపోర్ట్ వెల్లడించింది. దీంతో దీక్షిత కుటుంబానికి 8 లక్షల పరిహారం ఇవ్వాలంటూ 2023 జనవరి 31న హెచ్ఆర్సీ ఆదేశించింది. హెచ్ఆర్సీ నిర్ణయంపై అంగన్వాడీ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. హెచ్ఆర్సీ తీర్పును సమర్థిస్తూ హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై పాప తల్లిదండ్రులకు సంతృప్తి వ్యక్తం చేశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరో బిడ్డకు జరగకూడదని దీక్షిత తల్లిదండ్రులు సరిత, మురుగేష్ కోరుతున్నారు.
మరొకరికి జరగకూడదనే మా పోరాటం
"మా పాపను అంగన్వాడీలో వదిలేసి కూలి పనికి వెళ్లాం. మధ్యాహ్నం 12.30కి మాకు ఫోన్ వచ్చింది. మీ పాప చనిపోయిందని చెప్పారు. ఇంటికి వచ్చి చూస్తే పాప విగతజీవిగా పడిఉంది. ఆ రోజు మాకు ఏంచేయాలో తెలియలేదు. రెండ్రోజుల తర్వాత పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే కేసు తీసుకోలేదు. మీ పాపకు గుండె జబ్బు, ఫిట్స్ ఉందని కేసు క్లోజ్ చేయించారు. మా పాపకు ఎలాంటి అనారోగ్యం లేదు. ఊర్లో పెద్దలతో మాట్లాడుకుని ధర్నా చేశాము. పేపర్ల వార్తలు వచ్చాక హ్యూమన్ రైట్స్ వాళ్లు మాకు కాల్ వచ్చింది. జరిగిన విషయం చెప్పాము. మేము వాళ్లకు లేటర్ పెట్టాము. హెచ్ఆర్సీ వాళ్లు మా ఇంటికి వచ్చి విషయంపై ఆరా తీశారు. రీపోస్టుమార్టమ్ చేశారు. హెచ్ఆర్సీ వాళ్లు చెప్పినట్లు కేసులు కూడా పెట్టాం. అయితే రీపోస్ట్ మార్టమ్ లో కూడా గుండె జబ్బు, ఫిట్స్ అని పోలీసులు చెప్పారు. దీనిపై హెచ్ఆర్సీని ఆశ్రయిస్తే వాళ్లు కేసులు పెట్టారు. ఇటీవల హెచ్ఆర్సీ నుంచి లెటర్ వచ్చింది. గుడ్డు తిని పాప చనిపోయిందని చెప్పారు. రూ.8 లక్షలు పరిహారం ఇవ్వాలని అంగన్వాడీ అధికారులను ఆదేశిస్తామన్నారు. అధికారులు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. మేము ఇంతలా పోరాడింది డబ్బు కోసం కాదు. మాకు జరిగినట్లు మరొకరికి జరగకూడదన్నారు."- చిన్నారి తల్లి సరిత