Tadipatri News: కీలకమైన నామినేటెడ్ పదవిపై జేసీ పవన్‌కుమార్‌రెడ్డి కన్ను! కన్ఫార్మ్ అయినట్లు సమాచారం
Anantapuram: నామినేటెడ్ పోస్టుల భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఒలిపింక్ అసోషియేషన్ అధ్యక్ష పదవికోసం జేసీ పవన్‌కుమార్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు.
Andhra Pradesh: జేసీ బ్రదర్స్...ఉమ్మడి అనంతపురం(Anatapuram) జిల్లాలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జేసీ కుటుంబానికి(J.C. Family) ఉన్న ప్రాధాన్యత అలాంటింది. దాదాపు 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని నడిపిన జేసీ దివాకర్‌రెడ్డి(J.C.Divakar Reddy) వయోభారంతో ఇక చాలించుకున్నారు. ఆయన వారసుడిగా తెరపైకి వచ్చిన కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి(Pawan Kumar Reddy) తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లోనే ఓటమి చవిచూశారు. ఈసారి ఎన్నికల్లో ఆయనకు తెలుగుదేశం(Telugu Desam) పార్టీ సీటు ఇవ్వకపోవడంతో పోటీ నుంచి విరమించుకున్నారు. అయితే ఇప్పుడు కీలకమైన నామినేటెడ్ పోస్టుపై కన్నేశారు. దీనికోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
జేసీ కుటుంబం హవా
ఉమ్మడి అనంతపురం జిల్లాను రాజకీయంగా కొన్నేళ్లపాటు శాసించిన జేసీ కుటుంబం ప్రాభవం ఈసారి ఎన్నికల్లో కొంత తగ్గింది. జేసీ బ్రదర్స్‌గా(JC Brothers) ముద్రపడిన దివాకర్‌రెడ్డి(JC Divakar Reddy), ప్రభాకర్‌రెడ్డి(JC Prabhakar Reddy) హవా కొనసాగినంతకాలం వారికి జిల్లాలో తిరుగులేదు. గతంలో కాంగ్రెస్‌పార్టీలో ఉండగా... జిల్లా రాజకీయాలపై పట్టు సాధించిన సోదరులు, ఆ తర్వాత పరిటాల రవి వెలుగులోకి రావడంతో కొంత వెనక్కి తగ్గారు. ఆయన మరణంతో మళ్లీ తమ మార్కు రాజకీయం చూపారు. ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేలుగా తిరుగులేని ఆధిపత్యం చూపారు. అయితే వయోభారం రీత్యా జేసీ దివాకర్‌రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుని తన కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి(Pawan Kumar Reddy)ని వారసుడిగా తెరపైకి తెచ్చారు. అలాగే ప్రభాకర్‌రెడ్డి సైతం తనకుమారుడు అస్మిత్‌రెడ్డికి అవకాశం కల్పించారు.
2014 ఎన్నికల్లో పోటీచేసిన ఈ వారసులిద్దరూ ఓటమి పాలయ్యారు. అయితే తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌గా ప్రభాకర్‌రెడ్డి గెలవడంతో స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగారు. దివాకర్‌రెడ్డి, పవన్‌రెడ్డి మాత్రం ఐదేళ్లపాటు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఈసారి కూడా ఈ కుటుంబానికి రెండు సీట్లు వస్తాయని ఆశించారు. కానీ సామాజిక సమీకరణాలు, రాజకీయ కారణాలతో టిక్కెట్ ఇవ్వలేదు. అస్మిత్‌రెడ్డి మాత్రమే తాడిపత్రి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే టిక్కెట్ల కేటాయింపు సమయంలో మాత్రం చంద్రబాబు(Chandra Babu) కీలకమైన నామినేటెడ్ పోస్టు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పుడు ఆ పోస్టు కోసమే పవన్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు జరుపుతున్నారు.
నామినేటెడ్ పదవిపై గురి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పదవులు భర్తీపై దృష్టి సారించింది. గత ఎన్నికల్లో పార్టీకోసం కష్టపడిన వారిని గుర్తించి నామినేటెడ్ పదవులు పంపిణీ చేయనుంది. అయితే అనంతపురం జిల్లాలో ఈసారి తెలుగుదేశం(Telugu Desam) పార్టీ క్వీన్‌స్వీప్ చేయడంలో జేసీ కుటుంబం పాత్రం ఎంతైన ఉంది. ఎంపీ సీటు ఇవ్వకపోయినా, పవన్‌కుమార్‌రెడ్డి తెలుగుదేశం అభ్యర్థి గెలుపుకోసం తీవ్రంగా కృషి చేశారు. దీన్ని గుర్తించిన సీఎం చంద్రబాబు... పవన్‌కుమార్‌రెడ్డికి కీలకమైన నామినేటెడ్ పోస్టు ఇవ్వనున్నట్లు జిల్లాలో ప్రచారం సాగుతోంది.
స్వతహాగా క్రీడలపట్ల మక్కువ చూపే పవన్‌కుమార్‌రెడ్డి గతంలో ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కాబట్టి ఈసారి ఏకంగా ఒలింపిక్ అసోసియేషన్ (Olympic Association)అధ్యక్ష పదవీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పవన్‌కుమార్‌రెడ్డి అమరావతిలో నారా లోకేశ్‌తో(Nara Lokesh) భేటీ అయ్యారు. ఆయన ఆశీస్సులు సైతం పవన్‌కుమార్‌కు మెండుగా ఉన్నాయని జేసీ వర్గం ప్రచారం చేస్తోంది. కీలకమైన క్రీడాకారులతో పవన్‌కు నేరుగా పరిచయాలు ఉండటంతో ఆయనకు ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షునిగా అవకాశం కల్పించనున్నట్లు ప్రచారం సాగుతోంది.