Gaza: గాజాలోని ఓ స్కూల్‌పై ఇజ్రాయేల్ సేన దాడి, 100 మంది శరణార్థులు మృతి
Israel Hamas: గాజాలోని ఓ స్కూల్‌పై ఇజ్రాయేల్ దాడి చేసింది. ఈ ఘటనలో 100 మంది ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. వీళ్లంతా ఆశ్రయం కోల్పోయి తల దాచుకుంటున్న వాళ్లే.
Gaza News: ఇజ్రాయేల్ హమాస్ యుద్ధం (Israel Hamas War) ఇప్పట్లో ఆగేలా లేదు. పైగా రోజురోజుకీ తీవ్రమవుతోంది. వందలాది మంది పౌరులను బలి తీసుకుంటోంది. ఈ మృతుల్లో చిన్నారులూ ఉంటున్నారు. హమాస్ బేస్‌లపై దాడులు చేస్తున్నామని చెబుతూ ఇజ్రాయేల్ సైన్యం గాజాలోని స్కూల్స్‌పై దాడులు చేస్తోంది. మరోసారి ఇజ్రాయేల్ గాజాలోని ఓ స్కూల్‌పై దాడి చేసింది. ఈ దాడిలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. Reuters వెల్లడించిన వివరాల ప్రకారం...ప్రార్థనలు చేస్తూ ఉండగా ఈ దాడి జరిగింది. యుద్ధం కారణంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొందరు ఈ స్కూల్‌లో తల దాచుకుంటున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఇక్కడికి వచ్చారు. కానీ..ఇజ్రాయేల్ దాడిలో అంతా బలి అయ్యారు. అయితే...ఇజ్రాయేల్ సైన్యం మాత్రం తమ దాడిని సమర్థించుకుంటోంది. హమాస్ ఉగ్రవాదులు ఈ స్కూల్‌లోనే నక్కి ఉన్నారని, వాళ్లని మట్టుబెట్టాలన్న లక్ష్యంతోనే దాడి చేశామని చెబుతోంది.
"హమాస్ ఉగ్రవాదులు ఎక్కడైతే తల దాచుకున్నారో అక్కడే ఇజ్రాయేల్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేస్తోంది. గాజాలోని ఆ స్కూల్‌లో వాళ్లు ఉన్నట్టు సమాచారం అందింది. దాడి చేసే ముందే ఎంత నష్టం జరుగుతుందని అంచనా వేశాం. వీలైనంత వరకూ ప్రాణనష్టం తక్కువగా ఉండేలా దాడులు చేశాం. ఏరియల్ సర్వైవలెన్స్ చేసి, పక్కా సమాచారం తరవాతే ముందుకు వెళ్లాం"
- ఇజ్రాయేల్ ఎయిర్ ఫోర్స్
గత వారం కూడా గాజాలోని ఓ స్కూల్‌పై ఇజ్రాయేల్ దాడి చేసింది. ఆగస్టు 4వ తేదీన గాజాలో రెండు స్కూల్స్‌పై దాడులు జరిగాయి. చాలా మంది శరణార్థులు ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. ఈ దాడిలో 30 మంది చనిపోయారు. అంతకు ముందు మరో దాడిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టు 1వ తేదీన ఇజ్రాయేల్ దాడిలో 15 మంది మృతి చెందారు. గాజాలోని బిల్డింగ్‌లు, స్కూల్స్‌ని టార్గెట్‌గా చేసుకుంటోంది ఇజ్రాయేల్ సైన్యం. వీటిలోనే హమాస్ కమాండర్‌లు ఉన్నారని వాదిస్తోంది. కానీ...సాధారణ పౌరులే ఎక్కువగా బలి అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అవన్నీ హమాస్ కమాండ్ సెంటర్‌లు అని వాదిస్తున్నప్పటికీ అంతర్జాతీయంగా ఇజ్రాయేల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతేడాది అక్టోబర్ 3వ తేదీన ఈ యుద్ధం మొదలైంది. ఇజ్రాయేల్‌పై హమాస్ దాడులు చేసింది. ఇందుకు ప్రతీకారంగా ఇజ్రాయేల్ ప్రతిదాడులు మొదలు పెట్టింది. అప్పటి నుంచి ఈ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. హమాస్ ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ యుద్ధం కారణంగా గాజాలో దాదాపు 39 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. హమాస్‌ని పూర్తిగా అంతం చేసేంత వరకూ ఈ యుద్ధం ఆపేదే లేదని ఇజ్రాయేల్ తేల్చిచెప్పింది. అటు హమాస్ కూడా అదే స్థాయిలో ఎదురు దాడులు చేస్తోంది. హమాస్ లీడర్‌లను హతమార్చడంపై అటు ఇరాన్ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇరాన్ మద్దతుతో హెజ్బుల్లా ఇజ్రాయేల్‌పై దాడులకు దిగుతోంది. ఫలితంగా మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది.
Also Read: Viral News: ఘోర ప్రమాదం, గాల్లో అదుపు తప్పి చక్కర్లు కొట్టి కుప్ప కూలిన విమానం - 62 మంది మృతి