గాజాలో చిక్కుకున్న భారతీయుల్ని తీసుకురాలేం, విదేశాంగ శాఖ సంచలన ప్రకటన
Israel Palestine Attack: గాజాలో చిక్కుకున్న భారతీయుల్ని ఇప్పటికిప్పుడు వెనక్కి రప్పించడం కష్టమే అని విదేశాంగ శాఖ వెల్లడించింది.
Israel Palestine Attack:
గాజాలో భారతీయులు..
గాజాలో చిక్కుకున్న భారతీయుల్ని సురక్షితంగా వెనక్కి రప్పించడం సవాలుగా మారిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటికిప్పుడు వాళ్లను తీసుకురావడం కొంచెం కష్టంగానే ఉందని తెలిపింది. నలుగురు పౌరులున్నారని..వీలైనంత త్వరగా వాళ్లను ఇండియాకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ (Ministry of External Affairs ) ప్రతినిధి అరిందం బగ్‌చీ ఈ విషయం వెల్లడించారు. సరైన అవకాశం కోసం చూస్తున్నామని, పరిస్థితులు కుదురుకోగానే వెంటనే వెనక్కి తీసుకొస్తామని తెలిపారు. ఈ నలుగురు భారతీయుల్లో ఒకరు వెస్ట్ బ్యాంక్‌లో చిక్కుకున్నట్టు వివరించారు. ఇక గాజాలోని భారతీయుల్ని హత్య చేస్తున్నారన్న ఆరోపణల్ని కొట్టి పారేశారు అరిందం బగ్‌చీ. అలాంటి ఘటనలేమీ జరగడం లేదని తేల్చి చెప్పారు. భారత్‌కి చెందిన ఓ మహిళ సౌత్ ఇజ్రాయేల్‌లో ఉన్నట్టు చెప్పారు. ఇజ్రాయేల్, హమాస్ యుద్ధంలో ఆమె గాయపడిందని తెలిపారు. భర్తతో వీడియో కాల్ మాట్లాడుతుండగా ఉన్నట్టుండి రాకెట్ దాడి జరిగింది. అక్టోబర్ 7వ తేదీన ఈ దాడి జరిగిందని, ఆ దాడిలోనే ఆమె గాయపడిందని విదేశాంగ శాఖ వెల్లడించింది. వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై భారత్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
"ప్రధాని నరేంద్ర మోదీ గాజాలోని పరిస్థితులు విచారం వ్యక్తం చేశారు. ట్వీట్ కూడా చేశారు. బాధితుల కుటుంబ సభ్యులకూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. హింస ఎక్కడ జరిగినా భారత్ దాన్ని ఖండించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. పాలస్తీనా సమస్యపై మా స్టాండ్ ఏంటో ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పాం. ఇరు వర్గాల మధ్య చర్చలు జరగాల్సిన అవసరముంది. అంతర్జాతీయ సమాజమూ ఈ యుద్ధంపై జోక్యం చేసుకుని పరిష్కారం చూపించాలి"
- అరిందం బగ్‌చీ, విదేశాంగ శాఖ ప్రతినిధి
#WATCH | Delhi: On the Israel-Palestine issue, MEA spokesperson Arindam Bagchi says, "...You would have seen the comments, the tweets as well as statement from Prime Minister...We have strongly condemned the horrific terrorist attack on Israel. The international community must… pic.twitter.com/CavDBELDAS
— ANI (@ANI) October 19, 2023
భారతీయుల తరలింపుపై భారత విదేశాంగ శాఖ ఇప్పటికే స్పందించింది. ప్రస్తుతానికి చార్టర్ విమానాలను ఉపయోగిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. అవసరమైతే వైమానిక దళాన్ని కూడా ఉపయోగించుకుంటామని అన్నారు. ఇజ్రాయిల్లో నివసిస్తున్న మన భారతీయ పౌరులు త్వరలో రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. దాదాపు 18,000 మంది భారతీయులు ఇజ్రాయిల్లో ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది విద్యార్థులే ఉన్నట్లు తెలుస్తోంది. మందుగా పేర్లు రిజిస్టర్ చేసుకున్న వారిని తొలుత భారత్ తరలించినట్లు చెప్పారు. అక్టోబర్ 7న ఎయిర్ ఇండియా తన విమానాలను నిలిపివేసింది. తిరిగి వచ్చే వారు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని.. వారి రిటర్న్ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
Also Read: సీఎం కుర్చీ నన్ను అసలు వదలడం లేదు, అశోక్ గహ్లోట్ ఆసక్తికర వ్యాఖ్యలు