Ship Hijack: 15 మంది భారత సిబ్బందితో ఉన్న షిప్ హైజాక్, రంగంలోకి INS చెన్నై
Ship Hijack In Somalia: సోమాలియా తీరంలో 15 మంది భారత సిబ్బంది ఉన్న ఓడ హైజాక్‌కు గురైంది.
INS Chennai: సోమాలియా తీరంలో 15 మంది భారత సిబ్బంది ఉన్న ఓడ హైజాక్‌కు గురైంది. లైబీరియన్ జెండా, 15 మంది భారత సిబ్బందితో ఉన్న ఓడ హైజాక్‌కు గురైనట్లు సైనిక అధికారులు శుక్రవారం తెలిపారు. గురువారం సాయంత్రం ఓడ హైజాక్‌కి సంబంధించిన సమాచారం అందినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఇండియన్ నేవీ వెల్లడించింది. హైజాక్ అయిన నౌక ఎంవీ లిలా నోర్‌ఫోక్‌గా అధికారులు వెల్లడించారు. నౌకపై నిఘా ఉంచేందుకు ఇండియన్ నేవీ ఎయిర్ క్రాఫ్ట్‌లను మోహరించినట్లు అధికారులు తెలిపారు. భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక INS చెన్నై పరిస్థితిని పరిష్కరించడానికి హైజాక్ చేసిన ప్రాంతానికి వెళుతోంది. షిప్‌లో పరిస్థితుల్ని అంచనా వేయడానికి సిబ్బందితో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలో షిప్ హైజాకింగ్ ప్రయత్నాల గురించి తెలిసిన వెంటనే ఇండియన్ నేవీ వేగంగా స్పందించింది. నౌకలో ఆరుగురు దుండగులు ఉన్నట్లు జనవరి 4న సాయంత్రం సందేశం అందింది.
తాజా పరిస్థితులకు అనుగుణంగా ఇండియన్ నేవీ హైజాక్‌కు గురైన ఓడకు సాయంగా సముద్ర భద్రతా కార్యకలాపాల కోసం INS Chennai ని రంగంలోకి దించింది. అలాగే నేవీకి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ హైజాక్‌కు గురైన నౌకను గుర్తించి దానితో సంబంధాలను ఏర్పరచుకుంది. తద్వారా ఓడ కదలికలను నావికాదళ విమానాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. అలాగే ఐఎన్ఎస్ చెన్నై సైతం హైజాక్‌కు గురైన నౌకను సమీపిస్తోంది. దానితో పాటుగా ఇతర ఏజెన్సీల ద్వారా ఇండియన్ నేవీ పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది. సోమాలియా తీరంలో సముద్ర దొంగతనాలు పెరిగిపోయాయి. ఇతర దేశాలకు చెందిన వాణిజ్య ఓడలను హైజాక్ చేసి దుండగులు బెదిరింపులకు దిగడం పరిపాటిగా మారింది. ఓడలు, నౌకలను వదిలిపెట్టేందుకు సంబంధిత ఓడ యాజమాన్యం, దేశాలను డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. 2008 నుంచి 2013 మధ్య ఈ రకమైన దొంగతనాలు పెరిగిపోయాయి. అయితే ఇండియన్ నేవీతో సహా మల్టీ-నేషనల్ మారిటైమ్ టాస్క్‌ఫోర్స్ సమిష్టి ప్రయత్నాలతో ఈ దాడులు తగ్గుముఖం పట్టాయి. అయితే తాజాగా భారత సిబ్బందితో ఉన్న నౌక హైజాక్‌కు గురవడం కలకలం రేపింది.