Indore News: మీ కోడిని కాస్త అదుపులో పెట్టుకోండి, ఉదయమే అరిచి నిద్ర డిస్టర్బ్ చేస్తోంది - ఇదో వింత కేసు
Indore News: తెల్లవారు జామునే కోడి కూయడం వల్ల తన నిద్ర డిస్టర్బ్ అవుతోందని పొరుగింటి వాళ్లపై ఓ డాక్టర్ ఫిర్యాదు చేశాడు.
Indore News:
ఇండోర్‌లో..
కోడి కూతతో అందరూ మేలుకుంటారు. సిటీల్లో తక్కువే కానీ..పల్లెటూళ్లలో కోడి కూతలు గట్టిగానే వినిపిస్తాయి. బద్ధకమంతా వదిలించేస్తాయి ఈ కూతలు. కానీ...ఓ డాక్టర్‌కి మాత్రం ఇవి చిరాకు కలిగించాయట. పక్కింట్లో ఉండే కోడి పదేపదే కూస్తోందని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిందీ ఈ ఘటన. పలాసియాలో ఉంటున్న డాక్టర్, తన ఇంటి పక్కన కోడి కూతతో తనకు ఇబ్బంది కలుగు తోందని పోలీసులకు కంప్లెయింట్ చేశాడు. దీనిపై స్పందించిన పోలీసులు ఇరు పక్షాలను పిలిచి మాట్లాడతామని, అప్పటికీ పరిష్కారం దొరక్కపోతే...లీగల్‌గా ప్రొసీడ్ అవ్వచ్చని వెల్లడించారు. డాక్టర్ అలోక్ మోడీ ఫిర్యాదు చేశారని, పలాసియా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ తెలిపారు. "మొదట మేం రెండు వర్గాలనూ పిలిచి మాట్లాడతాం. సమస్య పరిష్కారం అవ్వకపోతే...సెక్షన్ 133 కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం" అని చెప్పారు. న్యూసెన్స్ క్రియేట్ చేసే వాళ్లపై ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. "పొరుగింట్లో కుక్కలు, కోళ్లు చాలా ఉన్నాయి. ఉదయం 5 గంటలకే కోడి గట్టిగా కూస్తోంది. దీని వల్ల నాకు నిద్ర డిస్టర్బ్ అవుతోంది" అని ఫిర్యాదులోపేర్కొన్నాడు డాక్టర్. రాత్రి హాస్పిటల్ నుంచి వచ్చే సరికి ఆలస్యమవుతోందని, మంచి నిద్రలో ఉన్న సమయంలో కోడి కూతతో తనకు చిరాకు పుడుతోందని అన్నాడు.
చిన్నారి ఫన్నీ కంప్లెయింట్..
ఓ చిన్నారి తన అమ్మపై ఫిర్యాదు చేశాడు. ఏముంది అమ్మ కొట్టిందని చెప్పి ఉంటాడు.. అనుకుంటున్నారా? కాదు.. ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మరీ ఆ బుడ్డోడు కంప్లెయింట్ ఇచ్చాడు. మధ్యప్రదేశ్ బర్హాన్‌పూర్ జిల్లా డేడ్‌తలాయి గ్రామంలో ఈ ఘటన జరిగింది. మూడేళ్ల చిన్నారి తన నాన్నను వెంట బెట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. తన తల్లిపై ఫిర్యాదు చేయడానికి వచ్చానని పోలీసులకు చెప్పాడు. ఇది చూసి షాకైన పోలీసులు.. ఏం జరిగిందని అడిగారు. అయితే కంప్లెయింట్ రాసుకోవాలని ఆ చిన్నారి కోరడం పోలీసులను అవాక్కయ్యేలా చేసింది. ఇంతకీ కంప్లెయింట్ ఏంటంటే? వాళ్ల అమ్మ అసలు చాక్లెట్లు తిననిన్వడం లేదట. వాటిని దొంగిలించి తనకు దొరక్కుండా దాచి పెడుతోందట.
అంతేకాదు క్యాండీలు కావాలని అడిగినప్పుడల్లా కొడుతుందట. ఈ విషయాలన్నీ బుడ్డోడు ముద్దుముద్దుగా చెప్పడం అక్కడున్న పోలీసులతో నవ్వులు పూయించింది. కంప్లెయింట్ రాసుకున్న మహిళా పోలీస్ బుడ్డోడు చెప్పిన ప్రతి అక్షరాన్ని ఫిర్యాదులో రాశారు.
" కాటుక పెట్టే సమయంలో వీడు చాక్లెట్లు తింటూ అటూ ఇటూ కదిలాడు. దీంతో వాళ్లమ్మకు కోపమొచ్చి చెంపపై మెల్లగా కొట్టింది. దీంతో తనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలని అప్పటి నుంచి మారాం చేస్తున్నాడు. ఎంత చెప్పినా వినడం లేదు. అందుకే పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చాను. అయితే ఇక్కడ పోలీసులు.. వాడితో ఆప్యాయంగా మాట్లాడారు. వాడు చెప్పిన ప్రతి విషయాన్ని రాసుకున్నారు. దీంతో మొత్తానికి ఇంటికి వెళ్దామన్నాడు. "
- చిన్నారి తండ్రి
Also Read: Gujarat Elections: యూసీసీ అమలు చేయాల్సిన సమయం వచ్చేసింది - రాజ్‌నాథ్ సింగ్