Chief Guest for Republic Day : రిపబ్లిక్ డే 2025కు చీఫ్ గెస్ట్‌లను ఎలా సెలెక్ట్ చేస్తారు - ఈసారి ముఖ్య అతిథి ఎవరు?
Chief Guest for Republic Day : జనవరి 26న దేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఈసారి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరుకానున్నారు.

Chief Guest for Republic Day : 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశం సిద్ధమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే ఈ సెలబ్రేషన్స్ కు ప్రతిసారి ఎవరో ఒకరు ముఖ్య అతిథిగా హాజరుకావడం చూస్తూనే ఉంటాం. అదే తరహాలో ఈ సారీ ఓ వ్యక్తి భారత గణతంత్ర వేడుకల్లో భాగమయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఏడాది ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవొ సుబియాంతో (Prabowo Subianto) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అక్టోబర్ 2024లో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రభోవో.. భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి. ఆయన జనవరి 25, 26.. ఈ రెండు రోజులూ దేశంలోనే ఉంటారు.
గణతంత్ర దినోత్సవం
2024లో జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు 2023లో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్-సిసి ఇండియాకు వచ్చారు. అయితే జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ముఖ్య అతిథిని ఆహ్వానించే సంప్రదాయం ఎప్పట్నుంచి ప్రారంభమైందో చాలా మందికి తెలియకపోవచ్చు. ఇది 1950లో ప్రారంభించారు. అప్పట్నుంచి వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు దేశానికి వచ్చి, ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. ఇలా భారత్ కు వచ్చే అతిథిని అత్యంత గౌరవంగా భావించి, అనేక మర్యాదలతో సత్కరిస్తారు. రాష్ట్రపతి భవన్ లో వారికి గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తారు. జనవరి 26న సాయంత్రం, భారత రాష్ట్రపతి ముఖ్య అతిథి గౌరవార్థం ప్రత్యేక రిసెప్షన్ ఏర్పాటు చేస్తారు.
చీఫ్ గెస్ట్ ను ఎలా ఎంపిక చేస్తారంటే..
భారతదేశంలో అత్యంత అట్టహాసంగా జరిగే గణతంత్ర వేడుకలకు ప్రతి ఏడాదీ ఒక్కో దేశం నుంచి ఒక్కో వ్యక్తి చీఫ్ గెస్ట్ గా హాజరవుతూ ఉంటారు. అయితే ఈ వ్యక్తులను ఎలా ఎంపిక చేస్తారు అన్న విషయానికొస్తే.. ఈ ముఖ్య అతిథిని ఎంపిక చేసే ప్రక్రియ సంబంధిత అధికారులు 6 నెలల ముందుగానే ప్రారంభిస్తారట. అతిథి పేరును నిర్ణయించేటప్పుడు అనేక విషయాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేస్తామని భారత రాయబారిగా మన్‌బీర్ సింగ్ చెప్పుకొచ్చారు. అందులో ప్రధానమైన విషయమేమిటంటే.. తాము ఎంపిక చేసే వ్యక్తికి సంబంధించిన దేశానికి, భారత్ కు మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని కీలకంగా పరిగణిస్తామన్నారు. ఈ తరహా విషయాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే విదేశీ అతిథి పేరును నిర్ణయిస్తారట. కానీ ఈ విషయంలో ఫైనల్ నిర్ణయం మాత్రం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖదే కావడం గమనార్హం.
ఈ గణతంత్ర దినోత్సవం ఎన్నవదంటే..
చాలా మంది ఈ విషయంలో సందేహంగా ఉంటారు. కొంతమంది రిపబ్లిక్ డే వేడుకలు జరిగిన మొదటి సంవత్సరాన్ని 1949 నుంచి లెక్కిస్తారు. కానీ అది సరైంది కాదు. వాస్తవానికి రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు నుంచి దీన్ని లెక్కించాలి. ఈ చట్టం 1950లో అమలులోకి వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరంలో, భారతదేశం తన 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది.





















