Jyoti Malhotra Spy Case: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు చైనాతోనూ లింకులు, కొన్ని రోజుల కింద పహల్గాంలో వీడియోలు చేసిన కిలేడీ!
YouTuber spying for Pakistan: హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పాకిస్తాన్‌కు నిఘా సమాచారం చేరవేస్తుందన్న ఆరోపణలతో అరెస్టు చేశారు. పాకిస్థానీ నిఘా సంస్థలతో ఆమెకు సంబంధాలున్నట్లు పోలీసులు తెలిపారు.

Jyoti Malhotra Spy Case: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. పాకిస్తాన్ గూఢచర్య సంస్థ (పీఐఓ) భారత్‌కు వ్యతిరేకంగా ఆమెను సిద్ధం చేస్తోందని హర్యానాలోని హిసార్ పోలీసులు తెలిపారు. సరైన సమయంలో ఆమెను ప్రయోగించడానికి వారు ప్రయత్నించారని పోలీసులు గుర్తించారు. గూఢచర్యం కేసులో అరెస్టైన ఫేమస్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మూడుసార్లు పాకిస్తాన్‌కు వెళ్లింది. అదే సమయంలో ఆమె చైనాకు సైతం వెళ్లింది. చైనాతోనూ ఆమెకు ఉన్న లింకులపై త్వరలో తేల్చనున్నారు. పహల్గాం దాడికి ముందు ఆమె పహల్గాంను సైతం సందర్శించినట్లు పోలీసులు తెలిపారు.
ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ మీడియాతో మాట్లాడుతూ, "కేంద్ర దర్యాప్తు సంస్థలు హర్యానా పోలీసులకు పీఐఓ సాఫ్ట్ నేరేటివ్‌ను ప్రోత్సహించడానికి సోషల్ మీడియాలో చురుకుగా ఉన్న వ్యక్తులను నియమించుకుంటున్నాయి. కేంద్ర సంస్థలతో సంప్రదింపుల తర్వాత హర్యానా పోలీసులు జ్యోతిని విచారిస్తున్నారు. గత కొంతకాలం నుంచి ఆమె ఎక్కడికి వెళ్లారు, ఏ ప్రాంతాల్లో ఏం చేశారు.. అక్కడి వివరాలు సేకరించి పాక్ ఏజెంట్లకు అందజేశారా అనే కోణం దర్యాప్తు జరుగుతోందని’ తెలిపారు. శుక్రవారం (మే 16, 2025) అరెస్టయిన జ్యోతిని 5 రోజుల పోలీసు కస్టడీకి పంపారు.
కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ శశాంక్ సావన్
ఎస్పీ సావన్ ఇంకా మాట్లాడుతూ.. ‘జ్యోతి మల్హోత్రా "ట్రావెల్ విత్ జో" అనే యూట్యూబ్ ఛానెల్‌ను రన్ చేస్తోంది. ఆమె ఆదాయ వనరులను గుర్తించడానికి ఆమె ప్రయాణ చరిత్రతో పాటు ఆమె బ్యాంకు ఖాతాలు, లావాదేవీలను పరిశీలిస్తున్నాం. ఆమె ఆదాయానికి, ఖర్చుల మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించాం. ఆమె కేవలం ఒక ట్రావెల్ బ్లాగర్ మాత్రమే. ఆదాయానికి మించి ఆస్తులు, ప్రాపర్టీస్ ఉన్నాయంటే ఆమెకు బయటి నుండి నిధులు సమకూరుతున్నాయనే అనుమానాలున్నాయి. ఆమె ఒకసారి చైనాకు వెళ్లి, అక్కడి వీసా కోసం ఒక వీడియో షేర్ చేసింది. ఇతర యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్లతో కూడా ఆమెకు సంబంధాలు ఉన్నాయి. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో పాటు ఆమెకు సన్నిహిత యూట్యూబర్లతో పాకిస్తాన్ సంస్థలతో సంబంధం ఉందనే అభియోగాలపై దర్యాప్తు జరుగుతోందని’ పేర్కొన్నారు.
#WATCH | Hisar | "They were developing her (Jyoti Malhotra) as an asset. She was in touch with other YouTube influencers, and they were also in touch with the PIOs... She used to go to Pakistan, like on sponsored trips... She was in Pakistan before the Pahalgam attack, and the… pic.twitter.com/OD2wD1vzic
— ANI (@ANI) May 18, 2025
పాకిస్తాన్ ఏజెంట్‌తో లోతైన సంబంధాలు
జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ హైకమిషన్ అధికారితో నేరుగా సంబంధం కలిగి ఉంది. భారత ప్రభుత్వం ఆ పాక్ అధికారిని ఇటీవల అనర్హత కలిగిన రాజకీయ ప్రతినిధి (persona non grata) గా ప్రకటించి దేశం నుండి బహిష్కరించింది. 2023లో పాకిస్తాన్ వీసా తీసుకునే సమయంలో ఎంబసీలో ఆమె ఎహ్సాన్-ఉర్-రహీం అనే వ్యక్తిని కలిసింది, ఆ తర్వాత వారి మధ్య స్నేహం పెరిగి ఆమెకు పాకిస్తాన్లో నివాసం సైతం ఏర్పాటు చేశాడు. అక్కడ ఆమె పాకిస్తాన్ ఏజెంట్లను కలిసి భారత్‌కు సంబంధించిన వివరాలు షేర్ చేసుకుంది.
సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ నేరేటివ్‌ను ప్రోత్సహించడం
జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ ఛానెల్ ‘ట్రావెల్ విత్ JO’ మరియు ఇన్స్టాగ్రామ్ ఖాతాకు లక్షలాది ఫాలోయర్లు ఉన్నారు. తన సోషల్ మీడియాను ఉపయోగించి ఆమె పాకిస్తాన్ నేరేటివ్‌ను ప్రోత్సహిస్తోంది. పోలీసుల ప్రకారం, ఇది ఒక రకమైన 'నేరేటివ్ యుద్ధం', ఇందులో సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లను ఏజెంట్లుగా డెవలప్ చేసుకుని లబ్ధి పొందుతున్నారు.
జ్యోతి మల్హోత్రాపై చర్యలు తప్పవు..
జ్యోతి మల్హోత్రాను గోప్యతా చట్టం, భారతీయ శిక్షా స్పృతి విధానం (భారతీయ న్యాయ సంహిత) నిబంధనల ప్రకారం అరెస్టు చేశారు. ఆమెను కోర్టులో హాజరుపరిచి 5 రోజుల పోలీసు రిమాండ్‌కు పంపారు. పోలీసులు ఆమె ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ల ఫోరెన్సిక్ పరీక్షలు చేస్తున్నారు. అంతేకాకుండా, డబ్బు లావాదేవీలు, ట్రావెల్ హిస్టరీ, పాకిస్తాన్ అధికారులతో జరిగిన సమావేశాలపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లోనూ వీడియోలు చేసిన యూట్యూబర్
యూట్యూబర్ జ్యోతి రెండేళ్ల కిందట హైదరాబాద్ టూర్‌కు వచ్చింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభోత్సవంలో పాల్గొని సందడి చేసింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి నేతలు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్న కార్యక్రమంలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాల్గొని వీడియోలు చేసింది. కేరళకు సైతం వెళ్లి ఆమె చేసిన వీడియోలు ఇటీవల అరెస్ట్ తరువాత సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆమె ఇంకా ఏ ప్రాంతాల గురించి సమాచారం సేకరించి పాక్ ఏజెంట్లకు ఇచ్చిందనే కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది.






















