Viral News: అరే ఏంట్రా ఇదీ ! ఏకంగా రైలు పట్టాలను ఎత్తుకెళ్లిన దొంగలు - ఇద్దరు ఉద్యోగులపై వేటు !
బిహార్ లో కథ వేరే ఉంటది. అక్కడ ఇలా చిన్న చిన్న చోరీలు కాదు. ఏకంగా మొబైల్ టవర్ పార్టులు పార్టులుగా ఎత్తుకెళ్లడం, రైలు ఇంజిన్ ను చోరీ చేయడం, బ్రిడ్జిని ఎత్తుకెళ్లడం లాంటి జరిగాయి.
After bridge, rail engine theft, now 2 km of railway tracks stolen in Bihar:
సాధారణంగా ఎక్కడైనా ఇంట్లో చోరీ జరిగిందనో, లేక బంగారం చైన్ దొంగిలించారని బాధితులు పోలీస్ స్టేషన్లకు రావడం చూస్తుంటాం. కానీ బిహార్ లో కథ వేరే ఉంటది. అక్కడ ఇలా చిన్న చిన్న చోరీలు కాదు. ఏకంగా మొబైల్ టవర్ పార్టులు పార్టులుగా ఎత్తుకెళ్లడం, రైలు ఇంజిన్ ను చోరీ చేయడం, బ్రిడ్జిని ఎత్తుకెళ్లడం లాంటి జరిగాయి. తాజాగా మరో వింత ఘటన బిహార్ లో జరిగింది. ఏకంగా రైల్వే ట్రాక్ చోరీ చేసి పాత సామాను వాళ్లకు కేజీల లెక్కన అమ్ముకున్నారు నిందితులు. గత నెలలో ఈ ఘటన వెలుగుచూసింది. రైలు పట్టాలు మాయం కావడంలో ప్రమేయం ఉందని ప్రాథమికంగా గుర్తించడంతో ఉన్నతాధికారులు ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు.
బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో దాదాపు 2 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌లను దొంగిలించి స్క్రాప్ డీలర్‌లకు విక్రయించినట్లు అధికారులు తెలిపారు. షుగర్ మిల్లుకు అనుసంధానం అయ్యే ట్రైన్ ట్రాక్ పై రాకపోకలు లేకపోవడంతో గత కొన్నేళ్లుగా మూతపడింది. జన సంచారం తక్కువగా ఉండడంతో దొంగలు వాటం ప్రదర్శించారు. ఈ కేసుకు సంబంధించి ఆర్‌పిఎఫ్‌లో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
View this post on Instagram
సమస్తిపూర్ రైల్వే డివిజన్ లో ఘటన..
సమస్తిపూర్ లో లోహత్ చక్కెర కర్మాగారం కొంతకాలం కిందట మూసివేశారు. గతంలో సరుకు రవాణా కోసం రైలు మార్గం నిర్మించారు. ఈ మార్గం ద్వారా మిల్లు పాండౌల్ రైల్వే స్టేషన్‌కు అనుసంధానం చేశారు. కానీ ఈ రైలు మార్గా్న్ని అధికారులు కొన్నేళ్ల కిందట నిలిపివేశారు. ముఖ్యంగా షుగర్ మిల్లు మూతపడిన తర్వాత ఇక్కడి వస్తువులను స్క్రాప్‌గా వేలానికి పెట్టాలని భావించారు. ఇందులో రైలు పట్టాలు కూడా ఉన్నాయి అయితే దాదాపు 2 కి.మీ మేర రైలు మార్గాన్ని కొందరు చోరీ చేశారు. గత నెలలో ఇది ఉన్నతాధికారులకు తెలియడంతో విచారణ మొదలుపెట్టారు. రైల్వే డివిజన్ ఉద్యోగుల సహకారంతో రైలు పట్టాలను విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. అయితే కేవలం అర కిలోమీటర్ మేర పట్టాలు చోరీ చేసి స్క్రాప్ కింద విక్రయించారని బుకాయించే ప్రయత్నాలు జరిగాయి.
దర్భంగాలోని ఆర్పీఎఫ్ పోస్ట్ వద్ద రైలు పట్టాల చోరీపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మధుబనికి చెందిన జమాదార్ ముఖేష్ కుమార్ సింగ్‌తో పాటు ఝంజర్‌పూర్ అవుట్ పోస్టుకు కమాండ్‌గా ఉన్న శ్రీనివాస్ ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రైలు ట్రాక్ ను వేలం వేయకుండా, టెండర్లకు పిలవకుండా ఉద్యోగులే ఓ వ్యాపారికి విక్రయించినట్లు వారిపై అభియోగాలు నమోదు చేశారు. పూర్తి స్థాయి విచారణలో దోషులుగా తేలితే ఉద్యోగులపై తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కేసులో తండ్రీకొడుకులు అనిల్ యాదవ్, రాహుల్ కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.