Tomato Price Hike: ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి టమాటాల సేకరణ - ధరలు ఎక్కువున్న ప్రాంతాలకు తరలింపు
Tomato Price Hike: ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి టమాటాలను సేకరించి ఎక్కువ ధరలకు అమ్ముతున్న ప్రాంతాలకు పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Tomato Price Hike: దేశంలో టమోటా ధరలు విపరీతంగా మండిపోతున్నాయి. కొన్ని వారాలుగా 20 రూపాయల మార్కు చుట్టూ తిరుగుతోంది. ఈక్రమంలోనే కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు తక్కువ ధరకు అందించేందుకు సిద్ధం అవుతోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి టమాటా కొనుగోలు చేసి ఎక్కువ ధరలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి అక్కడకు పంపిణీ చేయాలని జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్యలను వినియోగదారుల వ్యవహారాల శాఖ కోరింది.
భారీ వర్షాలు కురుస్తుండడంతో పెరిగిన టమాటా ధరలు
ఈక్రమంలోనే శుక్రవారం నాటికి ఢిల్లీ - ఎన్‌సీఆర్‌లోని వినియోగదారులకు తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో అనేక చోట్ల కిలో టమాట ధర రూ.200కు చేరుకుంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో పంట దిగుబడి, సరుకు రవాణాలో అంతరాయం కారణంగా టమాటా ధర రికార్డు స్థాయిలో నమోదు అవుతుంది. ఈ క్రమంలోనే గత నెల రోజులుగా టనాటా ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న ప్రాంతాలను గుర్తించి అక్కడి రిటైల్ కేంద్రాల్లో పంపిణీ చేయాలని భావిస్తోంది.
మిగతా రాష్ట్రాలకు సరఫరా..!
దాదాపు దేశంలోని ప్రతీ రాష్ట్రంలో టమోటా ఉత్పత్తి చేస్తున్నప్పటికీ.. దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతాలు నుంచే దాదాపు 60 శాతం పండిస్తున్నాయి. వారు వాడుకోగా మిగిలిన ఉత్పత్తిని దేశంలోని మిగతా రాష్ట్రాల్లోకి సరఫరా చేస్తున్నారు. అలాగే ఆ ప్రాంతాల్లో ఉత్పత్తి సీజన్ లు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు గరిష్ట హార్వెస్టింగ్ కాలం ఉంటుంది. జులై నుంచి ఆగస్టు మరియు అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఎక్కువగా పండిస్తారు. ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి టమోటా సరఫరాలు అవుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీ మరియు సమీప నగరాలకు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ప్రస్తుతం టమాటాలు అందుతున్నాయి. త్వరలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి కొత్త పంటలు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. త్వరలోనే ఆ ధరలు అన్నీ తగ్గుతాయని చెప్పింది.