Indian Airports High Alert: దేశవ్యాప్తంగా ఉగ్రదాడుల ముప్పు.. ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్- ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
Terrorist threats all airports in India | ఉగ్రవాద దాడులకు అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలతో దేశ వ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలలో హై అలర్ట్ ప్రకటించారు.

Terrorist Attacks In India | న్యూఢిల్లీ: పహల్గాం దాడి గాయం నుంచి దేశం కోలుకోకముందే మరో ఉగ్రముప్పు భారత్‌ను వెంటాడుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాలకు భద్రతాపరమైన ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడే అవకాశముండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవానికి కొన్ని రోజుల ముందు ఇంటెలిజెన్స్ వర్గాలు చేసిన హెచ్చరికతో ఎయిర్ పోర్టులలో భద్రతా అధికారులు అప్రమత్తం అయ్యారు.
అన్ని ఎయిర్‌పోర్టులకు హెచ్చరికలు
ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం, సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 మధ్య విమానాశ్రయాలు లక్ష్యంగా చేసుకుని దాడులకు అవకాశం ఉంది. దీనిపై కేంద్ర పౌర విమానయాన భద్రతా బ్యూరో దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులకు భద్రతకు సంబంధించి, దాడులపై ఉన్న సమాచారంతో ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేసింది. విమానాశ్రయాల భద్రతను వెంటనే కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. రన్‌వేలు, హెలిప్యాడ్లు, ఫ్లయింగ్ స్కూల్స్, ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని ఎయిర్‌పోర్టులకు సూచించింది.
క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న సెక్యూరిటీ, భద్రతా సిబ్బంది
ఈ అడ్వైజరీతో అన్ని ఎయిర్‌పోర్ట్ లలో భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. విమానాశ్రయంలోని టర్మినల్స్, పార్కింగ్ ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాల్లోనూ పెట్రోలింగ్ పెంచారు. స్థానిక పోలీసుల సహకారంతో విమానాశ్రయాలకు వెళ్లే మార్గాల్లో సిబ్బంది తనిఖీలు చేపట్టనున్నారు. అంతర్జాతీయ, డొమోస్టిక్ మార్గాల్లో పంపే మెయిల్స్, పార్సిళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సిబ్బంది, కాంట్రాక్టర్లు, విజిటర్లను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఎయిర్‌పోర్టు అధికారులు, భద్రతా సిబ్బంది నిర్ణయించారు.
విమానాశ్రయాల్లో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా, లగేజీ గానీ ఉంటే వెంటనే సిబ్బంది దృష్టికి తీసుకురావాలని ప్రయాణికులకు అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా రెస్పాన్స్ టీములను ఎయిర్ పోర్ట్ అధారిటీ యాక్టివ్ చేసింది. అవసరమైతే మాక్ డ్రిల్స్ నిర్వహించాలన్న సూచనలను భద్రతా బ్యూరో అందించినట్లు సమాచారం.






















