Tata Nano Singur Controversy: మమత సర్కార్‌కు షాక్, సింగూరు కేసులో టాటాకు భారీ ఉపశమనం
Tata Nano Singur Controversy: పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్ నానో కార్ల పరిశ్రమ తరలింపు కేసులో టాటా మోటార్స్‌కు భారీ ఉపశమనం లభించింది.
Tata Nano Singur Controversy: పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్ నానో కార్ల పరిశ్రమ తరలింపు వివాదంలో టాటా మోటార్స్‌కు భారీ ఉపశమనం లభించింది. సింగూర్‌లో లఖ్టాకియా నానో కార్ల తయారీ కోసం ఏర్పాటు చేసిన ప్లాంట్‌ను మూసివేసిన తర్వాత పెట్టుబడిపై నష్టాన్ని వడ్డీతో కలిపి రూ.766 కోట్లు చెల్లించాలని ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ (ఆర్బిట్రల్ ట్రిబ్యునల్) టాటా మోటార్స్‌కు అనుకూలంగా ఈ నిర్ణయాన్ని వెలువరించింది.
సింగూరులోని ఆటోమొబైల్ తయారీ ప్లాంట్‌పై పెట్టుబడి పెట్టిన పెట్టుబడి నష్టానికి పశ్చిమ బెంగాల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (డబ్ల్యుబీఐడీసీ) నుంచి పరిహారం కోసం టాటా మోటార్స్ దావా వేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో టాటా మోటార్స్ తెలిపింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 30, 2023న టాటా మోటార్స్ లిమిటెడ్‌కు అనుకూలంగా ముగ్గురు సభ్యుల ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. పెట్టుబడిపై నష్టాన్ని వడ్డీతో కలిపి రూ.766 కోట్లు చెల్లించాలని డబ్ల్యుబీఐడీసీని ఆదేశించింది.
పశ్చిమ బెంగాల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి టాటా మోటార్స్ సెప్టెంబర్ 1, 2016 నుంచి ఏటా 11 శాతం వడ్డీతో రూ.765.78 కోట్లను రికవరీ చేసుకోవచ్చని ట్రిబ్యునల్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ విచారణలో జరిగిన కోటి రూపాయల ఖర్చులను కూడా రికవరీ చేయాలని ట్రిబ్యునల్ ఆదేశించిందని టాటా మోటార్స్ తెలిపింది.
ఇదీ వివాదం..
పశ్చిమ బెంగాల్‌లో టాటా మోటార్స్ చౌక కారు నానో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని భావించింది. ఈ ప్రాజెక్టు కోసం అప్పటి సీపీఎం నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం 2006లో సింగూర్‌లో దాదాపు 1053 ఎకరాల మేర వ్యవసాయ భూమిని సేకరించింది. అది వివాదానికి కారణమైంది. భూసేకరణకు వ్యతిరేకంగా సింగూర్, నందిగ్రామ్‌లో స్థానిక ప్రజలతో పెద్ద ఉద్యమమే జరిగింది. ఈ వివాదంపై 2016లో సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. భూ సేకరణను సుప్రీంకోర్టు రద్దుచేసింది. సింగూరులో తమకు జరిగిన నష్టానికి రూ. 1,400 కోట్లు పరిహారం ఇవ్వాలని ఇటీవల కోరింది.
మమత ఆధ్వర్యంలో ఆందోళనలు
టాటా మోటార్స్ కోసం భూసేకరణను వ్యతిరేకిస్తూ తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మమతా బెనర్జీతో సహా చాలా మంది స్థానిక రైతులు, రాజకీయ నాయకులు అప్పట్లో ఆందోళనలు చేపట్టారు. దీంతో టాటా తమ తయారీ యూనిట్‌ను గుజరాత్‌కు తరలించింది. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రానికి తరలించింది. ఇందు కోసం సింగూర్‌లో ఫ్యాక్టరీని పూర్తిగా విడదీసి దాదాపు 2,000 ట్రక్కుల్లో గుజరాత్‌లోని సనంద్‌కు తరలించారు.
‘నేనేం చేయలేదు’
నానో ప్లాంట్ పశ్చిమబెంగాల్ నుంచి గుజరాత్ తరలి వెళ్లడంతో దీదీ నేతృత్వంలోని టీఎంసీ కీలక పాత్ర పోషించింది. 34 ఏళ్ల పాటు బెంగాళ్‌లో ఏకఛత్రాధిప్యంగా నడుస్తున్న, అధికారంలో ఉన్న వామపక్షాలను గద్దెదించి 2011లో మమత అధికారంలోకి రావడానికి ఈ ఉద్యమం ఎంతగానో దోహదపడింది. 2022లో ఈ వివాదంపై మమతా బెనర్జీ స్పందిస్తూ.. పశ్చిమ బెంగాల్ నుంచి టాటా మోటార్స్ కంపెనీని తాను వెళ్లగొట్టలేదని అన్నారు. నాటి సీపీఎం ప్రభుత్వం వల్లే కంపెనీ రాష్ట్రం నుంచి వెళ్లిపోయిందని ఆరోపించారు.
సీపీఎం కారణంగానే ఆ కంపెనీ రాష్ట్రం నుంచి వెళ్లిపోయిందని, ఆ ప్రాజెక్టు కోసం సీపీఎం పార్టీ ప్రజల నుంచి బలవంతంగా భూములు తీసుకుందని మమత ఆరోపించారు. తాము ఆ భూములను తిరిగి ప్రజలకు ఇప్పించేలా పోరాడామని, తాము కూడా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించామని, కానీ ఏనాడూ ప్రజల నుంచి బలవంతంగా భూములు లాగేసుకోలేదన్నారు.