Tomato Price: తమిళనాడులోనూ డబుల్ సెంచరీ కొట్టిన టమాటా, ఈసారి రూ.250 కన్ఫామ్!
1 KG Tomato Price Reached Rs 200: ఇప్పటివరకూ ఏపీ, తెలంగాణ, కర్ణాటక మార్కెట్లలో కేజీ టమాటా ధర రూ.200 మార్క్ చేరుకుంది. తమిళనాడులోనూ కేజీ టమాటా ధర డబుల్ సెంచరీ మార్క్ దాటుతోంది.
Tomato Price In Tamil Nadu:
చెన్నై: దేశ వ్యాప్తంగా టమాటా ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వంటల్లో వాడే నిత్యావసర సరుకు టమాటా ధర ఏకంగా డబుల్ సెంచరీ మార్క్ దాటింది. ఇప్పటివరకూ ఏపీ, తెలంగాణ, కర్ణాటక మార్కెట్లలో కేజీ టమాటా ధర రూ.200 మార్క్ చేరుకుంది. తాజాగా తమిళనాడులోనూ కేజీ టమాటా ధర రూ.200కు చేరింది. రాజధాని చెన్నైలోని కొన్ని హోల్‌సేల్ మార్కెట్లలో నాణ్యమైన టమాటాను రూ.180 నుంచి రూ.200 రేటుకు విక్రయిస్తున్నారు. త్వరలోనే తమిళనాడులో టమాటా కేజీ ధర రూ.250 మార్క్ చేరుకుంటుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు.
కోయంబేడు హోల్‌సేల్ మార్కెట్‌లో కేజీ టమాటా ధర రూ.200 పలికింది. అయితే టమాటా ధర డబుల్ సెంచరీ మార్క్ చేయడం ఇదే తొలిసారి అని మార్కెట్ వ్యాపారుల సంఘం కార్యదర్శి సుకుమారన్ తెలిపారు. చెన్నైలోని కొన్ని హోల్‌సేల్ మార్కెట్లలో నాణ్యమైన టమాటా కిలో రూ.185 పలకగా, గరిష్టంగా రూ.200 ధరకు చేరడంతో తమిళ ప్రజలు సైతం టమాటా కష్టాలను ఎదుర్కొంటున్నారు.
మధురై, కోయంబత్తూర్ లలో నాణ్యమైన టమాటా కేజీ ధర రూ.170కు చేరింది. ఇక్కడ సైతం త్వరలోనే రూ.200 మార్క్ చేరుతుందని మార్కెట్ అధికారులు భావిస్తున్నారు. వర్షాలు మొదలైన కొన్ని రోజులకు టమాటా ధరలు దిగి రానున్నాయని తాము భావించామని, కానీ టమాటాలు రికార్డు ధరకు చేరి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని చెప్పారు. కోయంబేడు మార్కెట్ కు సగటున 1200 టన్నుల టమాటా వస్తుంది. కానీ గత కొన్ని రోజులనుంచి దినసరి 300 టన్నుల టమాటా మార్కెట్ కు వస్తుందని, దాంతో టమాటా ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయని ఓ వ్యాపారి తెలిపారు.
తమిళనాడులో శని, ఆదివారాల్లో పలు పట్టణాల్లో రూ.150 నుంచి రూ.170 మధ్య ధర పలికిన టమాటా ఇప్పుడు రూ.200 మార్కు చేరింది. మార్కెట్లకు టమాటా ఇలాగే తక్కువగా వస్తే, ఈ ధరు రూ.250 దాటే ఛాన్స్ ఉంది. తిరుచ్చిలోని గాంధీ మార్కెట్ కు సైతం టమాటా తక్కువగా రావడంతో సరుకు రకాన్ని బట్టి కేజీ ధర రూ.140 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. మధురైలోనూ టమాటా ధరలు రూ.160 నుంచి రెండు వందల వరకు ధర రావడంతో అన్ని ప్రాంతాల్లోనూ సామాన్యులు టమాటా వినియోగం తగ్గించారు. కొందరైతే రేట్లకు భయపడి కొన్ని రోజుల నుంచి టమాటా వాడకం సైతం మానేశారు. పెద్ద పెద్ద రెస్టారెంట్లు సైతం టమాటా లేకుండా బర్గర్, ఇతర ఐటమ్స్ సర్వ్ చేయడం మొదలుపెట్టాయి.
ఇటీవల తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా టమాటా ధర హైదరాబాద్ నగరంలో ఒకేసారి పెరిగిపోయింది. మొన్నటి వరకు 160 నుంచి 180 వరకు ఉన్న టమాటా ధర ఇప్పుడు ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేసింది. అంతటితో ఆగుతుందా అంటే.. సమస్యే లేదు.. ఈ వర్షాల వల్ల గణనీయంగా పంటలు దెబ్బతినటంతో.. మరింత పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు విశ్లేషకులు. ధర పెరగక ముందే విక్రేతలు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి టమాటాలను దిగుమతి చేసుకుంటున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial