వెనక్కి తగ్గిన తమిళనాడు గవర్నర్- సెంథిల్ బాలాజీ పదవి బర్త్‌రఫ్ ఉత్తర్వులు నిలుపుదల
గవర్నర్ రవి ఉత్తర్వులపై తీవ్ర దుమార్ రేగింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంత్రులు, ఇతర పార్టీల నేతలు గవర్నర్ చర్యను తీవ్రంగా ఖండించారు.
సెంథిల్ బాలాజీని మంత్రి పదవి నుంచి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంపై తమిళనాడు గవర్నర్ వెనక్కి తగ్గారు. తన ఉత్తర్వులను నిలుపుదల చేశారు. ఉద్యోగాలు ఇస్తానని చెప్పి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ జూన్ రెండో వారంలో అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సెంథిల్ బాలాజీ కేసుల్లో ఉన్నందున ఆయన వద్ద ఉన్న శాఖలను మంత్రులు తంగమ్ తెన్నరసు, ముత్తుసామికి కేటాయించింది తమిళనాడు ప్రభుత్వం. అంటే ఎలాంటి శాఖలు లేని మంత్రిగా ప్రస్తుతం మంత్రివర్గంలో ఆయన కొనసాగుతున్నారు.
ఇదే విషయాన్ని గవర్నర్‌కు తెలియజేసింది. ఈ పరిస్థితిలో సెంథిల్ బాలాజీని మంత్రిగా కొనసాగించడానికి గవర్నర్ ఆర్ ఎన్ రవి ఆమోదం తెలపలేదు. దీంతో స్టాలిన్ ప్రభుత్వం సెంథిల్ బాలాజీని మంత్రిగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిస్థితిలో సెంథిల్ బాలాజీ క్రిమినల్ కార్యకలాపాలను ఎదుర్కొంటున్నందున, ఆయన మంత్రిగా ఉంటే దర్యాప్తుపై ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పి మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు.
గవర్నర్ ఉత్తర్వులపై తీవ్ర దుమార్ రేగింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంత్రులు, ఇతర పార్టీల నేతలు గవర్నర్ చర్యను తీవ్రంగా ఖండించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇదివరకే ప్రకటించారు. దీంతో కాస్త వెనక్కి తగ్గిన గవర్నర్ తాను ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తుతానికి నిలుపుదల చేశారు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు తెలియజేసినట్లు సమాచారం.
సెంథిల్ బాలాజీ ఇంట్లో ఈడీ సోదాలు
జూన్ 13న తమిళనాడు ప్రభుత్వంలో విద్యుత్, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీ ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాదాపు 17 గంటల పాటు దాడి చేసింది. కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. విచారణ నిమిత్తం సెంథిల్ బాలాజీని అదుపులోకి తీసుకున్నప్పుడు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చాతిలో నొప్పి వస్తుందని ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అందిస్తున్నారు.
సెంథిల్ బాలాజీకి కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను కస్టడీలోకి తీసుకోవాలని ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎనిమిది రోజుల పాటు ఈడీ విచారణకు అనుమతించింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు సెంథిల్ బాలాజీకి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్స జరగడంతో ఈడీ విచారణ జరపలేకపోయింది.