స్వలింగ సంపర్క వివాహాల చట్టబద్ధతకు నో చెప్పిన సుప్రీంకోర్టు
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. LGBTQIA+ కమ్యూనిటీకి చెందిన వ్యక్తుల వివాహానికి సమానత్వ హక్కులు ఇచ్చేందుకు నిరాకరించింది.
Marriage equality judgement: స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత ధ్రువీకరణపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. LGBTQIA+ వర్గాలకు చెందిన వ్యక్తుల వివాహానికి తాము చట్టబద్ధత కల్పించలేమని తెలిపింది. స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని స్పష్టం చేసింది. వారు సహజీవనంలో ఉండొచ్చని పేర్కొంది. తమ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని 20 స్వలింగ జంటలు వేసిన పిటిషన్ ను సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4 వేర్వేరు తీర్పులను వెల్లడించింది. దీనిపై పార్లమెంటే చట్టం చేయాలన్ని ధర్మాసనం, స్వలింగ సంపర్కం జంటలపై ఎలాంటి వివక్ష చూపించొద్దని, వారి హక్కులను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు 3:2 మెజారిటీతో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
సీజేఐ కీలక వ్యాఖ్యలు
ప్రత్యేక వివాహ చట్టాన్ని మార్చడం పార్లమెంట్ విధి అని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ స్పష్టం చేశారు. న్యాయస్థానం చట్టాన్ని రూపొందించదని, కానీ దాన్ని అర్థం చేసుకుని అమలు చేయగలదని పేర్కొన్నారు. స్వలింగ వివాహాలపై చట్టబద్ధత కోరుతూ దాఖలైన 21 పిటిషన్లను జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.
హోమో సెక్సువాలిటీ కేవలం నగరాలు, ఉన్నత వర్గాలకు పరిమితం కాదని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక వివాహ చట్టంలో మార్పు అవసరమా.. లేదా..? అనేది పార్లమెంట్ నిర్ణయిస్తుందని తెలిపారు. భిన్న లింగ జంటలు మాత్రమే మంచి తల్లిదండ్రులుగా ఉంటారని చట్టం భావించడం లేదని, అలా భావిస్తే అది స్వలింగ సంపర్కులపై వివక్షే అని అభిప్రాయపడ్డారు. ఇలాంటి బంధాలపై వివక్ష చూపకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించారు. అందరినీ సమానంగా చూడాలని ఈ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యానించింది.
హక్కులను కాపాడాలి
ప్రతి ఒక్కరికీ వారి జీవిత భాగస్వామిని ఎన్నుకునే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. స్వలింగ చట్టబద్ధతపై తీర్పు వెల్లడిస్తూ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఆర్టికల్ 21 ప్రకారం గౌరవంగా జీవించడం ప్రాథమిక హక్కు. ఈ హక్కులను ప్రభుత్వమే కాపాడాలి.' అని పేర్కొన్నారు. వివాహానికి చట్టబద్ధమైన హోదా ఉంటుందని, అది ప్రాథమిక హక్కు కాదని అన్నారు. ఒకవేళ, అలాంటి వాటికి చట్టపరమైన హోదా ఇస్తే అవసరమైన వారు హక్కులు పొందుతారని సీజేఐ వెల్లడించారు.
దత్తతపై కుదరని ఏకాభిప్రాయం
స్వలింగ సంపర్క జంటలకు పిల్లలను దత్తత చేసుకునే హక్కు లేదని సుప్రీంకోర్టు తెలిపింది. దీనిపై 3:2 మెజార్టీతో తీర్పు వెలువడింది. ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎస్ కే కౌల్, దత్తతకు అనుకూలంగా, జస్టిస్ రవీంద్రభట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహ దత్తతకు వ్యతిరేకంగా తీర్పులు వెలువరించారు.
కేంద్రం ఏం చెప్పిందంటే.?
కాగా, ఈ అంశంపై మార్చిలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించింది. 'భారత పురుషుడు, స్త్రీ పెళ్లి తర్వాత దంపతులుగా మారుతారు. పిల్లలు పుడితే తల్లిదండ్రులవుతారు. స్వలింగ సంపర్కులు భాగస్వాములుగా జీవించడం నేరం కాదు. అయితే, వీరిని భర్త, భార్య, పిల్లలతో కూడిన కుటుంబంతో పోల్చలేం. ఈ వివాహానికి చట్టబద్ధత కల్పించలేం. ఈ వివాహాలు సమాజంలో కొత్త సమస్యలు సృష్టిస్తాయి.' అని తెలిపింది.
ఈ అంశంపై అన్ని పిటిషన్లను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం, మేలో తీర్పును రిజర్వ్ చేసింది. అనంతరం మంగళవారం తీర్పు వెలువరించింది.