Hemant Soren: ఝార్ఖండ్ మాజీ సీఎంకు చుక్కెదురు - పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
Hemant Soren Petition: ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ ను విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
Supreme Court Rejects Hemant Soren Petition: ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren)కు సుప్రీంకోర్టులో (Supreme Court) చుక్కెదురైంది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని.. హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) ఆయన్ను బుధవారం అరెస్ట్ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొలుత ఆయన ఝార్ఖండ్ హైకోర్టునే ఆశ్రయించారు. గురువారం ఉదయం దీనిపై ధర్మాసనం విచారించాల్సి ఉంది. అయితే, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ తదితరులు వ్యూహం మార్చి.. నేరుగా సుప్రీంకోర్టుకే వెళ్లాలని నిర్ణయించారు. హైకోర్టులో తన పిటిషన్ ఉపసంహరించుకుంటున్నామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ (Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనానికి వారు తెలిపారు. కుట్రలో భాగంగానే ఈడీ తనను అరెస్ట్ చేసిందని.. తన పదవికి రాజీనామా చేసేందుకు రాజ్ భవన్ కు వెళ్తే అక్కడ అరెస్ట్ చేయడం అన్యాయమని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఇదీ జరిగింది
మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోరెన్ ను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు సోమవారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసానికి వెళ్లారు. 13 గంటలు ఎదురుచూసినా సోరెన్ మాత్రం అందుబాటులోకి రాలేదు. అయితే, సీఎం నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు 2 బీఎండబ్ల్యూ కార్లు, పలు కీలక దస్త్రాలు, రూ.36 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాత్రి వరకూ ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఆయన రాంచీలో (Ranchi) ప్రత్యక్షమయ్యారు. తన అధికారిక నివాసంలో మంత్రులు, జేఎంఎం ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. అనంతరం ఈడీ విచారణతో రాజ్ భవన్ కు వెళ్లిన ఆయన బుధవారం తన రాజీనామా లేఖను గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు సమర్పించారు.
సీఎంగా చంపై సోరెన్
కాగా, హేమంత్ సోరెన్ కు అత్యంత సన్నిహితుడు, మంత్రి అయిన చంపై సోరెన్ ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ కు చంపై విజ్ఞప్తి చేశారు. అయినా, గవర్నర్ నుంచి స్పందన లేకపోవడంతో మరోసారి విజ్ఞప్తి చేశారు. చివరకు గురువారం రాత్రి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ చంపై సోరెన్ ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. దీంతో రాజకీయ అనిశ్చితి తెరపడినట్లయింది. 'చంపై సోరెన్ ను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించాం. ఎప్పుడు ప్రమాణం చేస్తారో ఆయనే నిర్ణయించుకోవాలి.' అని గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నితిన్ మదన్ కులకర్ణి అన్నారు. మరోవైపు, ప్రభుత్వ మెజార్టీ నిరూపణ కోసం కొత్తగా సీఎంగా ఎన్నికైన చంపై సోరెన్ కు గవర్నర్ 10 రోజుల సమయం ఇచ్చారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రాజేశ్ ఠాకూర్ తెలిపారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతోన్న భారత్ జోడో న్యాయ్ యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు అంటే శుక్రవారం మధ్యాహ్నానికి చంపై సోరెన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు. ఇదే విషయాన్ని ఝార్ఖండ్ సీఎల్పీ నేత ఆలంగీర్ ఆలం తెలిపారు.
Also Read: Jharkhand CM: ఝార్ఖండ్ లో వీడిన రాజకీయ అనిశ్చితి - సీఎంగా చంపై సోరెన్, ఆఖరి నిమిషంలో మారిన వ్యూహాలు