PM Modi Mann Ki Baat: నిస్వార్థ సేవ, క్రమశిక్షణ ఆరెస్సెస్ నిజమైన బలాలు: మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ
Mann Ki Baat | నిస్వార్థ సేవకు, క్రమశిక్షణ ఆరెస్సెస్ నిదర్శమని ప్రధాని మోదీ అన్నారు. ‘దేశం ముందు’ అనే నినాదంతో సంఘ్ పనిచేస్తుందని మన్ కీ బాత్‌లో కొనియాడారు.

PM Modi In Mann Ki Baat: నిస్వార్థ సేవకు స్ఫూర్తి, క్రమశిక్షణకు మారుపేరు ఆరెస్సెస్ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆరెస్సెస్ 100 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో ఆ సంఘం సేవలను ప్రధాని కొనియాడారు. నిస్వార్థ సేవ, క్రమశిక్షణ సంఘ్ నిజమైన బలాలు అన్నారు. ‘దేశం ముందు’ అనే నినాదంతో సంఘ్ పనిచేస్తుందని, ప్రతి చర్యలోనూ అది కనిస్తుంన్నారు. అలా నేటివరకు లెక్కలేనన్ని స్వచ్ఛంద సేవలు చేసిందన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ తన 125వ మన్ కీ బాత్ రేడియో ప్రసారంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా స్వదేశీ వస్తువుల వినియోగం గురించి మరోసారి మాట్లాడారు. ప్రజలు ఖాదీ వస్తువును కొనుగోలు చేయాలని కోరారు.
సైద్ధాంతిక బానిసత్వం నుంచి విముక్తి కోసం స్థాపన
ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రశంసిస్తూ ‘కొద్ది రోజుల్లో మనం విజయదశమిని జరుపుకోబోతున్నాం. ఈసారి ఈ వేడుకలు మరింత ప్రత్యేకమైనవి. ఈ రోజున, ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ శతాబ్దపు ప్రయాణం అద్భుతమైనది మాత్రమే కాదు. స్ఫూర్తిదాయకం. వందేండ్ల క్రితం RSS స్థాపించిన సమయంలో మన దేశం బానిసత్వ సంకెళ్లలో బాధకు గురవుతోంది. శతాబ్దాల నాటి ఆ బానిసత్వం మన ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవంపై భారీ గాయాన్ని చేసింది. అందుకే దేశ స్వాతంత్ర్యంతో పాటు, దేశాన్ని సైద్ధాంతిక బానిసత్వం నుంచి విముక్తి చేసేందుకు 1925లో కేబీ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ను స్థాపించారని మోదీ అన్నారు.
As the RSS marks its centenary, highlighted the rich contribution of the RSS to our nation. #MannKiBaat pic.twitter.com/DBlURIv7uK
— Narendra Modi (@narendramodi) September 28, 2025
ముందుండేది ఆరెస్సెస్ సేవకులే..
‘హెడ్గేవార్ తర్వాత గురు గోల్వాల్కర్ దేశానికి సేవ చేయడానికి ఈ మహా యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లారు. నిస్వార్థ సేవాస్ఫూర్తి క్రమశిక్షణ ఇవే సంఘ్ నిజమైన బలాలు. వందేళ్లుగా RSS విరామం, విశ్రాంతి లేకుండా దేశ సేవలో అవిశ్రాంతంగా నిమగ్నమై ఉంది’ అని మోదీ కొనియాడారు అన్నారు. ‘ఏదైనా ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు ముందుగా అక్కడికి చేరుకునేది ఆర్‌ఎస్‌ఎస్ స్వచ్ఛంద సేవకులే. లెక్కలేనన్ని ఆర్‌ఎస్‌ఎస్ స్వచ్ఛంద సేవకుల ప్రతి చర్యలోనూ, 'దేశం ముందు' అనే స్ఫూర్తి ఎల్లప్పుడూ అత్యున్నతంగా ఉంటుంది’ అని అన్నారు.
ఉమెన్ నేవీ ఆఫీసర్లతో మోదీ సంభాషణ
ఈ సందర్భంగా ఉమెన్ నేవీ ఆఫీసర్ లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా, లెఫ్టినెంట్ కమాండర్ రూపతో ప్రధాని ఫోన్లో సంభాషించారు. సముద్ర గర్భంలో వారు చూపుతున్న తెగువను ప్రధాని ప్రశంసించారు. భారత పుత్రికలు కఠినమైన పరిస్థితులను సైతం సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారని కొనియాడారు.
ఛఠ్ను యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చేందకు కృషి
మన పండుగలు మన సంస్కృతిని సజీవంగా ఉంచుతాయని మోదీ అన్నారు. ఛాఠ్ పూజ గురించి ప్రస్తావించారు. ‘ఒకప్పుడు చఠ్ పూజ స్థానికంగా మాత్రమే ప్రసిద్ధి. ఇప్పుడు ప్రపంచ పండుగగా మారుతోంది. ఛఠ్ మహాపర్వాన్ని యునెస్కో అవ్యక్త సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రపంచ పండుగగా గుర్తించినప్పుడు ప్రపంచంలోని వివిధ మూలల్లోని ప్రజలు ఈ పండుగ యొక్క గొప్పతనాన్ని అనుభవించగలుగుతారు’ అని అన్నారు. ప్రభుత్వ ప్రయత్నాలతో కోల్‌కతా దుర్గా పూజను యునెస్కో జాబితాలో చేర్చారని ఆయన గుర్తుచేశారు.
ఖాదీ వస్తువులే కొనుగోలు చేయండి
అక్టోబర్ 2 గాంధీ జయంతి అని గుర్తుచేసుకుంటూ.. దురదృష్టవశాత్తు స్వాతంత్ర్యం తర్వాత దేశంలో ఖాదీ పట్ల ఆకర్షణ తగ్గిందని, కానీ గత 11 సంవత్సరాలుగా ఖాదీ పట్ల ఆకర్షణ గణనీయంగా పెరిగిందన్నారు. అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. "అక్టోబర్ 2న ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. గర్వంగా చెప్పండి, ఇది స్వదేశీ అని" అని ఆయన అన్నారు.
Began today’s #MannKiBaat episode by remembering Shaheed Bhagat Singh and Lata Didi. pic.twitter.com/ceRqx8Wcd6
— Narendra Modi (@narendramodi) September 28, 2025
భగత్ సింగ్, లతా మంగేష్కర్‌కు నివాళి
స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్, ప్రముఖ గాయని లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా వారికి మోదీ నివాళులు అర్పించారు. అమర్ షహీద్ భగత్ సింగ్ ప్రతి భారతీయుడికి, ముఖ్యంగా దేశ యువతకు స్ఫూర్తిదాయకం అన్నారు. లతా మంగేష్కర్ దేశభక్తి గీతాలు దేశ ప్రజలను ఎంతో ప్రేరేపించించాయని తెలిపారు. మంగేష్కర్ పాడిన 'జ్యోతి కలాష్ చల్కే' పాటను రేడియో ప్రసారంలో వినిపించారు.





















