Sheena Bora murder Case: షీనా బోరా హత్య కేసు అప్‌డేట్- ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్
Sheena Bora murder Case: షీనా బోరా హత్య కేసు నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్ లభించింది.
Sheena Bora murder Case: షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీకి ఊరట లభించింది. ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులిచ్చింది.
#BREAKING| Supreme Court grants bail to Indrani Mukherjea in Sheena Bora case, considering the fact that she has been under custody for 6.5 years, and that the trial is not likely to complete soon. pic.twitter.com/cOs5Eu6ud2
— Live Law (@LiveLawIndia) May 18, 2022
ఈ కేసులో దాదాపు ఆరున్నరేళ్లుగా ఆమె జైలులోనే ఉన్నారు. విచారణ ఇప్పటిలో పూర్తయ్యేలా కనిపించకపోవడంతో ఇంద్రాణికి బెయిల్ ఇస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది.
ఇదే ట్విస్ట్
షీనా బోరా హత్య కేసులో ఇటీవల ఓ ట్విస్ట్ ఇచ్చారు ఇంద్రాణి ముఖర్జీ. అసలు హత్యకు గురయిందని భావిస్తోన్న షీనా బోరా బతికే ఉందని, సీబీఐ ఆమె ఆచూకీ కనిపెట్టాలని ఆమె తల్లి, కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ అన్నారు. జమ్ముకశ్మీర్ లోయలో ఓ మహిళ షీనాను చూశారన్నారు. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్‌కు ఆమె లేఖ రాశారు.
ఇదే కేసు
2012 ఏప్రిల్ 24న షీనా బోరా హత్య జరిగింది. ఇంద్రాణీ ముఖర్జీతో పాటు షీనా మారు తండ్రి పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ డ్రైవర్ శ్యామ్ సుందర్ రాయ్‌ను ముంబయి పోలీసులు 2015 ఆగస్టులో అరెస్టు చేశారు. షీనాను అపహరించి, హత్య చేశారని అభియోగాలు మోపారు. అప్పటి నుంచి ఇంద్రాణీ జైలులోనే ఉన్నారు.
తన మాజీ భర్త కొడుకుతో షీనా రిలేషన్షిప్లో ఉందనే విషయాన్ని ఇంద్రాణీ గ్రహించి ఈ హత్య చేసిందని అధికారులు ఆరోపిస్తున్నారు. తన తల్లి గురించి నిజాలు బయటపెడతానని షీనా హెచ్చరించడం కూడా హత్యకు కారణమై ఉండొచ్చని సీబీఐ వాదిస్తోంది. హత్య తర్వాత.. దాన్ని కప్పిపుచ్చేందుకు పెద్ద కథను అల్లారు ఇంద్రాణీ.
షీనా తన సోదరి అని, అమెరికాకు వెళ్లిపోయిందని చెప్పుకొచ్చారు. అయితే, మరో కేసులో ఇంద్రాణీ డ్రైవర్ అరెస్టు కావడం వల్ల షీనా హత్య వెలుగులోకి వచ్చింది. డ్రైవర్ వాంగ్మూలంతో షీనా మృతదేహాన్ని ముంబయికి దగ్గర్లోని ఓ అడవిలో అధికారులు గుర్తించారు.