SCO Foreign Ministers Meet: ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిందే, స్పష్టం చేసిన భారత్
SCO Foreign Ministers Meet: సీమాంతర ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిందేనని షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల సమావేశంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి సమక్షంలో విదేశాంగ మంత్రి జై శంకర్ స్పష్టంచేశారు.
![SCO Foreign Ministers Meet: ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిందే, స్పష్టం చేసిన భారత్ SCO Summit in India goa jaishankar comments on pakisthan channel of finances for terrorism must be seized SCO Foreign Ministers Meet: ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిందే, స్పష్టం చేసిన భారత్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/05/68c424e1f8e06a518f8752840c77c8781683276588731691_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
SCO Foreign Ministers Meet: ప్రపంచ దేశాలకు ఉగ్రవాదం ముప్పుగా పరిణమించిందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన వ్యక్తంచేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చే మాధ్యమాలను బేషరతుగా నిషేధించాలని షాంఘై సహకార సంస్థ విదేశాంగ మంత్రుల సమక్షంలో సూచించారు. సమావేశంలో పాల్గొన్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ సమక్షంలోనే దాయాదిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన అవసరాన్ని ఎస్సీవో సభ్య దేశాలకు నొక్కి చెప్పారు.
భారత్ అధ్యక్షతన గోవాలో రెండో రోజు షాంఘై సహకార సంస్థ(SCO) విదేశాంగ మంత్రుల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పాక్ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టోతో పాటు చైనా విదేశాంగ మంత్రి క్వింగ్ గాంగ్, రష్యా మంత్రి సెర్గీ లావ్రోవ్ పాల్గొన్నారు. వీరితో పాటు తజకిస్థాన్, కిర్జికిస్థాన్, కజకిస్థాన్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. ఇందులో ఆంగ్లాన్ని ఎస్సీవో మూడో అధికారిక భాషగా గుర్తించాలని సభ్య దేశాలను జైశంకర్ కోరారు. రష్యన్, మాండరిన్‌లు అధికారికంగా ఉన్న క్రమంలో ఆంగ్లాన్నీ అధికారిక భాషగా చేర్చాలన్నారు. ఎస్సీవోలో సంస్కరణలు, ఆధునీకరణపై చర్చ ప్రారంభమైందని చెప్పడానికి సంతోషిస్తున్నాని అన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని జైశంకర్ ఈ వేదికపై మరోసారి స్పష్టంచేశారు.
"ఉగ్రవాద ముప్పు నిరంతరం కొనసాగుతోంది. ఉగ్రవాదానికి ఎటువంటి సమర్థింపు ఉండకూడదు. సమర్థించకపోవడమే కాదు, సీమాంతర ఉగ్రవాదంతోపాటు అన్ని రూపాల నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చే మాధ్యమాలను బేషరతుగా నిషేధించాలి. ఎస్సీవో ఉద్దేశాల్లో ఉగ్రవాదం ముఖ్యమైనదని మళ్లీ గుర్తు చేస్తున్నాను"- ఎస్.జై శంకర్, విదేశాంగమంత్రి
చేతులు కలపకుండా.. నమస్తే!
శుక్రవారం జరిగిన SCO విదేశాంగ మంత్రుల మండలి సమావేశానికి హాజరైన పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీని జై శంకర్.. షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారం చేసి స్వాగతం పలికారు.
కాగా.. సమావేశం ప్రారంభానికి ముందు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీకి మన దేశ విదేశాంగశాఖ మంత్రి ఎస్.జైశంకర్ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్తేతో స్వాగతం పలికారు. గడిచిన 12 ఏళ్లలో భారత్‌ను సందర్భించిన మొట్టమొదటి పాకిస్థాన్ విదేశాంగ మంత్రిగా బిలావల్ భుట్టో జర్దారీ గుర్తింపు పొందారు. జమ్మూ కాశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదంతో సహా అనేక సమస్యలపై రెండు దేశాల మధ్య సంబంధాల్లో కొనసాగుతున్న ఒత్తిడి మధ్య పాక్ మంత్రి భారత్‌లో పర్యటిస్తున్నారు.
రష్యా, చైనా కూడా సభ్యులుగా ఉన్న ఈ ప్రత్యేక సమూహం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనని పశ్చిమ దేశాలు నిశితంగా గమనిస్తున్నప్పటికీ, కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఆఫ్ఘనిస్తాన్‌లో భద్రతా పరిస్థితి క్షీణిస్తున్న నేపథ్యంలో SCO సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, రెండు అంశాలు అధికారిక ఎజెండాలో లేవు. అయితే, సభ్య దేశాలు తమ జాతీయ ప్రకటనలలో భాగంగా ఈ సమస్యలను లేవనెత్తే అవకాశముంది.
భద్రత ప్రధాన అంశంగా 2001లో షాంఘై సహకార సంస్థ ఏర్పాటైంది. 2017లో భారత్, పాకిస్థాన్ సమూహంలో పూర్తి సభ్యత్వం పొందాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సెక్రటరీ జనరల్ జాంగ్ మింగ్‌తో సమావేశమయ్యారు. తమ భేటీ అత్యంత ఫలప్రదమైందని చెప్పారు. భారతదేశ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశం ప్రపంచ దేశాల భద్రత కోసం నిబద్ధతతో జరుగుతోందని వెల్లడించారు. విదేశాంగ మంత్రుల సమావేశంలో 15 ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయని, జూలైలో జరిగే నేతల సమావేశంలో వాటిని అనుసరించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)