Grains Prices Increasing: మండుతున్న నిత్యావసరాలు, ధాన్యాల ధరలు, అన్నిటికీ కారణం ఇదే
సకాలలో వర్షాలు పడకపోవడం ఒకెత్తయితే ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వానలతో పంటలు దెబ్బతిన్నాయి. ఈ కారణంగా ఆశించిన స్థాయిలో నిత్యావసరాలు మార్కెట్ లో రావడం లేదు.
ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అనే చందంగా ఉంది మధ్యతరగతి ప్రజల జీవితాలు. రెక్కలు ముక్కలు చేసుకుని కుటుంబానికి మూడు పూటలా భోజనం పెట్టే పరిస్థితులు కనిపించడం లేదు. నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. మొన్నటి దాకా టమాటా ధరలు కొండెక్కికూర్చున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 250 నుంచి 300 పలికింది. ప్రస్తుతం టమాటా ధరలు దిగివచ్చాయి. బియ్యం, కందిపప్పు, వేరుశనగ విత్తనాల వంటి నిత్యావసరాల ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులు హడలెత్తిపోతున్నారు. సకాలలో వర్షాలు పడకపోవడం ఒకెత్తయితే ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వానలతో పంటలు దెబ్బతిన్నాయి. ఈ కారణంగా ఆశించిన స్థాయిలో నిత్యావసరాలు మార్కెట్ లో రావడం లేదు. డిమాండ్ ఎక్కువ సప్లయి తక్కువ అన్నట్లు పరిస్థితి తయారైంది.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు పప్పులేకుండా ముద్ద దిగదు. వారంలో మూడు నాలుగు రోజులు పప్పు ఉండాల్సిందే. వీటికి తోడు మినపప్పు, శనగపప్పు, పెసరపప్పును వంటకాల్లో వినియోగిస్తారు. వీటి ధరలు ఆరు నెలల్లోనే దాదాపు 50శాతం పెరిగాయి. కందిపప్పు ఫిబ్రవరిలో రూ.110-120 ఉంటే ప్రస్తుతం రూ.170కి చేరింది. మినపపప్పు ధర కిలో రూ.110 నుంచి నెల రోజుల్లోనే రూ.130కి పెరిగింది. తెలంగాణకు మహారాష్ట్ర నుంచి ఎక్కువగా కందిపప్పు వస్తుంది. అక్కడి నుంచి వచ్చే కందిపప్పు తగ్గిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. మొన్నటి దాకా నాణ్యమైన కందిపప్పు వాడిన సామాన్యులు ప్రస్తుతం ఎర్రపప్పును వాడుతున్నారు. పెరిగిన ఖర్చులకు అనుకూలంగా ఆదాయాలు లేకపోవడంతో నెలనెలా భారం పెరుగుతూనే ఉంది.
అయిదారు నెలల క్రితం రూ.300లోపే ఉన్న జీలకర్ర ప్రస్తుతం కిలో రూ.700 దాటింది. సెనగపప్పు రూ.65 నుంచి రూ.75-80కి చేరింది. పాల ధరలు 80-100 చేరాయి. చింతపండు ధర కిలో రూ.130 నుంచి రూ.150కి పెరిగింది. సూపర్‌మార్కెట్లలో 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఏటికేడు దిగుబడి గణనీయంగా తగ్గిపోతుండటంతో చింతపడు ధరలు భగ్గుమంటున్నాయి. వంట నూనెలు, అల్లం, వెల్లుల్లి ధరలు కొంత తగ్గాయి. వారం క్రితం వరకు 280 పలికిన అల్లంవెల్లుల్లి పేస్టు ఇప్పుడు రూ.180కి దిగి వచ్చింది.
బియ్యం ధరలు కొండెక్కుతున్నాయి. సన్నబియ్యం 25 కిలోల బస్తా రూ.1,250 నుంచి 1,600 వందలకు చేరింది. నాణ్యమైనవి కిలో రూ.54 నుంచి రూ.64కి చేరాయి. విదేశాలకు సన్నబియ్యం ఎగుమతులపై నిషేధం విధించాలని వ్యాపారులు చెబుతున్నారు. కేంద్రప్రభుత్వం ఇప్పటికే కొన్ని రకాల బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ఇంటి అద్దెలు, విద్యుత్ చార్జీలు, సొంతిల్లు కలిగిన వారికి ఆస్తి పన్నులు, విద్య, వైద్యంలో పెరిగిన ఖర్చులు, కూరగాయలు, పాలు ఇతర నిత్యావసర ధరలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత తొమ్మిదేళ్లలో 60% నుంచి 75% నిత్యావసర ధరలు పెరిగాయి. ఇంటి ఖర్చులు డబుల్ అయియాయి. ఈ ధరలు పేద మధ్యతరగతి వారి మీదనే ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా సగటు పౌరుడు రోజురోజుకు పేదరికంలోకి నెట్టుకుపోతున్నాడని కేంద్ర గణాంకాలు తెలుపుతున్నాయి.