PM Modi Speech Highlights: ఈ మార్గం చాలా కఠినం, ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం - గెలిచి చూపించాం: మోదీ
సోమవారం ఉదయం 7.30 గంటలకు ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎర్రకోట పై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించారు.
ఈ 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, ఎత్తులు - పల్లాల మధ్య అందరి కృషితో మనం చేరగలిగిన చోటికి చేరుకున్నామని ప్రధాని మోదీ అన్నారు. 2014లో దేశ పౌరులు తనకు బాధ్యతను అప్పగించారని, స్వాతంత్య్రం తర్వాత జన్మించిన మొదటి వ్యక్తి ఎర్రకోట నుండి ఈ దేశ పౌరులను ఉద్దేశించి ప్రసంగించే అవకాశాన్ని అందుకున్నాడని మోదీ అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం 7.30 గంటలకు ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎర్రకోట పై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించారు.
ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నేడు భారతదేశ త్రివర్ణ పతాకం దేశంలోని నలుమూలల్లో సగర్వంగా రెపరెపలాడుతోందని అన్నారు. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తాను భారతీయులందరికీ, భారతదేశాన్ని ప్రేమించే వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. నవ సంకల్పంతో నూతన దిశలో పయనించే రోజు ఇదని అభివర్ణించారు. ఈ సందర్భంగా దేశం కోసం జీవితాలను త్యాగం చేసిన వారి పేర్లను మోదీ గుర్తు చేశారు.
‘‘స్వాతంత్య్ర పోరాటం గురించి మాట్లాడేటప్పుడు గిరిజన సమాజాన్ని మర్చిపోలేం. భగవాన్ బిర్సా ముండా, సిద్ధూ-కణ్హు, అల్లూరి సీతారామ రాజు, గోవింద్ గురు - స్వాతంత్య్ర పోరాటానికి గొంతుకగా నిలిచారు. గిరిజన సమాజాన్ని మాతృభూమి కోసం జీవించడానికి, చనిపోయేందుకు సిద్ధమైన అనేక మంది ఉన్నారు. మనకు స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన అభివృద్ధి పథాన్ని శంకించే అనేక మంది సంశయవాదులు ఉన్నారు. కానీ, ఈ దేశంలోని ప్రజల గురించి వేరే విషయం ఉందని వారికి తెలియదు. ఈ నేల ప్రత్యేకమైనదని వారికి తెలియదు’’
వారి ముందు తలవంచండి - మోదీ
‘‘భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది. 75 ఏళ్ల ప్రయాణంలో భారత్‌కు అమూల్యమైన సామర్థ్యం ఉందని, అనేక సవాళ్లను ఎదుర్కొన్నామని భారత్ నిరూపించుకుంది. స్వాతంత్య్రం కోసం పోరాడిన వారైనా, దేశాన్ని నిర్మించిన వారైన - డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, నెహ్రూ జీ, సర్దార్ పటేల్, ఎస్పీ ముఖర్జీ, ఎల్బీ శాస్త్రి, దీనదయాళ్ ఉపాధ్యాయ, జేపీ నారాయణ్, ఆర్‌ఎం లోహియా, వినోబా భావే, నానాజీ దేశ్‌ముఖ్, సుబ్రమణ్య భారతి - అటువంటి గొప్ప వ్యక్తుల ముందు తలవంచండి’’ అని ప్రధాని అన్నారు.
వారందరినీ స్మరించుకోవాల్సిన రోజు
‘‘‘ఆజాదీ మహోత్సవ్’ సందర్భంగా మనం ఎందరో జాతీయ స్వాతంత్య్ర నాయకులను స్మరించుకున్నాం. ఆగస్టు 14న మనం దేశ విభజన నాటి భయాందోళనలను గుర్తుచేసుకున్నాము. గత 75 ఏళ్లలో మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించిన దేశ పౌరులందరినీ ఈ రోజు స్మరించుకోవాల్సిన రోజు’’ అని ప్రధాని మోదీ అన్నారు.
నవ సంకల్పంతో కొత్త దిశలో పయనించే రోజు
జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తాను భారతీయులందరికీ, భారతదేశాన్ని ప్రేమించే వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. నవ సంకల్పంతో నూతన దిశలో పయనించే రోజు ఇదని అభివర్ణించారు.
ప్రతి ప్రభుత్వం అందుకోసం పని చేయాలి - మోదీ
‘‘భారతదేశం ఒక ఆకాంక్షాపూరిత సమాజం (Aspirational Society), భారతదేశ ప్రజలు సానుకూల మార్పులను కోరుకుంటున్నారు. దానికి సహకరించాలని కూడా కోరుకుంటున్నారు. ప్రతి ప్రభుత్వం ఈ ఆకాంక్షాపూరిత సమాజం (Aspirational Society) కోసం పని చేయాలి’’
వచ్చే 25 ఏళ్లు పంచప్రాణాలు పెట్టి పని చేయాలి - మోదీ
‘‘వచ్చే 25 ఏళ్లు పంచ ప్రాణాలు పెట్టి అభివృద్ధి కోసం పని చేయాలి. ఈ కాలంలోనే స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకారం చేయాలి. సంపూర్ణ అభివృద్ధి మన ముందు ఉన్న అతి పెద్ద ఛాలెంజ్. మనలో ఇంకా ఏ మూలైనా బానిస మనస్తత్వం దాగి ఉంటే దాన్ని పూర్తిగా పారద్రోలాలి. సర్వ స్వతంత్ర ప్రజాస్వామ్యంగా మనం నిలబడాలి. 1. వికసిత భారతం, 2. బానిసత్వ నిర్మూలన, 3. వారసత్వం, 4. ఏకత్వం, 5. పౌర బాధ్యత ఇవే మన పంచ ప్రాణాలు’’
రాజకీయ సుస్థిరత ఉంటేనే గౌరవం - మోదీ
‘‘రాజకీయ సుస్థిరత వల్ల కలిగే ప్రయోజనాలను భారత్ ఇప్పటికే ప్రపంచానికి చాటింది. దీనివల్ల అభివృద్ధిలో వేగం, నిర్ణయాధికారంలో దేశం శక్తివంతం అవుతుంది. రాజకీయ సుస్థిరత ఉండడం అనేది దేశ గౌరవ మర్యాదలను కూడా పెంచుతుంది. వచ్చే 25 ఏళ్లు మనకి అమృత కాలం. అది చాలా ముఖ్యం’’
జై అనుసంధాన్ జోడించాలి - మోదీ
‘‘లాల్ బహదూర్ శాస్త్రి గారి 'జై జవాన్, జై కిసాన్' నినాదాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకుంటాము. తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ నినాదానికి 'జై విజ్ఞాన్' అని జోడించారు. ఇప్పుడు, జోడించాల్సిన మరో అవసరం ఉంది - 'జై అనుసంధాన్' (పరిశోధన & ఆవిష్కరణ). జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ ఔర్ జై అనుసంధాన్’’
చివరి వ్యక్తిని కూడా సమర్థుడ్ని చేయాలనేది ఆయన కల - మోదీ
‘‘చివరి వ్యక్తి కోసం శ్రద్ధ వహించాలనే కల, చివరి వ్యక్తిని కూడా సమర్థుడిగా మార్చాలనేది మహాత్మా గాంధీ ఆకాంక్ష. నేను దాని కోసం నన్ను అంకితం చేసుకున్నాను. ఆ ఎనిమిదేళ్లు, అనేక సంవత్సరాల స్వాతంత్య్ర అనుభవం ఫలితంగా 75 సంవత్సరాల స్వాతంత్య్రం సందర్భంగా నేను ఒక సామర్థ్యాన్ని చూడగలిగాను’’ అని మోదీ అన్నారు.