Petrol Diesel News: జులై 1 నుంచి ఈ వాహనాలకు పెట్రోల్ డీజిల్ బంద్ - లక్షల మందిపై ప్రభావం
Petrol Diesel News: ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్న అధికారులు. పదేళ్లు దాటిన వాహనాలకు ఇంధనం వేయొద్దని బంకులకు ఆదేశించారు. ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) సంచలన నిర్ణయం తీసుకుంది. 2025 జులై 1 నుంచి ఢిల్లీలో 15 ఏళ్లకుపైబడిన పాత పెట్రోల్ వాహనాలకు, 10 ఏళ్లకుపైబడిన పాత డీజిల్ వెహికల్స్‌కు పెట్రోల్ ఫిల్ చేయొద్దని నిర్ణయించింది.
ఈ ప్రాంతాల్లో ఈ రూల్ అమలు
తాజాగా నిబంధన ఢిల్లీకి మాత్రమే పరిమితం కాదు. గాజియాబాద్, గౌతమ్ బుద్ధనగర్ (నోయిడా), గురుగ్రామ్, సోనిపత్ వంటి ఎన్‌సీఆర్ ముఖ్య నగరాల్లో ఈ నియమం 2025 నవంబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది. అయితే మిగిలిన ఎన్‌సీఆర్ నగరాలు ఫరీదాబాద్, పానిపట్, కర్నాల్, బళ్లభ్‌గఢ్, భివాడి, రేవాడి, పల్వల్, రోహ్తక్, జజ్జర్, మహేంద్రగఢ్, హాపుర్, మెరట్, ముజఫర్‌నగర్, షామ్లీ, బాగపత్, అలీగఢ్, అల్వార్‌లలో 2026 ఏప్రిల్ 1 నుంచి ఈ ఆదేశం అమల్లోకి వస్తుంది.
నంబర్ ప్లేట్ స్కాన్ చేసి సమాచారం సేకరిస్తారు
CAQM ఆదేశాల ప్రకారం ఢిల్లీ, ఎన్‌సీఆర్ పెట్రోల్ బంకుల్లో ANPR (ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్) కెమెరాలు ఉన్నాయి. లేకుంటే ఏర్పాటు చేస్తారు. అవి వాహనాల నంబర్ ప్లేట్‌లను స్కాన్ చేసి వాహనాల ఏజ్‌ను కాలుష్య ప్రమాణాల సమాచారాన్ని సేకరిస్తాయి. ఈ కెమెరా వ్యవస్థ ద్వారా నిషేధించిన వాహనాలకు పెట్రోల్, డీజిల్ నింపుతున్నారా లేదా అనేది తెలుస్తుంది.
ఈ వాహనాలకు ఢిల్లీలో నో ఎంట్రీ
అదనంగా, 2025 నవంబర్ 1 నుంచి ఢిల్లీలో BS-6 ప్రమాణాల కంటే తక్కువగా ఉన్న పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాణిజ్య వాహనాలను ఢిల్లీలో ప్రవేశాన్ని నిషేదించారు. ఢిల్లీ వెలుపలే వాటిని గుర్తించి ఆపేస్తారు. ఢిల్లీకి స్వచ్ఛమైన వాతావరణం అందివ్వాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ వాహనాలకు కొంత ఉపశమనం
ఆహార పదార్థాలు, మందులు లేదా ఇతర అవసరమైన గూడ్స్ తీసుకువచ్చే BS-6 కాని వాణిజ్య వాహనాలకు కొంత ఉపశమనం లభించింది. కానీ ఈ వాహనాలను కూడా 2026 అక్టోబర్ 31 నుంచి ఢిల్లీలోకి ప్రవేశం పూర్తిగా నిషేధించారు.
దేశ రాజధాని, ఎన్‌సీఆర్‌లో కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఇప్పటివరకు CAQM తీసుకున్న అతిపెద్ద కఠినమైన చర్య ఇది. దీని ప్రభావం ఢిల్లీలోని లక్షల వాహన యజమానులపై పడుతుంది. ఇంధన కేంద్రాల్లో పర్యవేక్షణ సాంకేతికతలో పెద్ద మార్పు కనిపిస్తుంది.
ఢిల్లీలో పాత వాహనాల సంఖ్య ఎంత?
ఒక్క ఢిల్లీలో ప్రస్తుతం 61 లక్షలకుపైగా 15 ఏళ్లకుపైబడిన పెట్రోల్ వాహనాలు, 10 ఏళ్లకుపైబడిన పాత డీజిల్ వాహనాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఎన్‌సీఆర్ నగరాల్లో 12 లక్షలకుపైగా ఉన్నాయి. హర్యానా ఎన్‌సీఆర్‌లో ఈ సంఖ్య 27 లక్షలకుపైగా ఉంది. రాజస్థాన్ ఎన్‌సీఆర్‌లోని నగరాల్లో ఈ సంఖ్య 6 లక్షల 20 వేలకుపైగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ వాహనాలకు ఇంధనం ఇవ్వకూడదనే ఆదేశం అమలులోకి వచ్చిన తర్వాత లక్షల వాహన యజమానులు ప్రభావితం కావడానికి అవకాశం ఉంది.





















