Paytm CEO Arrest: పేటీఎం ఫౌండర్, సీఈవో అరెస్టు - వెంటనే విడుదల, ఇంతకీ ఆయన చేసిన తప్పేంటో తెలుసా?
Paytm CEO: విజయ్ శేఖర్ శర్మ ల్యాండ్ రోవర్ వాహనం వాడుతున్నారు. ఆ వాహనం సరిగ్గా ఢిల్లీలో ఓ డీసీపీ స్థాయి అధికారి కారునే ఢీకొంది. ఈ సంఘటన ఫిబ్రవరి 22న జరిగింది.
పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ అరెస్టు అయ్యారు. ఆయన అరెస్టయిన వెంటనే బెయిల్‌పై కూడా విడుదలయ్యారు. ఓ కారు ప్రమాదం కేసులో ఆయన ఇరుక్కోవడంతో విజయ్ శేఖర్ శర్మ అరెస్టు కావాల్సి వచ్చింది. గత ఫిబ్రవరి ఆయన కారు ఏకంగా ఓ పోలీసు ఉన్నతాధికారి కారునే గుద్దింది.
ఢిల్లీలోని మాల్వియా నగర్ ప్రాంతంలోని మదర్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శంకర్ శర్మ కారు ప్రమాదానికి గురైంది. విజయ్ శేఖర్ శర్మ ల్యాండ్ రోవర్ వాహనం వాడుతున్నారు. ఆ వాహనం సరిగ్గా ఢిల్లీలో ఓ డీసీపీ స్థాయి అధికారి కారునే ఢీకొంది. ఈ సంఘటన ఫిబ్రవరి 22న జరిగింది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటన తర్వాత విజయ్ శేఖర్ శర్మ తన వాహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ల్యాండ్ రోవర్ ఢీకొన్న వాహనం సౌత్ ఢిల్లీ డీసీపీ వాహనం. డ్రైవర్ పెట్రోల్ నింపడానికి కారును తీసుకెళ్తున్నాడు. అప్పుడు జరిగిన ఆ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
నెంబరు ద్వారా కనిపెట్టేసిన పోలీసులు
ఆ వాహనం గుర్గావ్‌కు చెందిన ఓ కంపెనీ పేరు మీద రిజిస్టర్ చేసి ఉంది. పోలీసులు కంపెనీని సంప్రదించగా.. వాహనాన్ని గ్రేటర్ కైలాష్ పార్ట్ - 2కి చెందిన విజయ్ శేఖర్ శర్మ నడుపుతున్నట్లు గుర్తించారు. అనంతరం పోలీసులు విజయ్ శేఖర్ శర్మను అరెస్ట్ చేశారు. అయితే, బెయిలబుల్ సెక్షన్ల కారణంగా, అతనికి వెంటనే బెయిల్ మంజూరు అయింది.
Delhi | Vijay Shekhar Sharma, founder and CEO of Paytm, was arrested and later released on bail for ramming his car into the vehicle of DCP South in the month of February
— ANI (@ANI) March 13, 2022
పేటీఎం బ్యాంకుకు RBI ఝలక్!
మరోవైపు, ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై రెండు రోజుల క్రితమే నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కొత్త అకౌంట్లు తెరవకుండా ఈ ఆంక్షలు విధించింది. అయితే కొత్త కస్టమర్లు తమ బ్యాంకులో అకౌంట్లు తెరుచుకోలేకపోయినా.. యూపీఐ సర్వీసులు కోసం రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుందని తన కస్టమర్లకు పేటీఎం పేమెంట్స్ బ్యాంకు క్లారిఫికేషన్ ఇచ్చింది. అంటే యూజర్లు కొత్త పేటీఎం పేమెంట్స్ బ్యాంకు వాలెట్‌ను లేదా సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్లు తెరుచుకోలేరు. కానీ యూపీఐ సర్వీసులను మాత్రం పొందవచ్చు. ఈ మేరకు పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఒక సర్క్యూలర్‌ను జారీ చేసింది. ప్రస్తుత కస్టమర్ల అకౌంట్లు నిర్వహణలోనే ఉన్నాయని, కస్టమర్లు తమ వద్ద డిపాజిట్ చేసిన డబ్బులు పూర్తిగా సురక్షితమని పేటీఎం పేమెంట్స్ బ్యాంకు స్పష్టం చేసింది.