Agnipath Protest : అగ్నిపథ్ ఆందోళనలు, దేశవ్యాప్తంగా 595 రైళ్లు రద్దు
Agnipath Protest : సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ పై నిరసనల కారణంగా దేశవ్యాప్తంగా పలు రైళ్లు రద్దు అయ్యాయి. సోమవారం 500లకు పైగా రైళ్లు రద్దయ్యాయని రైల్వే శాఖ ప్రకటించింది.
Agnipath Protest : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. కొన్ని చోట్ల ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. అగ్నిపథ్ లో ఆందోళనలలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులు విధ్వంసం సృష్టించారు. దీంతో రైల్వే శాఖ అప్రమత్తం అయింది. ప్రధాన రైల్వేస్టేషన్ల వద్ద భద్రత పెంచింది. అలాగే దేశవ్యాప్తంగా 595 రైళ్లు రద్దు చేసింది. కేంద్ర మంత్రివర్గం జూన్ 14న అగ్నిపథ్ అనే సాయుధ దళాల రిక్రూట్మెంట్ స్కీమ్‌ను ఆమోదించింది. ఈ పథకం కింద ఎంపికైన యువతను అగ్నివీర్స్ అని పిలుస్తారు. నాలుగు సంవత్సరాల పాటు సాయుధ దళాల రెగ్యులర్ కేడర్‌లో భారతీయ యువకులు పనిచేయడానికి అనుమతించే విధానం ఇది. దీనిపై ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, పంజాబ్ సహా వివిధ రాష్ట్రాల్లో నిరసనలు చెలరేగాయి. జార్ఖండ్, అసోంతో సహా కొన్ని చోట్ల ఆందోళనలు తీవ్రతరం కావడంతో నిరసనకారులు రైళ్లకు నిప్పుపెట్టి, వాహనాలను తగులబెట్టారు. కొందరు ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు.
Over 595 trains including 208 mail express and 379 passenger trains cancelled and 4 mail express and 6 passenger trains partially cancelled today due to agitations against #AgnipathScheme: Indian Railways
— ANI (@ANI) June 20, 2022
500కు పైగా రైళ్లు రద్దు
అగ్నిపథ్‌పై ఆందోళనల కారణంగా 208 మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 379 ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. నాలుగు మెయిల్ ఎక్స్‌ప్రెస్, 6 ప్యాసింజర్ రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. రద్దయిన వాటిలో 71 రైళ్లు దిల్లీకి రాకపోకలు సాగించే ప్రయాణికులవేనని తెలుస్తుంది. అగ్నిపథ్ ను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్రపతిని కోరుతూ సోమవారం జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహం చేపట్టింది.
కాంగ్రెస్ నిరసనలు
కాంగ్రెస్ నిరసనల నేపథ్యంలో దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు మూతపడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన, రాహుల్ గాంధీ ఈడీ విచారణతో పోలీసులు దిల్లీలోని పలు రహదారులను మూసివేశారు. కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేష్ ఆదివారం ట్విట్టర్‌లో మాట్లాడుతూ, “అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా, ఎంపీ రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రతీకార రాజకీయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు శాంతియుత నిరసనలు కొనసాగిస్తారని” అన్నారు.
అగ్నివీర్ల వయోపరిమితి పెంపు
ఝార్ఖండ్‌లోని అన్ని పాఠశాలలు సోమవారం మూసివేశారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు వ్యతిరేకంగా నిరసనల మధ్య రాంచీలోని వివిధ ప్రదేశాలలో భద్రతా సిబ్బందిని మోహరించారు. ఈ సంవత్సరం మొత్తం 46,000 మంది అగ్నివీర్లను నియమిస్తామని త్రివిధ దళాలు ప్రకటించాయి. భవిష్యత్ లో ఇది 1.25 లక్షలకు చేరుకుంటుందని ఒక సైనిక అధికారి తెలిపారు. నిరసనల నేపథ్యంలో 2022 రిక్రూట్‌మెంట్ కోసం అగ్నివీర్‌ల రిక్రూట్‌మెంట్ గరిష్ట వయోపరిమితిని 21 సంవత్సరాల నుండి 23 సంవత్సరాలకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.