No Confidence Motion: లోక్‌సభలో వీగిపోయిన అవిశ్వాస తీర్మానం - సభలో మూజువాణి ఓటింగ్
అవిశ్వాసంపై ప్రధాని మోదీ లోక్‌సభలో సమాధానం ఇస్తూ.. కాంగ్రెస్ పార్టీతో పాటుగా విపక్షాలను, వారు కలిసి ఏర్పాటు చేసిన INDIA కూటమిని ఎండగట్టారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంపై పార్లమెంటులో విపక్షాల కూటమి I.N.D.I.A ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్‌సభలో వీగిపోయింది. స్పీకర్ మూజువాణీ ఓటింగ్ నిర్వహించారు. అనంతరం ఈ తీర్మానం వీగిపోయినట్లుగా ప్రకటించారు. అంతకుముందు ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ సుదీర్ఘంగా మాట్లాడారు. అవిశ్వాసంపై ప్రధాని మోదీ లోక్‌సభలో సమాధానం ఇస్తూ.. కాంగ్రెస్ పార్టీతో పాటుగా విపక్షాలను, వారు కలిసి ఏర్పాటు చేసిన INDIA కూటమిని ఎండగట్టారు. అలా ప్రధాని మాట్లాడుతుండగానే ఇండియా కూటమి ఎంపీలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు.
దాదాపు రెండు గంటల పాటు మాట్లాడిన తర్వాత కూడా ప్రధాని మోదీ మణిపూర్ ప్రస్తావన తీసుకురాలేదని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. కానీ, ప్రధాని మోదీ ప్రసంగం చివరికి వచ్చేసరికి మణిపూర్ అంశంపై మాట్లాడారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ చేసిన ప్రకటనపైనే అవిశ్వాస తీర్మానం పెట్టామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.
అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో ప్రధాని మాట్లాడుతూ.. 2018లో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. 2028లో కూడా విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడతాయని చెప్పారు. కాబట్టి, 2024 ఎన్నికల్లో అన్ని రికార్డులను బద్దలు కొట్టేలా విజయం సాధిస్తామని అన్నారు. ఇప్పుడు తాను 2028లో తెచ్చే అవిశ్వాస తీర్మానానికి వారికి ఒక టాస్క్ ఇస్తున్నానని.. దానికి కొంచెం ప్రిపరేషన్ తర్వాత రావాలని ఎద్దేవా చేశారు. అలా అయినా కనీసం ప్రతిపక్షానికి కూడా అర్హులని ప్రజలు భావిస్తున్నారని ప్రధాని అన్నారు.
బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)కి మెజారిటీ ఉన్నందున విపక్షాల అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అదేసమయంలో ప్రతిపక్ష పార్టీలకు ఫిక్స్‌డ్ నంబర్ లేదు. అయితే, ఎన్డీఏ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాక అవిశ్వాసం ఎదుర్కోవడం ఇది రెండో సారి.