(Source: ECI/ABP News/ABP Majha)
Supreme Court: న్యూస్ క్లిక్ వ్యవస్థాపకునికి సుప్రీంకోర్టులో ఊరట - అరెస్ట్ చెల్లుబాటు కాదన్న న్యాయస్థానం
Prabir Purakayastha: ఆన్ లైన్ వార్తా పోర్టల్ 'న్యూస్ క్లిక్' వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థకు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆయన అరెస్ట్ చెల్లుబాటు కాదని కోర్టు తెలిపింది.
Supreme Court Key Decision On News Click Founder Arrest: ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ 'న్యూస్ క్లిక్' వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద ఆయన అరెస్ట్ చెల్లుబాటు కాదని జస్టిస్ బీ.ఆర్.గవాయి, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం బుధవారం ప్రకటించింది. గతేడాది అక్టోబర్ 4న రిమాండ్ ఉత్తర్వులు జారీ కాకముందు పురకాయస్థకు కానీ, అతని న్యాయవాదికి కానీ అరెస్టుకు దారి తీసిన పరిస్థితులను లిఖిత పూర్వకంగా తెలియజేయలేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ కారణంగా అతని అరెస్ట్ చెల్లదని ప్రకటిస్తూ.. కస్టడీ నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. పురకాయస్థ అరెస్ట్, తదనంతరం ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులు కూడా చట్ట ప్రకారం చెల్లదని ప్రకటిస్తూ వాటిని రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
తీహార్ జైలు నుంచి విడుదల
కోర్టు ఆదేశాల మేరకు రూ.లక్ష విలువైన వ్యక్తిగత బాండ్ ను, అంతే మొత్తానికి మరో 2 పూచీకత్తులను ప్రబీర్ పురకాయస్థ బుధవారం రాత్రి సమర్పించారు. అనంతరం ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. కాగా, ప్రబీర్ గత 7 నెలలుగా జైలులోనే ఉన్నారు. న్యూస్ క్లిక్ కు చైనా నుంచి నిధులు అందుతున్నాయనే ఆరోపణలతో ఆ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థను, ఆ సంస్థ హెచ్ఆర్ విభాగాధిపతి అమిత్ చక్రవర్తిలను, ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు గతేడాది అక్టోబర్ 3న అదుపులోకి తీసుకున్నారు. తమ అరెస్ట్ ను సవాల్ చేస్తూ.. ఇద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, అప్రూవర్ గా మారి జైలు నుంచి విడుదలైన అమిత్ చక్రవర్తి సుప్రీంకోర్టు నుంచి తన పిటిషన్ ఉపసంహరించుకున్నారు. ప్రబీర్ పురకాయస్థకు సైతం సుప్రీంకోర్టులో తాజాగా ఊరట లభించింది.