PM Modi: ప్రధాని మోదీని కలిసిన NBDA ప్రతినిధులు, మీడియా సమస్యల పరిష్కారానికి హామీ
PM Narendra Modi | ఎన్బీడీఏ మీడియా ప్రతినిధుల బృందం ప్రధాని మోదీని కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లింది. మీడియా సమస్యల పరిష్కారానికి ప్రధాని హామీ ఇచ్చారు.
NBDA Delegation Meeting with the PM Narendra Modi | న్యూఢిల్లీ: న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ప్రతినిధులు, డిజిటల్ అసోసియేషన్ (NBDA) బృందం ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఎన్‌బీడీఏ అధ్యక్షుడు రజత్ శర్మ నేతృత్వంలో కొందరు ప్రతినిధులు మంగళవారం నాడు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. న్యూస్ మీడియా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు, అడుగడుగునా ఎదురవుతున్న అడ్డంకులు, ఇతరత్రా సమస్యలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. డిజిటల్ విప్లవం కొనసాగుతున్న సమయంలో న్యూస్ మీడియాలో తలెత్తుతున్న కొత్త సమస్యలు, సవాళ్లపై ప్రధానితో ఎన్‌బీడీఏ ప్రతినిధులు చర్చించారు.
అసోసియేషన్ వెబ్‌సైట్ ప్రకారం, NBDAలో 27 ప్రముఖ వార్తా సంస్థలు, 125 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ప్రసార సేవల నియంత్రణ బిల్లుపై ఆందోళన నెలకొన్న తరుణంలో కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ నియంత్రణ చట్టం, 1995లో మార్పులు చేర్పులకు కేంద్రాన్ని కోరారు. అయితే మీడియా ప్రతినిధుల సమస్యలు విన్న ప్రధాని మోదీ టీవీ న్యూస్ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొని మీడియా ప్రతినిధుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మీడియాకు కేంద్రం నుంచి సహాయ సహకారాలపై ఎన్బీడీఏ అధ్యక్షుడు చర్చించారు. ఈ సమావేశంలో ఏబీపీ నెట్‌వర్క్ లిమిటెడ్ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ, న్యూస్ 24 బ్రాడాకాస్ట్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనురాధా ప్రసాద్ శుక్లా, టీవీ ఇండియా నెట్ వర్క్ లిమిటెడ్ వైస్ ఛైర్మన్ అండ్ ఎండీ కల్లి పూరీ భండాల్, జీ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్ అడ్వైజర్ అనిల్ కుమార్ మల్హోత్రా, న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ డైరెక్టర్ సంజయ్ పుగాలియా, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ వెంకట్, సన్ టీవీ నెట్‌వర్క్ లిమిటెడ్ ఎండీ ఆర్ మహేష్ కుమార్, న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ బిజినెస్ బెన్నెట్ కోల్మన్ సీఓఓ వరుణ్ కోహ్లీ, ఎన్‌బీడీఏ జనరల్ సెక్రటరీ అన్నె జోసెస్ పాల్గొన్నారు.