Dawood Ibrahim: మోదీ, యోగి ఆదిత్యనాథ్‌ను హత్య చేస్తామని బెదిరింపులు! దావూద్ గ్యాంగ్ పేరుతో కాల్
Mumbai Police: ఈ ఏడాది ఆగస్టులో కూడా ప్రధాని మోదీ కేరళ పర్యటన సందర్భంగా ప్రధానిపై ఆత్మాహుతి దాడి చేస్తామని బెదిరింపులు వచ్చాయి.
కరడుగట్టిన ఉగ్రవాది, అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఠాతో తనకు సంబంధం ఉందని చెప్పుకుంటున్న ఓ వ్యక్తి గడగడలాడించాడు. ఇతను ముంబయి పోలీసులకు ఫోన్ చేసి బెదిరించాడు. కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసి.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హత్యకు ప్లాన్ వేయాలని దావూద్ గ్యాంగ్ తనకు సుపారీ ఇచ్చిందని చెప్పాడు. తాను ప్రధాని, యూపీ సీఎం హత్యకు పథకం కూడా వేశానని చెప్పాడు. మంగళవారం (నవంబరు 21) ముంబయి పోలీసులకు వచ్చిన ఈ బెదిరింపు కాల్ ఘటన కలకలం రేపింది.
అందుకోసం తాను జేజే ఆసుపత్రిని బాంబుతో పేల్చివేస్తానని కాల్ లో బెదిరించినట్లుగా పోలీసులు చెప్పారు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 505 (2) కింద కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేశారు.
ముంబయి పోలీసులు చెప్పిన వివరాలివీ
దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ పేరుతో ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు కాల్స్ చేసినందుకు ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ముంబయి పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మోదీని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని చంపాలని దావూద్ ముఠా తనను కోరిందని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. జేజే ఆసుపత్రిని బాంబుతో పేల్చివేస్తానని కూడా ఫోన్ చేసిన వ్యక్తి బెదిరించాడు.
గతంలో కూడా ఇలాంటివే
ఈ ఏడాది ఆగస్టులో ప్రధాని మోదీ కేరళ పర్యటన సందర్భంగా ప్రధానిపై ఆత్మాహుతి దాడి చేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఓ వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. తన పక్కింటి వ్యక్తిని, తన మిత్రుడిని ఈ కేసులో ఇరికించడానికే అతను ఇలా చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.
గతంలో అక్టోబర్‌లో కూడా ముంబయి పోలీసులకు ఇలాంటి బెదిరింపు మెసేజ్‌లే వచ్చాయి. భారత ప్రభుత్వం రూ.500 కోట్లు చెల్లించి, కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను విడుదల చేయకపోతే, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అహ్మదాబాద్‌లోని అతని పేరు మీద ఉన్న స్టేడియంను పేల్చివేస్తామని ఓ వ్యక్తి హెచ్చరించాడు. దాడులు చేసేందుకు ఉగ్రవాదులను తాము మోహరించినట్లు ఈమెయిల్‌లో రాశాడు.