Monsoon 2023: కేరళను తాకిన రుతుపవనాలు- వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నైరుతి వానలు
Monsoon 2023: నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్టు ఐఎండీ అధికారికంగా ప్రకటించింది. ఏటా జూన్ మొదటి వారంలో నైరుతి దేశంలో ప్రవేశిస్తుంటాయి. ఈసారి కాస్త ఆలస్యంగా వచ్చాయి.
Monsoon 2023: దాగుడు మూతలు ఆడుతున్న రుతుపవనాలు భారత్ భూభాగంలోకి అడుగుపెట్టాయి. వారం రోజులుగా రుతుపవనాల రాకపై రకరకాల కథనాలు వెలువడ్డాయి. ఎల్ నినో కారణంగా మరింత ఆలస్యం కావచ్చని అనుకున్న టైంలో పరిస్థితులు అనుకూలించి కేరళను రుతుపవనాలు తాకాయి.
నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్టు ఐఎండీ అధికారికంగా ప్రకటించింది. ఏటా జూన్ మొదటి వారంలో నైరుతి దేశంలో ప్రవేశిస్తుంటాయి. అయితే వాతావరణంలో అనివార్య మార్పులు కారణంగా ఈసారి వాటి రాక మరింత ఆలస్యమవుతుందని... జూన్ రెండోవారంలో దేశంలోకి వచ్చే అవకాశం ఉందని ముందు అంచనా వేశారు. ప్రతికూల పరిస్థితుల కారణంగా కాస్త ఆలస్యంగా ఈసారి రుతుపవనాలు కేరళను తాకాయి.
భారత్ భూభాగంలోకి వచ్చిన నైరుతి రుతుపవనాలు కేరళ, లక్షద్వీప్ ప్రాంతాల్లో విస్తరించినట్టు వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి రుతుపవనాల రాకతో 24 గంటల పాటు వర్షాలు కురవబోతున్నాయి. ఇప్పటికే అలప్పుజా, ఎర్నాకుళం ప్రాంతాల్లో జోరువానలు పడుతున్నాయి. అక్కడి వాతావరణ శాఖ ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
కేరళను తాకిన రుతపవనాలు దేశంలో ఇతర ప్రాంతాల్లో విస్తరించేందుకు కూడా వాతావరణం అనుకూలంగా ఉందని భారత్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కర్ణాటక, తమిళనాడు మీదుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నాయి. ముందుగా రాయలసీమ ప్రాంతాన్ని పలకరించి తర్వాత ఇతర ప్రాంతాల్లోకి రానున్నాయి.