తమిళనాడు ఇన్‌ఛార్జి సీఎంగా ఉదయనిధి బాధ్యతలు చేపట్టనున్నారా ? సీఎం స్టాలిన్ ఏమంటున్నారు ?
Udaynidhi Stalin: తమిళనాడు ఇన్‌ఛార్జి ముఖ్యమంత్రిగా ఉదయనిధి బాధ్యతలు చేపట్టనున్నారా ? అతి చిన్న వయసులోనే సీఎంగా విధులు నిర్వహించబోతున్నారా ?
Tamilnadu Politics : తమిళనాడు ఇన్‌ఛార్జి ముఖ్యమంత్రి (Incharge Chief Minister ) గా ఉదయనిధి బాధ్యతలు చేపట్టనున్నారా ? అతి చిన్న వయసులోనే సీఎంగా విధులు నిర్వహించబోతున్నారా ? ముఖ్యమంత్రి (Chief Minister ) స్టాలిన్ (Stalin ) విదేశీ పర్యటనకు ముందు లేదా లోక్‌సభ ఎన్నికలకు ముందుగా పట్టాభిషేకం జరగనున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. డీఎంకే (Dmk)తో పాటు తమిళనాడులో ఎక్కడ చూసినా...ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. దీనిపై చర్చ జరగానికి కారణాలు ఉన్నాయి. ఉదయనిధికి మంత్రిగా బాధ్యతలు అప్పగించే ముందు ఇలాగే ప్రచారం జరిగింది. అనుకున్నట్లే ఉదయనిధికి పార్టీలో యువజన విభాగం బాధ్యతలు, శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్, మంత్రివర్గంలో చోటు దక్కాయి. తాజాగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విదేశీ పర్యటనకు వెళ్తుండటంతో...ఇన్‌ఛార్జి సీఎం అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.
స్టాలిన్ వారసుడని చెప్పేందుకే ఈ సంకేతాలా ?
ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెడతారని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని సీఎం స్టాలిన్, మంత్రి ఉదయనిధి వరుసగా ఖండిస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు ఆరోగ్య సరిగా లేదంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేయడంపై డీఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రిగా చేస్తారన్న వార్తలను ప్రతిపక్షాలు కావాలనే ప్రచారం చేస్తున్నాయని స్టాలిన్ మండిపడుతున్నారు. జరుగుతున్న ప్రచారంపై మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా కొట్టి పారేశారు. తాజాగా ఉదయనిధికి ఇన్‌ఛార్జి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. దీన్ని డీఎంకే నేతలు తొసిపుచ్చుతున్నారు. సీఎం పదవికి నిజమైన వారసుడు ఉదయనిధి అని చెప్పడానికే...ఈ సంకేతాలు పంపారన్న వార్తలు వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్.. చెన్నై నగర పరిధిలోని చెపాక్–తిరువల్లికేని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం క్రీడా యువజన, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు.
సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి
గతంలో సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. తమిళనాడులో జరిగిన ఓ సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. డెంగ్యూ, మలేరియా, దోమలు, కరోనా వైరస్‌ను ఏ విధంగా పూర్తిగా రూపమాపాల్సిన అవసరముందో అదే విధంగా సనాతనాన్ని మొత్తం రూపుమాపాలని ఉదయనిధి తెలిపారు. అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. న్యాయస్థానం కూడా జోక్యం చేసుకొని ఉదయనిధి స్టాలిన్ ను మందలించింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు అలాంటి మాటలు మాట్లాడవద్దని సూచించింది. మొన్నటికి మొన్న అయోధ్యలో రాముడి మందిరం, రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్బంగా...అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకం కాదని.. కానీ మసీదు పడగొట్టి మందిరం నిర్మించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. తమ పార్టీ ఏ మతానికీ వ్యతిరేకం కాదని.. కరుణానిధి కూడా ఇదే విషయాన్ని పదే పదే చెప్పేవారని ఉదయనిధి స్టాలిన్ గుర్తు చేశారు. ఆధాత్మికతను రాజకీయాలతో ముడిపెట్టడం మంచిది కాదన్నారు.