Operation Sindoor:ఆపరేషన్ సిందూర్ దాడుల్లో మసూద్ అజార్ బావమరిది సహా లష్కర్-ఎ-తోయిబా, జెఇఎం కమాండర్లు హతం
Operation Sindoor:మే 7న లష్కర్-ఎ-తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన ఐదుగురు అగ్రశ్రేణి కార్యకర్తలను భారతదేశం మట్టుబెట్టింది. ఈ విషయం ఆలోస్యంగా వెలుగులోకి వచ్చింది.

Operation Sindoor: మే 6-7 అర్ధరాత్రి ఆపరేషన్ సిందూర్ కింద భారత సైన్యం పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడిలో 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. దీనిలో భారత ప్రభుత్వం 100 మంది ఉగ్రవాదులను చంపినట్లు ధృవీకరించింది. దీనికి సంబంధించి, హతమైన అనేక మంది ఉగ్రవాదుల పేర్లను కూడా విడుదల చేశారు. ఈ జాబితాలో లష్కర్-ఎ-తోయిబా టాప్ కమాండర్ అబు జిందాల్, మసూద్ అజార్ బావమరిది మొహమ్మద్ జమీల్ సహా అనేక మంది ఉగ్రవాదులు ఉన్నారు.
ఈ ఉగ్రవాదులు భారతదేశంలో వివిధ దాడుల్లో పాల్గొన్నారు. భారత సైన్యం వైమానిక దాడిలో మౌలానా మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 14 మంది మరణించారు. దీనిపై మసూద్ అజార్ స్పందించి... దేవుడు తనను కూడా పిలిచి ఉంటే బాగుండునని తాను కోరుకుంటున్నానని చెప్పాడు.
ఆపరేషన్ సిందూర్‌లో కీలక ఉగ్రవాదులు మరణించారు
1. ముదస్సర్ ఖాదియాన్ అలియాస్ అబు జిందాల్ (లష్కర్-ఎ-తోయిబా)
అబు జిందాల్ మురిద్కేకు చెందిన మర్కజ్ తోయిబా అధిపతి మరియు లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాద కమాండర్. అతని అంత్యక్రియల్లో పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం పాల్గొని ప్రత్యేక గౌరవం ఇచ్చాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ పుష్పగుచ్ఛాలు ఉంచారు. ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో అంత్యక్రియలు జరిగాయి. పాకిస్తాన్ ప్రభుత్వానికి, లష్కర్-ఎ-తోయిబాకు మధ్య గట్టి బంధమే ఉంది.
2. హఫీజ్ మొహమ్మద్ జమీల్ (జైష్-ఎ-మహమ్మద్)
మౌలానా మసూద్ అజార్ పెద్ద బావమరిది. బహవల్పూర్‌లో ఉన్న మర్కజ్ 'సుభాన్ అల్లా' అధిపతి. అతను జైష్‌లోని యువతను తీవ్రవాదం వైపు మళ్లిస్తాడు. ఉగ్రవాద సంస్థకు నిధులు సేకరించేవాడు.
3. మొహమ్మద్ యూసుఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్జీ (జైష్-ఎ-మొహమ్మద్)
యూసుఫ్ అజార్ మసూద్ అజార్ రెండో బావమరిది, అతను ఉగ్రవాద సంస్థ జైష్ ఆయుధ శిక్షణా శిబిరాన్ని నిర్వహించేవాడు. అతను జమ్మూ కశ్మీర్‌లో అనేక ఉగ్రవాద ఘటనల్లో పాల్గొన్నాడు. 1999లో IC-814 విమానం హైజాక్ కేసులో కూడా వాంటెడ్‌గా ఉన్నాడు.
4. ఖలీద్ అలియాస్ అబూ ఆకాషా (లష్కర్-ఎ-తోయిబా)
ఈ ఉగ్రవాది జమ్మూ కశ్మీర్‌లో అనేక దాడుల్లో పాల్గొన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయుధాల అక్రమ రవాణా చేసేందుకు పెద్ద నెట్‌వర్క్ నడిపాడు. అతని అంత్యక్రియలు ఫైసలాబాద్‌లో జరిగాయి. దీనికి పాకిస్తాన్ సైన్యంలోని సీనియర్ అధికారులు డిప్యూటీ కమిషనర్ కూడా హాజరయ్యారు.
5. మొహమ్మద్ హసన్ ఖాన్ (జైష్-ఎ-మొహమ్మద్)
అతను పీఓకేలో జైష్ ఆపరేషనల్ కమాండర్‌గా ఉన్న ముఫ్తీ అస్గర్ ఖాన్ కాశ్మీరీ కుమారుడు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద దాడులను సమన్వయం చేయడంలో హసన్ ముఖ్యమైన పాత్ర పోషించాడు.
పాకిస్తాన్ పాత్ర ప్రశ్నార్థకంగా ఉంది
ఈ ఉగ్రవాదులకు ప్రభుత్వ గౌరవాలు, సైనికలతో కలిసి తుది వీడ్కోలు పలికిన విధానం చూస్తే ఉగ్రవాదులను రక్షించడమే కాకుండా వారికి పాకిస్థాన్ అంతర్గత మద్దతు అందిస్తుందని స్పష్టం చేస్తుంది. ఇది భారతదేశానికే కాకుండా మొత్తం ప్రపంచానికే ఆందోళన కలిగించే విషయం.





















