PM Modi: మన్ కీ బాత్‌లో తెలంగాణ మహిళలపై ప్రధాని మోదీ ప్రశంసలు, అద్భుతం చేశారంటూ కితాబు
PM Modi Mann Ki Baat | ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో మాట్లాడుతూ భారతదేశ పురోగతిని ప్రస్తావించారు. తెలంగాణ మహిళలు చిరుధాన్యాలతో బిస్కెట్లు, పర్యావరణ అనుకూల ప్యాడ్లను ప్రశంసించారు.

PM Modi About Telangana Women in Mann Ki Baat | న్యూఢిల్లీ: మన్ కీ బాత్ 123వ ఎపిసోడ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. భారతదేశ సామాజిక పురోగతి, ఆరోగ్య రంగంలో విజయాలు, మహిళా సాధికారతతో పాటు చారిత్రక మైలురాళ్ల గురించి ప్రస్తావించారు. ఇటీవల అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విషయాలను, స్ఫూర్తిదాయకమైన స్థానిక అంశాలు, దేశవ్యాప్తంగా జరుగుతున్న మార్పులను ప్రధాని మోదీ పేర్కొన్నారు. తెలంగాణలోని భద్రాచలం మహిళలు సాధించిన విషయాన్ని ముఖ్యంగా ప్రస్తావించారు.
భారతదేశంలో 64% మందికి పైగా సామాజిక భద్రత
భారతదేశంలో సామాజిక సంక్షేమం పెరిగిందని హైలైట్ చేశారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ: “అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) ప్రకారం దేశ జనాభాలో 64 శాతానికి పైగా, అంటే దాదాపు 95 కోట్ల మంది ఏదో ఒక సామాజిక భద్రతా పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. 2015 నుండి దేశం ఎంతగానో అభివృద్ధి చెందింది. 2015లో కేవలం 25 కోట్ల మంది మాత్రమే సామాజిక భద్రతను పొందారు.” అని పేర్కొన్నారు.
ట్రాకోమా రహిత దేశంగా భారత్: WHO
ప్రధాన ఆరోగ్య విజయాలను సాధిస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. “ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) భారతదేశం ట్రాకోమా నుండి పూర్తిగా విముక్తి పొందినట్లు ప్రకటించింది. ట్రకోమా అనేది శాశ్వత అంధత్వానికి దారితీసే వ్యాధి” అని మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు.
తెలంగాణ మహిళలపై ప్రధాని మోదీ ప్రశంసలు
దేశంలో మహిళా సాధికారితపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. తెలంగాణలోని భద్రాచలం ప్రాంతానికి చెందిన మహిళల ప్రయత్నాలను నేటి మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధాని మోదీ హైలైట్ చేశారు: “తెలంగాణలోని భద్రాచలం ప్రాంతానికి చెందిన మహిళలు మిల్లెట్‌లతో బిస్కెట్లు తయారు చేస్తున్నారు. ఆ మిల్లెట్ల బిస్కెట్లు ఎంతో ఆరోగ్యకరమైనవి. అందువల్ల హైదరాబాద్ నుంచి అవి లండన్‌కు కూడా ఎగుమతి అవుతున్నాయి.” దాంతో పాటు పర్యావరణ అనుకూల శానిటరీ ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంలో వారి కృషిని మెచ్చుకున్నారు. “వారు పర్యావరణ అనుకూల గిరి శానిటరీ ప్యాడ్‌లను తయారు చేస్తున్నారు. కేవలం 3 నెలల్లో ఆ మహిళలు ఏకంగా 40,000 ప్యాడ్‌లను తయారు చేసి విక్రయించారు” అని మోదీ గుర్తుచేశారు.
In the 123rd Episode of Mann Ki Baat, Prime Minister Narendra Modi says, "Women from Bhadrachalam in Telangana are making biscuits from millets - 'Shree Anna' and these biscuits are reaching from Hyderabad to London... They have also started making 'Giri Sanitary Pads' and… pic.twitter.com/vlJSZG0FQt
— ANI (@ANI) June 29, 2025
యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం
యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుండటంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. “ఇటీవల అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నాం. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అవుతోంది. అనారోగ్య సమస్యలకు యోగా చెక్ పెడుతోంది. శారీరక, మానసిక ఆరోగ్యం యోగా ద్వారా సాధ్యం. యుద్ధాలు సైతం యోగా ద్వారా ఆగిపోతాయని” మోదీ అన్నారు.
అమర్‌నాథ్ యాత్ర పునఃప్రారంభం: మోదీ శుభాకాంక్షలు
పవిత్ర యాత్ర అమర్‌నాథ్ యాత్ర పునఃప్రారంభంపై సంతోషంగా ఉన్నారు. “అమర్‌నాథ్ యాత్ర చాలా కాలం తర్వాత ప్రారంభమైంది. యాత్రికులందరికీ శుభాకాంక్షలు’ తెలిపారు ప్రధాని మోదీ.
ఎమర్జెన్సీపై
భారతదేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాత రోజులను ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. ఎమర్జెన్సీని వ్యతరికేంచి పోరాడిన వారిని గౌరవించాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు. “ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన బాబు జగ్జీవన్ రామ్ వంటి వారిని మనం గుర్తుంచుకోవాలి. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి అలాంటి వారి పోరాటాలు మనకు స్ఫూర్తినిస్తాయని” అన్నారు.






















