Manipur Viral Video Case: మణిపూర్‌లో మహిళల్ని నగ్నంగా ఊరేగించిన కేసులో ఆరుగురిపై సీబీఐ చార్జిషీట్
Manipur Viral Video Case: మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో గౌహతిలోని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట సీబీఐ సోమవారం ఆరుగురు నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేసింది.
Manipur Viral Video Case: మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో గౌహతిలోని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట సీబీఐ సోమవారం ఆరుగురు నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. కలహాలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను ఒక గుంపు నగ్నంగా ఊరేగించిన కేసులో విచారణ అనంతరం సీబీఐ చార్జి్షీట్ దాఖలు చేసింది. మే 4న మణిపూర్‌లో ఒక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను కొంతమంది పురుషులు నగ్నంగా ఊరేగించినట్లు పేర్కొంది. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ మేరకు మే 4న 800 నుంచి 1000 మందితో కూడిన పురుషుల గుంపు బాధితురాలి సోదరుడు, తండ్రిని హత్య చేశారు. ఆ కుటుంబంలోని ముగ్గురు మహిళల్లో ఒకరిపై సామూహిక అత్యాచారం జరిగింది.
కేసు విచారణకు 53 మంది అధికారులు
మణిపూర్ అల్లర్లలో వెలుగుచూసిన లైంగిక హింస వీడియో కేసును కేంద్రం సీబీఐకి అప్పగించింది. ఈ కేసును విచారించడానికి సీబీఐ దేశవ్యాప్తంగా ఉన్న తన యూనిట్ల నుంచి 53 మంది అధికారులను నియమించింది. అందులో 29 మంది మహిళా అధికారులు ఉన్నారు. ముగ్గురు డీఐజీలు లవ్లీ కతియార్, నిర్మలాదేవి, మోహిత్ గుప్తాతోపాటు ఒక ఎస్పీ రాజ్‌వీర్ సైతం ఉన్నారు. ఇద్దరు అదనపు పోలీసు సూపరింటెండెంట్లు, ఆరుగురు డిప్యూటీ సూపరింటెండెంట్లు ఆఫ్ పోలీస్‌లు 53 మంది సభ్యుల బృందంలో ఉన్నారు. వీరంతా మొత్తం దర్యాప్తును జాయింట్ డైరెక్టర్ ఘనశ్యామ్ ఉపాధ్యాయ్‌కు తమ నివేదికను నివేదించనున్నారు.
కాగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఒకే కేసులో ఇంత భారీ సంఖ్యలో మహిళా అధికారులను తీసుకోవడం ఇదే తొలిసారి. సీబీఐ విచారిస్తున్న ఈ కేసుల్లో చాలా వరకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989లోని నిబంధనలకు సంబంధించినవని, వీటిని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారి దర్యాప్తు చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఇలాంటి కేసుల్లో డీఎస్పీలు పర్యవేక్షకులుగా ఉండటం సాధ్యం కాదని, దర్యాప్తును పర్యవేక్షించడానికి సీబీఐ ముగ్గురు డీఐజీలను ఒక ఎస్పీని నియమించారు. అలాగే ఈ బృందంలో 16 మంది ఇన్‌స్పెక్టర్లు, 10 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు కూడా ఉంటారు.
మణిపూర్ విషయంలో దర్యాప్తులో పక్షపాత ఆరోపణలు రాకుండా స్థానిక అధికారుల పాత్రను తగ్గించడానికి సీబీఐ ప్రయత్నిస్తోందని అధికారులు చెప్పారు. ముఖ్యంగా ఇరు వర్గాల వ్యక్తుల ప్రమేయం ఉండకుండా ఉందేందుకు చర్యలు తీసుకుంది. దానితో పాటు ఈఘటనలపై సీబీఐ ఎనిమిది కేసులు నమోదు చేసింది. ఇందులో రెండు కేసులు మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసుకు సంబంధించినవి. మణిపూర్ హింసాకాండకు సంబంధించి మరో తొమ్మిది కేసులను దర్యాప్తు చేసేందుకు సీబీఐ సిద్ధమైంది. దీంతో సంస్థ విచారించనున్న మొత్తం కేసుల సంఖ్య 17కు చేరింది.ఈ కేసులో కాకుండా మహిళలపై నేరాలు, లైంగిక వేధింపులకు సంబంధించిన మరే ఇతర కేసులను కూడా ప్రాధాన్యత ఆధారంగా విచారిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో చురచంద్‌పూర్ జిల్లాలో జరిగిన లైంగిక వేధింపుల కేసును కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ స్వీకరించే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా మార్చి 3న మణిపూర్ హింస మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు.మే 4న కుకి జాతికి చెందిన ఓ గ్రామంపై దాడి చేసిన దుండగులు.. ఇద్దరు మహిళలను నగ్నంగా చేసి, ఊరేగించారు. ఓ ఫేక్ వీడియోను చూసి, కోపంతో ఈ దారుణానికి ఒడిగనట్టు తెలుస్తోంది. బాధితుల్లో ఒకరిపై సామూహిక అత్యాచారం కూడా జరిగింది, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు జులై 26 వెలుగులోకి రాగా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.